బోరుబావిలో చిన్నారి | rescue tean trying to save 1 year child | Sakshi
Sakshi News home page

బోరుబావిలో చిన్నారి

Published Sun, Nov 29 2015 6:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

బోరుబావిలో  చిన్నారి

బోరుబావిలో చిన్నారి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడిపోయిన బాలుణ్ని కాపాడేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ డీ ఆర్ ఎఫ్) బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా రాకేశ్ ను బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన భారీ యంత్రాలతో బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. అయితే బండరాళ్లు అడ్డుపడటం సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. కాగా, రాకేశ్ బావిలో పడిపోయి 24 గంటలు గడుస్తుండటంతో అతడి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మలు సహా బంధుగణం కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.

 

శనివారం ఉదయం సోదరుడు బాలేష్‌తో ఆడుకుంటున్న సమయంలో రాకేశ్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాత్రికిరాత్రే వేసి, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బోరును వదిలిళ్లడం ప్రమాదానికి కారణమైంది. అభం శుభం తెలియని పసిబిడ్డలను బోరుబావులు నిర్ధాక్షిణ్యంగా మింగేస్తున్నాయని, విఫలమైన బోరుబావులతో ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించింది. వాటి పూడ్చివేత కోసం అక్షర ఉద్యమం చేపట్టినా అనర్థాలు పునరావృతమవుతుండటం దారుణం.
 

సోదరుడు చెప్పడంతో..

సోదరుడు రాకేష్ బోరులో పడిపోయిన విషయం బాలేష్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్థులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. తాడు, కొక్కాలు వేసి లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలోనే కొంత మట్టి బోరులోకి పడినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న 108 సిబ్బంది 12 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకొని 8.22 నిమిషాలకు బోరుబావిలోకి ఆక్సీజన్ అందించారు. వెల్దుర్తి నుంచి శ్రీనివాస్ అనే యువకుడిని పిలిపించి నైట్ విజన్ కెమెరాలు బోరుబావిలోకి పంపించి రాకేష్ ఉన్న స్థానాన్ని గుర్తించారు. 30 ఫీట్ల లోతులో తలకిందులుగా ఉన్నట్టు, చుట్టూ మట్టి పేరుకుపోయినట్టు నిర్ధారించారు. స్థానికంగా లభించిన మూడు జేసీబీలు, బయటి నుంచి మూడు 200 సీసీ, రెండు 70సీసీ హిటాచి యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. వాటి ద్వారా బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపడుతున్నారు.



అడ్డుపడుతున్న బండ రాళ్లు...
భూమి పైపొరలోనే పెద్ద పెద్ద బండరాళ్లు రావటంతో జేసీబీలతో పని సాధ్యం కావడంలేదు. రాత్రి 11.45గంటల వరకు కేవలం 15 ఫీట్లలోతు గుంతను మాత్రమే తవ్వగలిగారు. 10 ఫీట్ల లోతులో మరో పెద్ద బండరాయి అడ్డుపడింది. దీన్ని బయటికి పెకిలించేందుకు మూడు హిటాచీలు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

గుంటూర్ నుంచి నిపుణులు...
ఈ బండరాళ్లు కోయడానికి హైదరాబాద్ నుంచి విపత్తు నివారణ యాజమాన్యం బృందాన్ని, గుంటూరు నుంచి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ బృందాన్ని రప్పిస్తున్నామని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మీడియాతో చెప్పారు. ఆదివారం వారితో బండరాయిని కోయిస్తామని చెప్పారు. జోగిపేట సీఐ నాగయ్య, పుల్కల్ ఎస్‌ఐ సత్యనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

సహాయక చర్యలను ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ ప్రకటించారు. ఆయన ఉదయం నుంచి సంఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు  సంఘటనా స్థలానికి సాయంత్రం వేళలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాబూమోహన్, కలెక్టర్ రోనాల్డ్ రాస్ సందర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కొద్దిసేపు అక్కడే ఉండి సహాయక చర్యలను సమీక్షించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement