ఉదయగిరి: 400 ఏళ్ల చరిత్ర గల ఉదయగిరి దుర్గంపై అపారమైన గుప్త నిధులు ఉంటాయని కొంతమంది నమ్మకం. శ్రీకృష్ణ దేవరాయలు ఏలుబడిలో ఈ ప్రాంతంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారు అనే నానుడి ఉండేది. దీంతో ప్రాచీన కట్టడాల కింద గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో ఎప్పుటి నుంచో అనేక ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు సాగిస్తున్నాయి. కొన్ని ముఠాలు సంపద కొల్లగొట్టాయనే ప్రచారం కూడా ఉంది.
స్వాతంత్య్రం అనంతరం నుంచి ఉదయగిరి దుర్గంలో గుప్త నిధుల వేట కొనసాగుతోంది. దుర్గంపై జన సంచారం లేకపోవడంతో ముఠాలు అక్కడేమి చేస్తున్నది వెంటనే తెలియదు. పైగా దుర్గంపైకి ఎవరూ తరచుగా వెళ్లరు. దీంతో రోజుల తరబడి ముఠాలు మకాం వేసి ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తున్నాయి.
గతంలో కూడా తవ్వకాలు
ఉదయగిరి దుర్గంపై ఉన్న కట్టడాల్లో బంగారం, వజ్రాలు దొరుకుతాయనే నమ్మకంతో కొంతమంది స్థానికులు ౖపైపె తవ్వకాలు జరిపేవారు. అయితే బయట ప్రాంతాలకు చెందిన వారు పెద్ద స్థాయిలో తవ్వకాలు జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. 2012లో ఉదయగిరిలోని కృష్ణ మందిరంలో కూడా ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది. దీంతో ప్రాచీన కట్టడాలు దెబ్బతిన్నాయి. అప్పడు కొంతమంది అనుమానితులపై కేసులు నమోదు చేశారు.
పేలుడు పదార్థాలు ఇదే మెదటిసారి
దుర్గంపై గతంలో అనేక ముఠాలు తవ్వకాలు జరిపాయి. కానీ తాజాగా జరిపిన తవ్వకాల్లో పేలుడు పదార్థాలు వాడటం, అందులో ఓ ముఠా సభ్యుడు మృతిచెందడం సంచలనంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ఆపరేషన్ ఆలస్యంగా వెలుగులోకి రావడం.. ఓ వ్యక్తి చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment