బుట్టాయగూడెం: సన్న, చిన్నకారు రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బోర్ల పథకం సత్ఫలితాలిస్తోంది. గతంలో పూర్తిగా వర్షాధారం, చెరువు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉచితంగా బోర్లు వేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతిలేని భూములు సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో వైఎస్సార్ జలకళ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పొలాల్లో బోర్లు వేసి పంటలకు సాగు నీరు అందేలా కృషి చేస్తున్నారు.
జిల్లాలో వైఎస్సార్ జలకళ పథకంలో సుమారు 3,263 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు దరఖాస్తులు పరిశీలించి 3,075 బోర్లు మంజూరు చేశారు. వీటిలో ఇంతవరకూ రిగ్‌ల ద్వారా 516 బోర్లు విజయవంతంగా వేశారు. జిల్లాలోని 48 మండలాలు, 15 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 14 రిగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రిగ్‌ల ద్వారా రైతులకు ఉచితంగా బోర్లను వేసి సాగునీటి కొరతలేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సుమారు రూ. 100 కోట్ల వరకూ నిధులు కేటాయించారు. ఇంతవరకూ వర్షాధారం మీదే ఆధారపడిన రైతులు సొంతంగా ఉచితబోరు వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో..
ఈ పథకంలో భాగంగా గిరిజన ప్రాంతంలో వేస్తున్న ఉచిత బోర్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉచితబోర్ల పథకం ద్వారా 1132 బోర్లు మంజూరు కాగా ఇంత వరకూ 210 బోర్లు వేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత బోర్ల పథకంలో సాగునీటి సదుపాయం లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో బోర్ల ఏర్పాటు కోసం ఇంతవరకూ రూ. 2.88 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అధికారులు చెప్పారు. మంజూరైన బోర్ల పనులను గిరిజన మండలాల్లో వేగవంతం చేశారు.
నిబంధనల ప్రకారమే ఉచిత బోర్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారి భూముల్లో ఉచిత బోర్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఇంతవరకూ 516 బోర్లు విజయవంతంగా వేసి రైతుల భూములకు సాగునీరు అందించే ఏర్పాటు చేశాం. మంజూరైన మిగిలిన బోర్ల పనులు అన్ని మండలాల్లో వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నాం.
–డి.రాంబాబు, డ్వామా పీడీ, ఏలూరు
పుష్కలంగా సాగునీరు
ఉచిత బోర్ల పథకంలో ఇంతవరకూ వేసిన బోర్లు విజయవంతమయ్యాయి. గిరిజన ప్రాంతంలో సుమారు 210 బోర్లు వేశాం. రైతులు ఆయా భూముల్లో మొక్కజొన్న, వరి, ప్రత్తి, పొగాకు వంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరైన ప్రతీ రైతు భూమిలో బోర్లు వేసి సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం.
–కె. ప్రపుల్‌కుమార్, డ్వామా ఏపీడీ, జంగారెడ్డిగూడెం క్లస్టర్
సాగునీరు అందించడం ఆనందంగా ఉంది
నేను 12 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. 3 ఎకరాల 15 సెంట్ల భూమిలో జీడిమామిడి సాగు చేస్తున్నాను. సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాను. ఉచిత బోర్ల పథకంలో బోరు వేయడంతో కష్టాలు తీరాయి. ప్రస్తుతం సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాను.
–మడకం దుర్గారావు, గిరిజన రైతు, వంకవారిగూడెం
Comments
Please login to add a commentAdd a comment