
సాక్షి, విశాఖపట్నం: జలకళ కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రిగ్ వాహనాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 వాహనాలు మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి లాంఛనంగా వాహనాలను ప్రారంభించారు. అనంతరం వాహనాలు ఆర్కే బీచ్ గుండా ర్యాలీగా వెళ్ళిన దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది. (చదవండి: మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్)
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ‘వైఎస్సార్ జలకళ’ ద్వారా వందలాది ఎకరాలు సాగులోకి రానున్నాయని తెలిపారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో నీటి కొరత నుంచి రైతులు బయటపడే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా రైతుల్లో ఆర్థిక భరోసా వస్తోందన్నారు. సీఎం జగన్ పదవి చేపట్టిన తర్వాత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రిజర్వాయర్ల నీటితో నిండాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ రైతుల్లో జలకళ స్పష్టంగా కనిపించిందన్నారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు..
గ్రామీణ ప్రాంతాల్లో బోరు ఉంటే రైతులు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారని అన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలకు ఒక్కొక్క రిగ్ వాహనం మంజూరైంది. కేవలం బోరు తీయడమే కాకుండా సన్నకారు రైతులకు మోటార్ కూడా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం పట్ల చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కృతజ్ఞతలు తెలిపారు.