తవ్వకాలను పరిశీలిస్తున్న ఆర్‌ఐ, వీఆర్‌ఓ
చెన్నంపల్లి(తుగ్గలి) : గుప్త నిధుల కోసం తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలు రెండు నెలల విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పురాతన కోటలో విశేషంగా గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారంతో గతేడాది డిసెంబర్ 13న అధికారులు తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు తవ్వకాలు చేస్తూ జీఐఎస్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో వివిధ సర్వేలు నిర్వహించారు. తవ్వకాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 16న సీతారామ లక్ష్మణుడు పంచ లోహ విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. లభ్యమైన విగ్రహాలను అదే రోజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, తహసీల్దార్ గోపాలరావు సమక్షంలో కర్నూలుకు తరలించారు.
ఆ తర్వాత రెండు రోజులు డ్రిల్లింగ్ చేసి తవ్వకాలు ఆపేశారు. గతంలో తవ్వకాలకు ప్రయత్నించిన వారి సూచనల మేరకు ప్రారంభంలో తవ్వకాలు చేసినా ఎటువంటి ఆనవాలు లభ్యం కాకపోవడంతో కోటలో పురోహితులతో ప్రత్యేక పూజలు, మాంత్రికులతో తాంత్రిక పూజలు నిర్వహించారు. చివరకు జీఎస్‌ఐ అధికారులతో సర్వేలు నిర్వహించిన తర్వాత వారి సూచనల మేరకు తవ్వకాల పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరిగి శుక్రవారం కోటలో కొద్దిసేపు మట్టి తవ్వకాలు చేశారు. శనివారం మొదట్లో తవ్వకాలు చేసిన ప్రాంతం సమీపంలో ఉన్న బావిలాంటి గుంతలో వేసిన మట్టిని తిరిగి తొలగిస్తున్నారు. తవ్వకాలను ఆర్‌ఐ మధుసూదనరావు, వీఆర్‌ఓ కాశీరంగస్వామి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment