
ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ
రైతు సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం
అన్నదాత సుఖీభవకు కావాల్సింది రూ.10,717 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే
ఈ లెక్కన 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం ఇవ్వలేమని స్పష్టీకరణ
ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి కేటాయింపులు నిల్..
వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలైన పథకాలనే వల్లె వేసిన మంత్రి
ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీలకు కేటాయింపులు శూన్యం
ధరల స్థిరీకరణ నిధికి అత్తెసరు కేటాయింపు.. ఉచిత పంటల బీమాకు మంగళం
సచ్ఛంద బీమా నమోదు పథకానికి అరకొర కేటాయింపులు
సున్నా వడ్డీ రాయితీ పథకానికి అడ్డగోలుగా కోతలు
సాక్షి, అమరావతి : ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు.
ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్‌లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబి్ధదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్‌లో రూ.10,717 కోట్లు కేటాయించాలి.
కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
ఆర్‌ఎస్‌కేలు, అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు కేటాయింపులు నిల్
ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన విని్పస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది.
విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు.
రాయితీపై సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు. పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత పెట్టింది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు.
అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్ జగన్ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్‌తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది.
పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతి
గద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్‌కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు.
వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్‌లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు.
మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు.
రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment