సాక్షి, హైదరాబాద్: యాసంగిలో బోరు బావుల కింద వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిం చాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ రఘునందన్ రావు మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. యాసంగి సీజన్‌లో ఉత్పత్తి చేసిన బాయిల్డ్ రైస్‌ను తెలంగాణ నుంచి తీసుకునే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆ సీజన్‌లో వరి సాగును పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది.
ఈ నేపథ్యంలో రైతులను వరి సాగు నుంచి ఎలా మళ్లించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే యాసంగి సీజన్‌లో బోరుబావుల కింద వరి సాగును నియంత్రించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల బోరుబావులు ఉన్నాయి. గత యాసంగిలో మొత్తం 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఒక్క బోరు బావులు కిందనే 46 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వరి సాగు నుంచి రైతుల్ని మళ్ళించి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేసేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేటి నుంచి రైతు సదస్సులు
మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో రైతు అవగాహన సదస్సులు ప్రారంభించాలని, ఈ నెలాఖరు కల్లా ముగించాలని డీఏవోలకు సూచించారు.
వ్యవసాయ శాఖ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment