ఖరీఫ్‌కు 6.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 6.50 లక్షల క్వింటాళ్లు
ఆర్బీకేల్లో 3.16 లక్షల క్వింటాళ్లు నిల్వ
40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనం విక్రయం
గిరిజన ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు
15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాల పంపిణీ
సాక్షి, అమరావతి: నైరుతి వచ్చేసింది. తొలకరి మొదలైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైన విత్తనాల పంపిణీ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతోంది. గిరిజన జిల్లాల్లో వరి విత్తన పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 15 వ తేదీ నుంచి మిగిలిన జిల్లాల్లో వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీజన్ ఏదైనా స్థానిక లభ్యతనుబట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు అందిస్తుంటారు.
సబ్సిడీ విత్తనం కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడేవారు. రోజుల తరబడి బారులు తీరి ఎదురు చూసేవారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గడిచిన ఐదేళ్లుగా సీజన్‌కు ముందుగానే నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అందించడంతో రైతుల కష్టాలకు తెరపడింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39.07 లక్షల ఎకరాల్లో వరి, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 8.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 6,31,742 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, 6,50,160 క్వింటాళ్లు అందుబాటులో ఉంది.
2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. పెసర, మినుము, కంది విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. జాతీయ ఆహార ధాన్యాల భద్రత పథకం అమలవుతున్న జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున, ఇతర జిల్లాల్లో కిలోకి రూ.5 చొప్పున రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 3,15,928 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. 48,177 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 67,617 క్వింటాళ్ల వరి, 84 క్వింటాళ్ల చిరుధాన్యాలు, కందులు, మినుములు, 50 క్వింటాళ్ల పెసర, రాజ్మా, నువ్వులు విత్తనాలను సిద్ధం చేశారు.
విత్తనం కోసం 3.76 లక్షల మంది రైతులు నమోదు
ఆర్బీకేల ద్వారా విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను అన్ని జిల్లాల్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,46,997 క్వింటాళ్ల విత్తనాల కోసం 3,75,583 మంది రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 1,04,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయింది.
సరిపడా విత్తన నిల్వలు
గతేడాది మాదిరిగానే సర్టిఫై చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్టతో పాటు వేరుశనగ విత్తనం పంపిణీ జోరుగా సాగుతోంది. మిగిలిన విత్తనాలను జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం.– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ
ఏజెన్సీలో 7వేల క్వింటాళ్ల పంపిణీ
గిరిజన ప్రాంతాల్లో గతంలో ఏటా 2, 3 వేల క్వింటాళ్లకు మించి విత్తనాలను పంపిణీ చేయలేదు. ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది 7 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment