
కందుకూరు నియోజకవర్గంలో బీపీసీఎల్ రిఫైనరీ కోసం భూ సేకరణపై తీవ్ర వ్యతిరేకత
భూములు ఇవ్వాలన్న సీఎం ప్రకటనపై తీర ప్రాంత ప్రజల ఆగ్రహం
గ్రామాలు ఖాళీ చేయించి పరిశ్రమ పెడితే తమకేంటి ఉపయోగం అంటున్న జనం
భూములు ఇవ్వకూడదని మత్స్యకారుల తీర్మానం
తీరం వదిలి తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన
ఉలవపాడు: ‘మా ఊరు దగ్గరలో పరిశ్రమ వస్తే సొంత ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చు. పరిశ్రమ కోసం మా ఊరే లేకుండా చేస్తే ఎలా..? మా ఊరే లేకుండాపోయిన తర్వాత ఆ పరిశ్రమ వస్తే ఎంత..? రాకపోతే ఎంత...? ఉన్న భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్...’ అంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండల తీరప్రాంత ప్రజలు. ఉలవపాడు మండలంలో ఇటీవల కలెక్టర్ ఆనంద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయదేవ్ పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించారు.
కరేడు నుంచి రామాయపట్నం వరకు తీరప్రాంత భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో గుబులు మొదలైంది. శుక్రవారం తీరప్రాంత మత్స్యకారులందరూ అలగాయపాలెంలో సమావేశమై పరిశ్రమలకు తమ భూములు ఇవ్వకూడదని తీర్మానించారు.
పోలీసులు వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నా కూడా మత్స్యకారులు ఐక్యంగా ఉంటూ తీర్మానం చేయడం గమనార్హం. అయితే, శనివారం కందుకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని..
బీపీసీఎల్ రిఫైనరీ కోసం ప్రధానంగా కరేడు చెరువు అనుకుని ఉన్న ఆయకట్టును తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సమీపంలోని సపోటా, మామిడి తోటలు కూడా సేకరించే భూముల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమికంగా కరేడు గ్రామ చెరువు నీటిని ఉపయోగించుకుని కంపెనీ నిర్మాణాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. తమ చెరువు ఆయకట్టు కింద వరి, వేరుశనగ పండించుకుని సంతోషంగా ఉన్నామని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు.
కరేడుతోపాటు తీరప్రాంత గ్రామాలైన అలగాయపాలెం, టెంకాయచెట్లపాలెం, చిన్నపట్టపుపాలెం, చాకిచర్ల, పెదపట్టపుపాలెం, రామాయపట్నం, పల్లెపాలెం గ్రామాల్లో అధిక శాతం ప్రజలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని భూములు బీపీసీఎల్ కోసం తీసుకునే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 6వేల ఎకరాలను సేకరించనున్నట్లు తెలిసింది. భూములను తీసుకోవడంతోపాటు ఆయా గ్రామాలను ఖాళీ చేయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కన్నతల్లి లాంటి సొంత ఊరు.. జీవనాధారమైన భూములు... తీరం వదిలి తాము ఎక్కడికి వెళ్లాలని మత్స్యకారులు భగ్గుమంటున్నారు.
ఉలవపాడు మండలంలోని కొన్ని ప్రధాన గ్రామాలను లేకుండా చేసేందుకు బడాబాబులు కుట్ర పన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పరిశ్రమకు వెయ్యి ఎకరాలు సరిపోతుందని, అటవీ భూములను తీసుకుని పరిశ్రమ పెడితే తమకు ఉపాధి లభిస్తుందని, తమను తరిమేసి పరిశ్రమ పెడితే ఎలా..అని ప్రశ్నిస్తున్నారు.
ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూములను పరిశీలిస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు.
భూములు లాక్కోవడానికి కుట్ర
పరిశ్రమ పెట్టడానికి ఆరు వేల ఎకరాలు అవసరమా? అటవీ భూమి వెయ్యి ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం పేదల భూములు లాక్కోవడానికే పరిశ్రమ పేరుతో కుట్ర పన్నారు. – మిరియం శ్రీనివాసులు, 139 కులాల జేఏసీ చైర్మన్, కరేడు
భూములు ఇచ్చేది లేదు
బీపీసీఎల్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదు. మండలంలో చాలా అటవీ భూములు ఉన్నాయి. పరిశ్రమల కోసం వాటిని తీసుకోవచ్చు. – వాయల అంజయ్య, అలగాయపాలెం
Comments
Please login to add a commentAdd a comment