ఖరీఫ్ వరకే రైతుల తరపున ప్రీమియం చెల్లింపు
ఖరీఫ్‌లో 22 పంటలకు, రబీలో 15 పంటలకు వర్తింపు
సమయం లేనందునే ఖరీఫ్‌కు ఉచిత బీమా
రబీ నుంచి రైతుల ప్రీమియం వాటా వారే చెల్లించాలి
9 క్లస్టర్లలో పీఎంఎఫ్‌బీవై, 5 క్లస్టర్లలో ఆర్‌డబ్ల్యూబీసీఐ బీమా
2024–25 సీజన్‌కు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఉచిత పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ భారాన్ని రైతులే భరించాలని తేల్చి చెప్పేసింది. రైతులపై పైసా భారం పడకుండా యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
2024–25 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత ఖరీఫ్ వరకు మాత్రమే.. అది కూడా సమయం లేని కారణంగా రైతుల తరపున ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ నుంచి మాత్రం ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని, వారికే పంటల బీమా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ పంట ఆధారంగానే పంటల బీమా
ఖరీఫ్– 2024, రబీ 2024–25 సీజన్‌లలో దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేసే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటలకు అమలు చేసే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూ బీసీఐ)పై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖరీఫ్ సీజన్ వరకు ఈ పంట డేటా ఆధారంగా సోషల్ ఆడిట్ పూర్తయిన తర్వాత తుది జాబితాలో అర్హత పొంది, నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన వారికి బీమా వర్తింపచేస్తామని ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ వరకు గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది.
ఖరీఫ్‌లో దిగుబడి ఆధారిత పంటల పథకం కింద వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పెసర, మినుము, కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు, వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశనగ, ప్రత్తి, టమాటా, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అరటి పంటలకు బీమా వర్తింపచేయనుంది.
ప్రీమియం చెల్లించిన వారికే బీమా
రబీ–2024–25 సీజన్ నుంచి పంటల బీమాలో రైతులు స్వచ్చందంగా చేరాల్సిందేనని స్పష్టం చేసింది. రబీ సీజన్‌లో దిగుబడి ఆధారిత పథకం కింద వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, శనగ, రాజ్మా, మిర్చి, ఉల్లి, వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి, టమాటా పంటలకు బీమా వర్తింపచేయనున్నారు.
రబీ సీజన్‌లో బీమా చేయించుకోవాలంటే రైతుల వాటా ప్రీమియంను వారే చేయించాలని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ప్రీమియం మొత్తంలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే బీమా వర్తిస్తుందని పేర్కొంది.
పీఎంఎఫ్‌బీవై లో పంటకోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడి లెక్కించి హామీ దిగుబడి కన్నా తగ్గిన సందర్భంలో ఇన్సూ్యరెన్స్ యూనిట్ పరిధిలోని రైతులందరికీ నష్ట శాతం లెక్కించి బీమా పరిహారం చెల్లిస్తారు. పీఎంఎఫ్‌బీవై పథకాన్ని 9 క్లస్టర్స్ పరిధిలోనూ ఐదు బీమా కంపెనీలను, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పథకాన్ని ఐదు క్లస్టర్స్ పరిధిలో నాలుగు బీమా కంపెనీలను ఎంపిక చేసారు.
Comments
Please login to add a commentAdd a comment