సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై అవసరమైన విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 16 జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం 85,885 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వరి విత్తనాలు పంపిణీకి శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో...
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా అందిన సమాచారం మేరకు 85,885 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు ఇండెంట్ పంపారు. వాటిలో ప్రధానంగా 48,913 క్వింటాళ్ల శనగ, 21,064 క్వింటాళ్ల వరి, 12,407 క్వింటాళ్ల మినుము, 2,445 క్వింటాళ్ల వేరుశనగ, 894 క్వింటాళ్ల పెసర విత్తనాలతోపాటు 98 క్వింటాళ్ల నువ్వులు, 51 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 14 క్వింటాళ్ల రాగులు, ఉలవలు, జొన్న విత్తనాల కోసం ఇండెంట్లు వచ్చాయి.
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా బాపట్ల జిల్లాలో 20,850 క్వింటాళ్లు, గుంటూరులో 16,040 క్వింటాళ్లు, నెల్లూరు జిల్లాలో 14,384 క్వింటాళ్లు, పల్నాడులో 10,280 క్వింటాళ్లు, కృష్ణాలో 8,456, తిరుపతిలో 6,377, ప్రకాశంలో 5,005, ఏలూరు జిల్లాలో 1,096 క్వింటాళ్ల చొప్పున, మిగిలిన జిల్లాల్లో వెయ్యి క్వింటాళ్లలోపు విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు ఆర్బీకేల్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. విత్తనాలపై సబ్సిడీ రూపంలో రూ.64.45 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం
సిద్ధమైంది.
మొదలైన పంపిణీ
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో నారుమళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా మళ్లీ నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా రైతులకు 80 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయాలని సంకల్పించారు. నెల్లూరులో 80 శాతం సబ్సిడీపై వరి విత్తన పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లాలో కూడా వరి విత్తన పంపిణీ చేపట్టారు.
ఆందోళన వద్దు
తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్న రైతులకు ఏ విత్తనం కావాలన్నా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment