గుప్త నిధుల కోసమా?.. డబ్బుల కోసమా?
బాల్కొండ ఖిల్లాలో ఘటన
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు.
దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్‌ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు.
బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్‌తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు.
కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్‌తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు.
హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment