hidden funds
-
బాలుడి దారుణ హత్య
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్‌ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్‌తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్‌తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..!
చిత్తూరు: తమ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని ఓ మందిరానికి వెళ్లిన తల్లిదండ్రులను ఏమార్చాడో మాంత్రికుడు. మీ అమ్మాయిని ఎక్కడకు తీసుకెళ్లినా రోగం నయంకాదన్నాడు. దీనికి కారణం మీ ఇంట్లో రూ.కోట్లు విలువజేసే వజ్రాలున్నాయన్నాడు. ధన పిశాచి మీ కూతురి ఒంట్లో చేరడంతో జబ్బున పడిందని పక్కాగా నమ్మించాడు. ఆపై బాధితులను ఏమార్చా కటకటాలపాలయ్యాడు. పలమనేరు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన సయ్యద్‌బాష కుమార్తెకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగోలేదు. గాలి సోకింటుందని ఎవరో చెప్పారని మదనపల్లి సమీపంలోని యాతాళవంక వద్ద దర్గాకు ఈనెల ఒకటో తేదీన తీసుకెళ్లారు. అక్కడ సయ్యద్‌బాష భార్యకు దూరపు బంధువైన అజీజ్ అలీ వారికి కనిపించి విచారించగా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఇవన్నీ కాదు తన స్నేహితుడున్నాడని అతనికి చూయిస్తే ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాడని తాము గంటావూరుకే వస్తామంటూ తెలిపాడు. దీంతో మదనపల్లెకు చెందిన రెడ్డి నరసింహులు, అజీజ్ అలీ వారింటికి వెళ్లి, వారికుమార్తెను పరిశీలించి ఇంట్లో భారీగా వజ్రాలున్నాయనియ ధన పిశాచి మీ కుమార్తెను పట్టుకుందని నమ్మించారు. ఇందుకు విరుగుడుగా మంచి ముహూర్తం చూసి మీ ఇంట్లోని వజ్రాలను వెలికితీసి అందులోని ఓ వజ్రాన్ని మీ కుమార్తెకు ఉంగరంగా తొడగాలని చెప్పారు. దీంతో ఈనెల 18న అమావాస్య రోజు సయ్యద్‌బాష ఇంటిలోని బెడ్రూంలో గుప్తనిధులున్నాయని చెప్పిన చోట ఐదడుగులు గోతిని తీసి ఈ ఇద్దరూ పూజలు చేశారు. అక్కడ రెండు విలువైన వజ్రాలు లభించాయంటూ నకిలీవి సయ్యద్‌బాషాకు ఇచ్చారు. అతని నుంచి రూ.20 వేలు పూజా ఖర్చులకు తీసుకొన్నారు. ఇదే గోతిలో ఇంకా చాలా విలువైన వజ్రాలున్నాయని అతన్ని నమ్మించారు. ఇందుకోసం ఇంకా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ జరుగుతున్న తతంగాలపై స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఉంచారు. ఇదే సమయంలో తనకు దీనిపై అనుమానముందంటూ బాధితుడు పోలీసులను బుధవారం ఆశ్రయించాడు. గురువారం మళ్లీ గంటావూరులోకి ఇంటివద్దకు వచ్చిన అజీజ్, రెడ్డి నరసింహలును స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నకిలీ వజ్రాలతో మోసం చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి వారి మాయ మాటలను ప్రజలు నమ్మరాదని సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. -
గుప్త నిధుల ముఠా కన్ను
ఉదయగిరి: 400 ఏళ్ల చరిత్ర గల ఉదయగిరి దుర్గంపై అపారమైన గుప్త నిధులు ఉంటాయని కొంతమంది నమ్మకం. శ్రీకృష్ణ దేవరాయలు ఏలుబడిలో ఈ ప్రాంతంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారు అనే నానుడి ఉండేది. దీంతో ప్రాచీన కట్టడాల కింద గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో ఎప్పుటి నుంచో అనేక ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు సాగిస్తున్నాయి. కొన్ని ముఠాలు సంపద కొల్లగొట్టాయనే ప్రచారం కూడా ఉంది. స్వాతంత్య్రం అనంతరం నుంచి ఉదయగిరి దుర్గంలో గుప్త నిధుల వేట కొనసాగుతోంది. దుర్గంపై జన సంచారం లేకపోవడంతో ముఠాలు అక్కడేమి చేస్తున్నది వెంటనే తెలియదు. పైగా దుర్గంపైకి ఎవరూ తరచుగా వెళ్లరు. దీంతో రోజుల తరబడి ముఠాలు మకాం వేసి ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తున్నాయి. గతంలో కూడా తవ్వకాలు ఉదయగిరి దుర్గంపై ఉన్న కట్టడాల్లో బంగారం, వజ్రాలు దొరుకుతాయనే నమ్మకంతో కొంతమంది స్థానికులు ౖపైపె తవ్వకాలు జరిపేవారు. అయితే బయట ప్రాంతాలకు చెందిన వారు పెద్ద స్థాయిలో తవ్వకాలు జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. 2012లో ఉదయగిరిలోని కృష్ణ మందిరంలో కూడా ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది. దీంతో ప్రాచీన కట్టడాలు దెబ్బతిన్నాయి. అప్పడు కొంతమంది అనుమానితులపై కేసులు నమోదు చేశారు. పేలుడు పదార్థాలు ఇదే మెదటిసారి దుర్గంపై గతంలో అనేక ముఠాలు తవ్వకాలు జరిపాయి. కానీ తాజాగా జరిపిన తవ్వకాల్లో పేలుడు పదార్థాలు వాడటం, అందులో ఓ ముఠా సభ్యుడు మృతిచెందడం సంచలనంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ఆపరేషన్ ఆలస్యంగా వెలుగులోకి రావడం.. ఓ వ్యక్తి చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
వైఎస్ఆర్ జిల్లా,ఒంటిమిట్ట : గంగపేరూరులోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కల్గిన వీరభద్రస్వామి ఆలయం శిథిలమైంది. ఆఖరికి వీరభద్రుడి శిల్పం, ఆనాటి శాసనాలు మాత్రమే మిగిలాయి. పురాతన ఆలయం కాబట్టి గుప్త నిధులు ఉంటాయనే ఆలోచనతో కొంత మంది 5 బైక్‌ల్లో వచ్చారు. అక్కడ ఉన్న వీరభద్రుడి శిల్పాన్ని తొలగించారు. శిల్పం ఉన్న చోట తవ్వకాలు జరిపారు. ఎంత తవ్వినా ఏమీ కనిపించక పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
చిత్తూరు, శాంతిపురం: మండలంలోని గణేష్‌పురం అటవీ సరిహద్దు ప్రాంతంలోని తిమ్మలమ్మ చెరువు గట్టు వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి భారీగా గుప్త నిధులు లభించాయనే ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కేరళకు చెందిన వారిగా భావిస్తున్న వ్యక్తులు సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వారు కొంతమంది స్థానికులతో కలిసి తవ్వకాలు జరిపినట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవల కుప్పం మండలంలోని గుడ్లనాయనపల్లి ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున గుప్త నిధుల వేట సాగిన నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలు కూడా అదే ముఠా పనై ఉంటుందని అంటున్నారు. -
ఆ గ్రామంలో గుప్తనిధులు..
గద్వాల క్రైం: ఆ గ్రామంలో గుప్తనిధులు దొరుకుతాయనే ప్రచారం ఉంది. అందులోనూ ఇంటి నిర్మాణాల కోసం గుంతలు తవ్వినా పురాతన నాణేలు బయటపడిన సంఘటనలు కోకొల్లలు. గత పదేళ్ల క్రితం పంచలోహాల విగ్రహాలు లభ్యమయ్యాయి. గద్వాల సంస్థానాధీశులు ఆ గ్రామాన్ని రాజుల రాజధానిగా కార్యకళాపాలు సాగించిన ఊరు. పురావస్తు శాఖ అధికారులు సైతం గ్రామంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అంతా సవ్యంగా ఉన్న గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు పూడూరు గ్రామ శివారులోని పురాతన విగ్రహాన్ని తొలగించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని బక్కమ్మ చెరువు సమీపంలో వెలసిన శివలింగంను గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి గుప్తనిధుల కోసం సుమారు ఆరు ఫీట్ల మేర తవ్వకాలు జరిపారు. దీంతో గ్రామస్తులు గద్వాల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని పురాతన ఆలయాల వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో విగ్రహాలు, బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయన్నారు. స్తబ్ధుగా ఉన్న గ్రామంలో మళ్లీ గుప్తనిధుల కోసం తవ్వకాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది సైతం.. గద్వాల రాజులు పూడూరు గ్రామాన్ని రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని పలు ఆలయాలను నిర్మించారు. చోళ్లరాజులు సైతం ఈ ప్రాంతంలో దేవాలయం నిర్మించారు. దీంతో గ్రామంలో నిధులు ఉన్నాయనే తెలుసుకుని పలువురు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అయితే గ్రామంలోని పురాతన ఆలయాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలపై నిషేధాజ్ఞలు విధించారు. గ్రామస్తులు సైతం ఇంటి నిర్మాణాలు, వ్యవసాయ పనుల కోసం గుంతలు తవ్విన క్రమంలో పలు విలువైన నాణేలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంకుడు గుంత కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో 20 పురాతన నాణేలు బయటపడ్డాయి. గ్రామస్తుల సమాచారం మేరకు వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గుప్తనిధుల కోసం రహస్యంగా పలువురు అంగతకులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు.. గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకొని పరిశీలించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. గుప్తనిధుల కోసం తవ్విన తవ్వకాలనే అంశాలపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గుప్తనిధుల వేట.. నరబలికోసమేనట..!
పలమనేరు: గుప్తనిధుల కోసం వెళితే కరెంటు షాక్ కొట్టి లబోదిబోమన్నారు. పక్కాగా స్కెచ్ వేసినా వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్ల అమర్చిన కరెంటు తీగల కారణంగా ప్లాన్ బెడిసి కొట్టింది. ఎనిమిదిమంది ముఠాలో ముగ్గురు కరెంటు షాక్ కొట్టింది. చివరకు తేలుకుట్టిన దొంగల్లా ఆస్పత్రిలో చేరారు. అయితే ఇంటిమీద కరెంటు షాక్ కొట్టిందంటూ కహానీలు చెప్పినా పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు బైటపడ్డాయి. బుధవారం ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు, ప్రస్తుతం పోలీసుల అదుపులోఉన్న వారు తెలిపిన వివరాల మేరకు... పకీర్పల్లె, చెన్నుపల్లె సమీపాన దొడ్డిపల్లె బీట్‌లోని లక్ష్మప్ప చెరువులో గుప్తనిధులున్నాయని ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కూర్మాయికి చెందిన హరీష్‌రెడ్డి, పట్టణంలోని గడ్డూరు కాలనీకి చెందిన మెకానిక్ గణేష్, ఇతని బంధువు పకీర్పల్లెకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్, కాబ్బల్లికి చెందిన గంగిరెడ్డి, బైరెడ్డిపల్లె మండలం చప్పిడిపల్లెకు చెందిన గురు, చౌడేపల్లె, అంగళ్లు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరితోపాటు తమిళనాడు రాష్ట్రం చెన్నెకి చెందిన జయరామ్ స్వామీజీ గుప్తనిధుల కోసం స్కెచ్ వేశారు. దీనికయ్యే ఖర్చును హరీష్రెడ్డిపై మోపడంతో అతను వారం రోజులుగా స్థానిక మదనపల్లె రోడ్డులోని ఓ లాడ్జిలో స్వామీజీని దింపాడు. గత గురువారం ఈ ముఠా అడవిలోకి గుప్తనిధులున్న ప్రాంతానికి వెళ్లి రెక్కీ నిర్వహించింది. ఆపై పక్కాగా ప్లాన్ చేసుకుని శనివారం రాత్రికి అక్కడ ప్రత్యేక పూజలు చేసి నిధుల కోసం తవ్వకం పనులకు పూనుకోవాలని నిర్ణయించారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆపరేషన్ ఇలా.... ఆటోడ్రైవర్ రమేష్ ఆటోలో గణేష్ గునపం, పార వేసుకుని రెక్కమాను సర్కిల్లో నలుగురిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆపై స్వామీజీ జతకలిశాడు. వీరు స్థానిక పెద్దచెరువు కట్టపైకి రాగానే స్కూటీలో ఇదే ముఠాలోని ఇద్దరు కలిశారు. ఆ తర్వాత అందరూ అడవి సమీపంలోకి రాత్రి 9.30కు చేరుకున్నారు. ఆటో వెళ్లేందుకు దారిలేకపోవడంతో అక్కడి మామిడితోపులో ఆటోను ఆపి కాలినడకను వీరు బయలుదేరారు. అడవికి దగ్గర్లోనే వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్లు కరెంటు తీగలను అమర్చిన విషయం తెలియక ముందువెళుతున్న గణేష్, అతని వెనుకనున్న జయరామ్, స్వామీజీ కరెంటు షాక్‌కు గురై గాయపడినట్టు తెలిసింది. ఇందులో గణేష్‌కు ఎక్కువగా గాయాలయ్యాయి.దీంతో ముఠా అదే ఆటోలో పలమనేరుకు చేరుకుంది. విషయం తెలిసి గణేష్ అన్న సురేష్ వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చాడు. వారు ఇంటిపై కరెంట్ షాక్ కొట్టిందంటూ ట్రీట్మెంట్ పొందారు. శనివారం రాత్రే తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లి, అక్కడ కూడా ఇదే స్టోరీ చెప్పి, చికిత్స పొందారు. అయితే స్వామీజీ మాత్రం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం తమిళనాడులో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. నరబలికోసమేనట..! తనకే పాపం తెలియదని, తనను పార, గునపం తీసుకురమ్మంటే తీసుకుని వారితో వెళ్లానని, అడవిలోకి వెళ్లాక తనకేమైందో అర్థం కాలేదని గడ్డూరుకు చెందిన గణేష్ మీడియాకు తెలిపాడు. గుప్తనిధులకోసం పూజలు చేసేటపుడు తనను కావుగా బలిచ్చేందుకు తీసుకెళ్లి ఉంటారని, తనపై యాసిడ్ పోశారని కూడా పేర్కొనడం గమనార్హం! మిస్టరీగా మారిన వైనం ఇదే విషయం పలమనేరు ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా.. సంబంధిత వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. కరెంటు షాక్‌కు గురవడంతోనే తాము వారిని వెనక్కి తీసుకొచ్చామని నిందితులు ప్రాథమిక విచారణలో చెప్పినట్టు ఎస్ఐ తెలిపారు. గణేష్ మాటల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. సంఘటన స్థలానికి 300 అడుగుల దూరంలో వ్యవసాయ మోటార్లున్నాయని, అక్కడినుంచి కరెంటు తీగలను లాగారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని ధీమాగా తెలిపారు. -
గుడిలో తవ్వకాలు జరిపిన పూజారి
తుక్కుగూడ: గుప్త నిధులు కోసం ఓ పూజారి తాను పూజలు చేసే ఆలయాన్నే తవ్వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జిన్నాయి గూడెం శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో సత్యంశివంసుందరం దాస్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల నుంచి ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనంది కావడంతో ఇక్కడ గుప్త నిధులతో పాటు స్వామి వారి బంగారు విగ్రహం ఉంటుందని భావించాడు. వాటిని పొందాలని కొంత మందితో కలిసి దాదాపు ఎనిమిది నెలల క్రితం గర్భగుడి ఎదుట సుమారు 12 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టాడు. ఇలా ప్రయత్నించిన అతనికి ఏమీ లభించలేదు. అయితే, ఆ ప్రదేశంలో గుప్త నిధులు ఏమీ లేకపోవడంతో గొయ్యిని మట్టి వేసి చదును చేశాడు. ఇలా వెలుగులోకి.. ఈ ఆలయ పూజారి వద్ద ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్పూర్కు చెందిన సోను అనే వ్యక్తి శిష్యుడిగా పనిచేశాడు. పూజారితో సోనుకు భేదాభిప్రాయాలు రావడంతో సోను నుంచి ఈనెల 11న ఖాన్పూర్కు వెళ్లిపోయాడు. ఆలయ పూజారి గుప్త నిధులు కోసం తవ్వకాలు చేసిన సమయంలో సోను తన సెల్ఫోన్లో తీసిన వీడియోను సోను గురువారం జిన్నాయిగూడెం, రావిర్యాల వాసులకు పోస్టు చేశాడు. ఈ గ్రామాల నుంచి స్థానికులు ఆలయానికి వస్తుండడంతో వారి ఫోన్ నంబర్లు సోను వద్ద ఉన్నాయి. సోను పంపిన వీడియో క్లిప్పింగ్‌లను చూసిన స్థానికులు శుక్రవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పూజారి సత్యంశివంసుందరందాస్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఉత్సవాల పనుల మాటున...
గుంటూరు, యడ్లపాడు(చిలకలూరిపేట): కొండవీడు కోట ఎందరో రాజులు పాలించిన గిరి దుర్గం. బౌద్ధులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగరరాజులు, కుతుబ్‌షాహీలు, ఫ్రెంచ్, బ్రిటీషువారు సైతం ఇక్కడ జెండా ఎగరేసిన వారే. క్రీ.పూ నుంచి క్రీ.శ వరకు ఎందరో సామంతులు, రాజులు, చక్రవర్తులు ఏలిన శతృదుర్బేధ్య గిరిదుర్గమిది. అసమాన, అనిర్వచనీయమైన చరిత్ర ఖజానాను దాచుకున్న అద్భుతగని ఈ ఖిల్లా. తెలుగువారి రాజసాన్ని, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని దశదిశలా వ్యాపింపజేసిన కీర్తిబావుటా కొండవీడు. కొండవీడులో ప్రాచీన కట్టడాలు, పాచిపట్టిన పెద్దపెద్ద కొండరాళ్లు ఉన్నాయనుకుంటే పొరపాటే. తరతరాలకు తర‘గని’ చరిత్రకు ఇక్కడ కొదవ లేదు. కొండచుట్టూనే కాదు కొండలపై కనిపించే కందకాలు, ధ్వంసమైన పురాతన కట్టడాలు, ముక్కలైన రాతి శిల్పాలు, దూరప్రాంతాలకు తరలివెళ్లిన అమూల్యమైన ఆయుర్వేద వనసంపద ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు గుప్తనిధుల కోసం దుండగుల యథేచ్ఛగా సంచరిస్తూ కొండలపైనే నివాసం ఉండి భారీ తవ్వకాలు చేయడానికి కారణం అపారమైన గుప్త నిధుల సంపద ఈ శిలలమధ్య కొలువై ఉండడమే. వివిధ శాఖల ఆధ్వర్యంలో చురుగ్గా పనులు రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలు కొండపైనే పలుమార్లు జరిగాయి. ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖలకు నిధులను కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ఘాట్‌రోడ్డు చివరి అంచునుంచి పురాతన కట్టడాల వరకు అప్రోచ్మార్గం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఘాట్‌రోడ్డుపై 300 విద్యుత్ స్తంభాలు, కలర్ లైటింగ్ ఏర్పాటు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కోట గ్రామంలోని మెట్ల మార్గం ఆధునికీకరణ పనులు, ఆర్డబ్ల్యూఎస్ శాఖతో కొండపై ఉన్న మూడు చెరువుల అభివృద్ధి, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. అయితే ఆయా పనులను అన్నింటినీ అటవీశాఖ సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కొండలపై బ్లాస్టింగ్, భారీ మిషన్లతో తవ్వకాలు, చెట్లు కొట్టడం, జంగిల్ క్లియరెన్సు, పురాతన కట్టడాల తొలగింపు తదితర పనులు ముమ్మరంగా చేస్తున్నారు. కొండెక్కిన పర్యవేక్షణ..! గతంలో 4కి.మీ వరకు ఘాట్‌రోడ్డుపైకి అనుమతించిన పర్యాటకులను సైతం కొండ కింది భాగంలోనే నిలిపివేశారు. కొండవీడు కొండలపై వివిధ పనుల కోసం మిషన్లతో ఎక్కడ పడితే అక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాని పనులు నిర్వహించే ప్రాంతాల్లో అధికారులకంటే అధికార పార్టీ వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉత్సవాల పనులు ప్రారంభించిన తర్వాత కూడా గుప్తనిధుల తవ్వకాలు చేస్తున్న ఓ బృందాన్ని కొందరు పట్టుకుని తరిమివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిని ఇక్కడకు రప్పించి తవ్వకాలకు ప్రోత్సహించిన వారు సమీప గ్రామాలకు చెందిన వారే కావడం, ఇంత జరిగినా సంబంధిత శాఖలు స్పందించక పోవడంపై ప్రజల అనుమానం మరింతగా బలపడుతోంది. ప్రాచీన కట్టడాల లోపల, వెలుపల మాత్రమే ఇప్పటివరకు గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి. ఉత్సవాల సందర్భంగా చేస్తున్న పనుల నిమిత్తం ప్రాచీన ఆలయాలను తొలగించడంతో ఆలయాల ధ్వజస్తంభం, గర్భాలయం కింద భాగాలపై గుప్తనిధులు ఉంటాయనే ప్రచారం మండలంలో బాగా వ్యాపించింది. కొండపైకి ఎవరినీ రానివ్వకుండా చేయడానికి ఇదో కారణమనే విమర్శలు వినవస్తోంది. సమీప గ్రామాలకు చెందిన కొందరు పనుల పర్యవేక్షణకు వెళ్లినట్లుగా తవ్వకాల వద్దనే ఉంటున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కొండపైనే కనిపించడంపై మండిపడుతున్నారు. పనులు నిర్వహించే క్రమంలో పురాతన వస్తువులు, విలువైన సంపద బయల్పడితే అవి మాయం అయ్యే అవకాశం ఉంటుందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల సమయంలో విధిగా పురావస్తు, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో పాటు పోలీసులు ఉండాలని, వారెవరూ కన్పించడం లేదని, కొత్త వ్యక్తులు అధికారుల మాదిరిగా సంచరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారసత్వ సంపద ను చోరుల నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు. -
తవ్వకాల్లో రాతి విగ్రహాలు లభ్యం
వైఎస్ఆర్ జిల్లా , మంగంపేట(ఓబులవారిపల్లె) : ఏపీఎండీసీ తవ్వకాల్లో కొండపై సోమవారం భారీమిషన్లతో కొండలను తొలగిస్తుండగా పురాతన కాలం నాటి కపిలేశ్వరస్వామికి సంబంధించిన మూలవిరాటు, రాతిశాసనాలు, గుప్తనిధులకు సంబంధించి గుర్తులు ఉన్న రాళ్లు బయటపడ్డాయి. వీటిని గ్రామస్తులు కట్టా పుట్టాలమ్మతల్లి గుడిలో భద్రపరిచి పూజలు నిర్వహిస్తున్నారు. మట్టిరాజుల కాలంలోనే కట్టాపుట్టాలమ్మ విగ్రహప్రతిష్ట జరిగినప్పుడు కొండపై కపిలేశ్వరస్వామి మూలవిరాటును కూడా ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ మట్లిరాజులకాలం నాటి గుప్తనిధులు ఉన్నాయని స్థానికంగా ప్రజలు ప్రచారం చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం కొండపై ప్రతిష్టించిన చారిత్రాక కపిలేశ్వరస్వామి శంఖు, చక్రం రాతివిగ్రహాలను మంగంపేట అగ్రహారంలోని ఓ ఇంటిలో ప్రతిష్టించి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. కొండపై అప్పట్లో ప్రతిష్టించిన రాతివిగ్రహాలతోపాటు ఐదు బురుజులు కూడా బయటపడ్డాయి. దీంతో ఏపీఎండీసీ గనుల విస్తరణకు సంబంధించిన తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన దేవాలయాల ఆనవాళ్లను లేకుండా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట గనుల విస్తరణలో భాగంగా సమీపంలోని కొండను తొలగించే పనులు ఏపీఎండీసీ నిర్వహిస్తోంది. కొండ కింద తూర్పున 1454 సంవత్సరంలో మహరాజ అచ్యుత్రాయులు వారు కట్టా పుట్టాలమ్మ తల్లి మూలవిరాటును ప్రతిష్టించారని ఇప్పటికీ కోరిన కోర్కెలు తీర్చేదేవతగా మహిమగల తల్లిగా గ్రామాల ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఎర్రగుంటకోట ప్రాంతాన్ని మట్టిరాజులు పాలించే కాలంనుంచి మంగంపేటలో సొరంగమార్గాలు ఉండేవని కట్టా పుట్టాలమ్మ కొండపై గుప్తనిధులు ఉన్నాయని పూర్వీకులు నుంచి చెబుతున్నారు. సంపదను దాచిపెట్టేందుకు రహస్యమార్గాలు ఈ ఏడాది మార్చినెలలో ఏపీఎండీసీ గనుల్లో నిర్వహించిన తవ్వకాల్లో రహస్యమార్గం బయటపడింది. ఈ రహస్యమార్గంలో అప్పట్లో మట్లిరాజు అయిన వెంకటరామరాజు వంశస్థులు తమ సంపదను దాచిపెట్టేందుకు, శత్రువుల బారినుంచి తమ కుటుంబసభ్యులను రహస్యమార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో బయటపడ్డ రహస్యసొరంగ మార్గంగుండా మట్లిరాజుల వంశీయులు ఏర్పాటు చేసుకున్నదిగా భావిస్తున్నారు. ఉపరితల భూభాగం నుంచి 30 నుంచి 40 అడుగుల లోతులో ఈ రహస్యమార్గం ఏర్పాటు చేశారు. వైకోట నుంచి మంగంపేట మీదుగా బుడుగుంటపల్లె వరకు రహస్యమార్గం ఉన్నట్లు సమాచారం. ఈ రహస్యమార్గం ఏపీఎండీసీ అధికారులు పేళుళ్లలో సహజంగా ఏర్పడ్డాయని అప్పటికి అప్పుడే పూడ్చివేశామని చెబుతున్నారు. చర్చనీయాంశంగా మారిన తవ్వకాలు ఏపీఎండీసీ నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, పురాతన కట్టడాలు, రాతి విగ్రహాలు, గుప్తనిధుల గురించి అంతటా చర్చనీయాంశంగా మారింది. ఏపీఎండీసీ గనుల విస్తరణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో అధికారులు బయటకు తెలియకుండా మిషన్లతో తొలగించి భూస్థాపితం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ రాతివిగ్రహాలు, రహస్యమార్గాలు ఇక్కడి చరిత్ర, గుడి, గుప్తనిధులుపై పురావస్తు అధికారులు అధ్యయనం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
లంకెబిందెల పేరుతో మోసం
నెల్లూరు, వెంకటాచలం: ‘మీ ఇంట్లోని బావి వద్ద రెండు లంకెబిందెలున్నాయి. తవ్వితే మీ దశ తిరుగుతుంది. రూ.లక్షలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. మిగిలిన సొమ్మును నమ్మకం కలిగిన వ్యక్తులకు వడ్డీకి ఇచ్చి కష్టం చేయకుండా జీవితాంతం బతికేయొచ్చు’ అంటూ ఓ మహిళ నమ్మ బలికింది. ఆమె మాటలు నమ్మి ఉన్న సొమ్మును పోగొట్టుకున్న వృద్ధ దంపతులు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు సోమవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. వారి కథనం మేరకు.. మండలంలోని అనికేపల్లి గ్రామానికి చెందిన ముసునూరు వెంకయ్య, నారమ్మ వృద్ధ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గొలగమూడిలోని అద్దె నివాసంలో ఉంటున్న బేల్దారి కూలి గోపి రెండునెలల క్రితం అనికేపల్లికి వచ్చాడు. వెంకయ్య నివాసం పక్కనే అతను పని చేసేవాడు. గోపి భార్య స్వర్ణలత అక్కడకు వచ్చేది. ఈక్రమంలో ఆమె మీ నివాసంలో బావి పక్కన లంకెబిందెలున్నాయని వెంకయ్యను, అతని భార్య నారమ్మను నమ్మించింది. వాటిని బయటకు తీయిస్తే అందులో ఉండే నగలతో మీ జీవితం మారిపోతుందని చెప్పింది. స్వర్ణలత మాటలు నమ్మిన వృద్ధ దంపతులు లంకెబిందెలు తవ్విం చాలని ఆమెకు చెప్పారు. దీంతో స్వర్ణలత పలు దఫాలుగా వారి నుంచి రూ.30 వేలు తీసుకుంది. దీపావళి రోజున స్వామిని తీసుకువచ్చి తవ్విస్తానని, ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని తెలిపింది. అయితే ఆమె రాలేదు. దీంతో ఆరాతీయగా పండగ మరుసటిరోజు నుంచి స్వర్ణలత, ఆమె భర్త గొలగమూడిలోని అద్దె నివాసంలో లేరని తెలియడంతో మోసపోయామని వెంకయ్య, నారమ్మ బోరున విలపిస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకోవచ్చని ఆశపడి కొంత అప్పు కూడా చేసి ఇచ్చామని వాపోతున్నారు. -
గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు
సాక్షి, చేవెళ్ల: హైటెక్ కాలంలో కూడా ఇంకా ప్రజలు మూఢ నమ్మకాలను వీడడం లేదు. గుప్త నిధులు ఉన్నాయని క్షుద్రపుజలు నిర్వహిస్తున్నారంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేవెళ్ల మండల కేంద్రంలోని తులసీ వాటర్‌ప్లాంట్‌కు సమీపంలో ఉన్న ఓ పురాతన దర్గా వద్ద సోమవారం అర్ధరాత్రి కొంత మంది దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా దర్గా వద్ద గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వాటర్ ప్లాంట్ వద్ద ఉండే యువకులు దర్గా వైపు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడం గుర్తించారు. అక్కడ ఎవరో వ్యక్తులు ఉన్నట్లు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ హడావుడిలో దుండగులు అక్కడే వారి బైక్‌ను వదిలి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా దర్గా వద్ద క్షుద్రపూజలకు ఉపయోగించిన నిమ్మకాయలు, కుంకుమ, ఆకులు, ఇతర పూజా సామగ్రి ఉంది. దర్గా మధ్యలో ఒక గుంత, దర్గాకు రెండు వైపుల రెండు గుంతలను తవ్వారు. దుండగులు మద్యం సేవించేందుకు తీసుకువచ్చిన బాటిళ్లు సైతం అక్కడ లభించాయి. తులసీ వాటర్ ప్లాంట్ వద్ద పనిచేసే యువకులు సమాచారంతో వచ్చిన పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం కూడా.. ఆరునెలల కిత్రం కూడా దర్గా ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కాలంలో కూడా ప్రజలు ఇలాంటి వాటిని నమ్మడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. లేనిపోని ఆశలకు పోయి ప్రమాదాల్లో చిక్కుకుంటారని, ప్రజలు ఇలాంటి వాటిని నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా మండలమంతా వ్యాపించడంతో మంగళవారం ప్రజలంతా దర్గా వద్దకు బారులు తీరారు. -
గుప్త నిధుల పేరుతో..
కర్నూలు, ఆలూరు: గుప్తనిధుల పేరుతో పురాతన ఆలయాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆలయాలు శిథిలమై ఉనికిని కోల్పోతున్నాయి. ఆలూరు పోలీసు సర్కిల్ పరిధిలో ఇలా సుమారు ఆరు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. గతేడాది హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని కొండపై సోమలింగేశ్వర దేవాలయంలో, హులే బీడు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం, హొళగుంద మండలం దేవరగట్టులో వెలసిన పురాతన బావిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గతంలో అధికార పార్టీకి చెందిన కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆస్పరి మండలం కైరుప్పల, కారుమంచి గ్రామాల్లో శ్రీ భోగేశ్వర ఆలయం, మల్లప్ప పడ తదితర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా కొందరు పట్టుబడ్డారు. దేవనకొండ మండలం తెర్నెకల్లు, పాలకుర్తి, నల్లచెలిమెల తదితర ప్రాంతాల్లో గుప్పనిధుల కోసం గతంలో వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల మళ్లీ తవ్వకాలు మొదలయ్యాయి. ఈ నెల 3న కారుమంచి గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన హంపి విరుపాక్షయ్య మఠాదీశుల పీఠానికి చెందిన శ్రీ భోగేశ్వర ఆలయంలో నిధుల కోసం శివలింగాన్ని ధ్వంసం చేశారు. నిధుల కోసం వివిధ రకాల పూజలు చేసి కట్టర్లతో శివలింగాన్ని తీయాలని ప్రయత్నించిగా విఫలమవడంతో లింగాన్ని తొలగించి మొత్తం పెకలించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందు ఆలయ సమీపంలో ప్రతిష్టించిన నాగదేవత విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారని చెప్పారు. నిధుల పేరుతో ప్రసిధ్ధి గాంచిన ఆలయాలను ధ్వంసం చేయడం తగదన్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి చర్యలు పునరావృతం కావని వారు పేర్కొన్నారు. -
ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు
తుగ్గలి: చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. రెండున్నర నెలలుగా కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద గుండు కింద సైతం తవ్వకాల పనులు చేపట్టారు. స్వామీజీలు, మాంత్రికులు, అధికారులు ఇలా ఎవరుపడితే వారు చెప్పిన చోటల్లా తవ్వకాల చేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు. తవ్వకాలకు నెల్లూరు వచ్చిన 12 మంది కూలీలు ఉదయం సాయంత్రం పనులు చేస్తున్నారు. తవ్వకాలను ఆదోని ఆర్డీఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, తుగ్గలి ఎస్ఐ పులిశేఖర్, ఆర్ఐ మధుసధనరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి పాల్గొన్నారు. ఏది ఏమైనా మరో వారం రోజుల పాటు తవ్వకాలు చేపట్టి ముగింపు పలకనున్నట్లు సమాచారం. -
నిధుల కోసం కోటలో తవ్వకాలు పునఃప్రారంభం
చెన్నంపల్లి(తుగ్గలి) : గుప్త నిధుల కోసం తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలు రెండు నెలల విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పురాతన కోటలో విశేషంగా గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారంతో గతేడాది డిసెంబర్ 13న అధికారులు తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు తవ్వకాలు చేస్తూ జీఐఎస్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో వివిధ సర్వేలు నిర్వహించారు. తవ్వకాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 16న సీతారామ లక్ష్మణుడు పంచ లోహ విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. లభ్యమైన విగ్రహాలను అదే రోజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, తహసీల్దార్ గోపాలరావు సమక్షంలో కర్నూలుకు తరలించారు. ఆ తర్వాత రెండు రోజులు డ్రిల్లింగ్ చేసి తవ్వకాలు ఆపేశారు. గతంలో తవ్వకాలకు ప్రయత్నించిన వారి సూచనల మేరకు ప్రారంభంలో తవ్వకాలు చేసినా ఎటువంటి ఆనవాలు లభ్యం కాకపోవడంతో కోటలో పురోహితులతో ప్రత్యేక పూజలు, మాంత్రికులతో తాంత్రిక పూజలు నిర్వహించారు. చివరకు జీఎస్ఐ అధికారులతో సర్వేలు నిర్వహించిన తర్వాత వారి సూచనల మేరకు తవ్వకాల పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరిగి శుక్రవారం కోటలో కొద్దిసేపు మట్టి తవ్వకాలు చేశారు. శనివారం మొదట్లో తవ్వకాలు చేసిన ప్రాంతం సమీపంలో ఉన్న బావిలాంటి గుంతలో వేసిన మట్టిని తిరిగి తొలగిస్తున్నారు. తవ్వకాలను ఆర్ఐ మధుసూదనరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి పర్యవేక్షించారు. -
గుప్త నిధుల కోసం శివాలయం ధ్వంసం
కర్నూలు, బూడిదపాడు(గూడూరు): మండలం పరిధిలోని పాత బూడిదపాడులో ఉన్న పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం గురువారం రాత్రి దుండగలు విఫలయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. కొంతమంది దుండగులు పాత బూడిదపాడులోని శివాలయం గర్భగుడి తలుపులు తొలగించి లోపల శివలింగాన్ని, పాశాన్ని గడ్డపారలతో పెకిలించారు. అనంతరం తవ్వకాలకు వీలుపడకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం పూజారి తిమ్మరాజు ఆలయానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి నిధులు చోరీకి గురికాలేదని వివరించారు. -
పట్టు వీడని ప్రభుత్వం
కర్నూలు ,తుగ్గలి: మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలపై అధికారులు పట్టువీడ లేదు. 21 రోజులుగా పెద్ద పెద్ద బండరాళ్ల కింద, కోట బురుజులో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికీ కావిటీ స్కానర్లు, రెసెస్టివిటీ మీటరుతో సర్వే చేయించడంతో పాటు జీఎస్ఐ డైరెక్టర్ మోహన్ కుల్ బృందం కూడా కోటను పరిశీలించింది. కోటలో నిధిని తీసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు స్వామీజీలు, పురోహితులతో ప్రత్యేక పూజలు, సర్వేలూ కొనసాగుతున్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, తహసీల్దార్ గోపాలరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి, పోలీసుల పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. కోటలో సర్వే నిర్వహించేందుకు అత్యాధునిక పరికరాలు వస్తాయని చెబుతున్నా రోజురోజుకు ఆలస్యం జరుగుతోంది. రెండు రోజుల్లో పరికరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కోటలో ఏముందో తెలియదు కాని గుప్త నిధుల కోసం పురాతన కోటను తవ్వేస్తున్నారన్న విమర్శలు మాత్రం అధికమయ్యాయి. -
ఆ జాదూ..మాములోడు కాదు!
శ్రీశైలం: ఆదాయానికి మించి ఆస్తులు కల్గివుండి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయిన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు గుప్త నిధుల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానానికి ఈఓగా 2013 మార్చిలో బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణదేవి ఆలయం ముందు 30 అడుగులకు పైగా వృత్తాకారంలో గొయ్యి తవ్వించారు. ఆలయ ప్రాకార ఈశాన్యంలో ఒక ధాతువు(ఎముకలాంటిది) కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. అది లభించకపోవడంతో తిరిగి ఆ గోతిని పూడ్చి.. అక్కడ వృత్తాకారంలోనే గోశాల నిర్మించారు. ఇల్యూషన్స్ అనే గ్రంథాన్ని సేకరించి.. దాని ఆధారంగా శ్రీశైలాలయ ప్రాంగణంలోని గుప్త నిధులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ప్రచారంలో ఉంది. చివరకు స్వామివార్ల అంతరాలయం ముందున్న బండను తొలగించే ప్రయత్నం చేసినా.. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆలయ ప్రాంగణంలో కొన్ని పూడ్చివేసిన నీటి గుండాలను తిరిగి తవ్వకాలు జరిపి అందుబాటులోకి తీసుకొచ్చారు. శత్రు వినాశనం, అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగడానికి క్షుద్ర దేవతగా ప్రసిద్ధికెక్కిన బగళాముఖి యాగాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అత్యధిక ప్రాధాన్యతిచ్చి.. పూజాద్రవ్యాలు, నైవేద్యం కోసం భారీగా ఖర్చు చేసి ‘స్వాహా’ అనిపించారు. శ్రీశైల దేవస్థానం చరిత్రలోనే లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. 50 ఏళ్లకు పైగా స్వామివార్ల ఆలయంలో త్రికాలార్చన మాత్రమే కొనసాగుతూ వచ్చింది. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి షట్కాలార్చన పూజలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అభిషేకం అందనంత ఎత్తులో ఉంచేశారు. అభిషేక టిక్కెట్ల ధరలను కూడా విపరీతంగా పెంచేశారు. బగళాముఖి హోమం చేస్తే... బగళాముఖి హోమం చేస్తే శత్రు స్తంభన జరుగుతుందని, అనుకున్న అన్ని పనులు నెరవేరుతాయని నమ్మకం. అందుకే చంద్రశేఖర్ ఆజాద్ దీన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆయనపై అప్పటికే ఎన్నో వ్యాజ్యాలు కోర్టులో నడుస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ యాగాన్ని ప్రవేశపెట్టారన్న అభిప్రాయం ఆలయ వర్గాల్లో ఉంది. ఇక ఈ హోమం నిర్వహణకు ప్రత్యేక దిట్టాన్ని తయారు చేశారు. హోమంలో వేసే సమిధలు మొదలుకొని.. పూజాధి ద్రవ్యాలతో పాటు నైవేద్యం కోసం భారీగానే దిట్టం సిద్ధం చేశారు. అరకేజీ కేసరి ప్రసాదానికి రూ. 220, అరకిలో పులిహోర ప్రసాదానికి రూ.125లుగా వ్యయాన్ని చూపించారు. వాస్తవానికి అర కిలో కేసరి తయారీకి రూ. 150కి మించదు. దేవస్థానం వారు భక్తులకు ప్రసాదాల విక్రయ కేంద్రం ద్వారా 150 గ్రాముల పులిహోర రూ.5లకే అందజేస్తున్నారు. అలాంటిది బగళాముఖి హోమంలో అర కిలో పులిహోర ప్రసాదానికి రూ.125 వసూలు చేశారు. ఇక యాగ నిర్వహణ కోసం ఆజాద్ నియమించిన రుత్వికుడి నెలసరి వేతనం రూ.25వేలు. ఆయన నివసించడానికి వీలుగా ఉచితంగా వసతిగృహాన్ని కేటాయించారు. కుర్తాళం పీఠాధిపతి శిష్యుడిగా ఉన్న ఈ రుత్వికుడిని అతికష్టం మీద ఒప్పించి తీసుకువచ్చినట్లుగా ఆజాద్ అప్పట్లో చెప్పారు. అయితే.. ఈయన దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఒక దేవస్థానంలో విధులు నిర్వహించి పదవీవిరమణ పొందారనే ఆరోపణలున్నాయి. 30 అడుగులకు పైగా గుంత తీసి.. ఆపై పూడ్చి గోశాలను నిర్మించిన దృశ్యం ఆజాద్ చుట్టూ‘ కోటరీ’ ఆజాద్ ప్రవేశ పెట్టిన ప్రతి పనికి ఎటువంటి వ్యతిరేకత కలగ కుండా చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. అందులోంచి పుట్టిందే వైదిక కమిటీ. దీని సూచన మేరకే ఆయా కార్యక్రమాలు, సంప్రదాయాలకు శ్రీకారం చుట్టినట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. దీనికితోడు మఠాధిపతులు, పీఠాధిపతులను సైతం తన మాయాజాలంతో ముగ్గులోకి దింపారనే విమర్శలున్నాయి. శ్రీ మల్లికార్జునస్వామివార్ల మహాలింగం అరిగిపోతుందని, లింగం చుట్టూ గాడి ఏర్పడిందని, దాన్ని అష్టదిగ్బంధన ప్రక్రియ ద్వారా పూడ్చివేయాలని ఆజాద్ భావించారు. ఈ ఒక్క విషయానికి మాత్రం అటు వైదిక కమిటీ గానీ, ఇటు ఆలయ అధికార సిబ్బంది, ఉభయదేవాలయాల అర్చకులు, వేదపండితులు గానీ సమ్మతించలేదు. కాగా.. అప్పట్లో శ్రీశైలాన్ని సందర్శించిన దేవాదాయ కమిషనర్ వైవీ అనురాధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రతువులు, నూతన సంప్రదాయాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో బగళాముఖి యాగంతో పాటు షట్కాల పూజలను బ్రేక్ పడింది. -
గుప్త నిధుల తవ్వకాల కేసులో..
► ఎనిమిది మంది అరెస్ట్.. ► పరారీలో మరో ముగ్గురు.. భువనగిరి, అర్బన్ :గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం భువనగిరిలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏసీపీ ఎస్.మోహన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడిం చారు. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రా మ శివారులో ఉన్న మైసమ్మ ఆలయం పక్కనే ఉన్న దానంబండను స్థానికులు పవిత్రంగా కొలుస్తు పూజ లను నిర్వహిస్తారు. దానంబండ కింద గుప్త నిధులు ఉన్నట్లు ఈ నెల 24న అదే గ్రామానికి చెందిన కురిమండ్ల శ్రీనివాస్‌గౌడ్, ఈదులకంటి సంజీవరెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, ఉప్పునుతల రామ్‌దాస్, సంగి సుదర్శన్, చౌదరపల్లి గ్రామానికి చెందిన పక్కీరు ధర్మారెడ్డి, గుండెబొయిన కృష్ణ(జేసీబీ డ్రైవర్), పక్కీర్‌గూడునికి చెందిన గంగదేవి నర్సింహ్మ, కరీంనగర్ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు రాజు, సోమయ్య, గుర్తు తెలియని మరో వ్యక్తి జేసీబీ సాయంతో దానంబండ కింది భాగంలో తవ్వకాలు జరిపారు. వీరికి ఎలాంటి గుప్త నిధులు లభించ లేదు. అదే గ్రామానికి చెందిన తూంకుంట విఠల్ 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో గుర్తించిన 11 మంది నిందితులలో 8 మందిని అరెస్టు చేసినట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీ, బైకును వారి నుంచి స్వాధీనం చేసుకునట్లు తెలి పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో భువనగిరి రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ కె. వెంకటేష్ పాల్గొన్నారు. 3 -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
నంది విగ్రహం తొలగించిన దుండగులు వివరాలు సేకరించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి యాచారం: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపి నంది విగ్రహం తొలగించారు. ఈ సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామ ప్రారంభంలోనే కుక్కరూపంలోని నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం కింద గుప్త నిధులు ఉండొచ్చనే ఆశతో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహన్ని ఓ పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. దుండగులు రెండు అడుగుల లోతులో ఉన్న విలువైన నిధులను అపహరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి తవ్వకాల జరిపిన తీరును పరిశీలించారు. మూడేళ్ల క్రితం ఓసారి గుర్తు తెలియని వ్యక్తులు ఈ నంది విగ్రహం వద్ద తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, సర్పంచ్ రాజునాయక్ తదితరులు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. విచారణ జరుపుతున్నామని సీఐ మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. -
గుప్త నిధుల ముఠా అరెస్ట్
జమ్మలమడుగు: గుప్తనిధుల కోసం వచ్చిన ముఠాను జమ్మలమడుగు అర్బన్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు గ్రామంలో సంచరిస్తూ వివిధ దేవాలయాల గురించి ఆరా తీస్తు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక కుండా వారి వీధిలో ఉన్న రామలింగేశ్వర ఆలయం చాలా పురాతనమైనది కావడంతో ఆలయంలో గుప్త నిధులు ఉంటాయని భావించారు. శుక్రవారం రాత్రి నలుగురు వ్యక్తులు వచ్చి అందులో ఇద్దరు వ్యక్తులను ఇక్కడే పూజలు నిర్వహించాలని చెప్పి మరో ఇద్దరు తిరిగి వెళ్లిపోయారు. వీరు రాత్రి కొద్దిసేపటి వరకు పూజలు నిర్వహించారు. అయితే స్థానికులు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం పోలీసులు ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వచ్చినట్లు తెలుస్తోంది. తమ దైన శైలిలో విచారణ చేయడంతో వారు మరో ఇద్దరి పేర్లను చెప్పడంతో వారిని కూడా పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు. వీరు మొదట తమది బద్వేలు ప్రాంతమని చెప్పారు. తిరిగి ప్రకాశం జిల్లా అని చెప్పడంతో ఆలయాల్లో దొంగ తనాలు చేసే ముఠానా, లేక గుప్తనిధులు తవ్వే ముఠానా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. -
గుప్త నిధుల కోసం సమాధిని తవ్వారు
మహానంది: కర్నూలు జిల్లాలో వింత పరిస్థితి నెలకొంది. 44 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి సమాధిలో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో దుండగులు సమాధిని తవ్వారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామశివారులోని బుచ్చమ్మతోట వద్ద ఉన్న చిన్నప్పగౌడ్ సమాధిలో విలువైన వస్తువులు ఉంటాయనే అనుమానంతో గుర్తుతెలియని దుండగులు సమాధిని తవ్వారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.