కొండపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంతంలో తవ్వకాలు చేసిన దృశ్యం
గుంటూరు, యడ్లపాడు(చిలకలూరిపేట): కొండవీడు కోట ఎందరో రాజులు పాలించిన గిరి దుర్గం. బౌద్ధులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగరరాజులు, కుతుబ్‌షాహీలు, ఫ్రెంచ్, బ్రిటీషువారు సైతం ఇక్కడ జెండా ఎగరేసిన వారే. క్రీ.పూ నుంచి క్రీ.శ వరకు ఎందరో సామంతులు, రాజులు, చక్రవర్తులు ఏలిన శతృదుర్బేధ్య గిరిదుర్గమిది. అసమాన, అనిర్వచనీయమైన చరిత్ర ఖజానాను దాచుకున్న అద్భుతగని ఈ ఖిల్లా. తెలుగువారి రాజసాన్ని, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని దశదిశలా వ్యాపింపజేసిన కీర్తిబావుటా కొండవీడు. కొండవీడులో ప్రాచీన కట్టడాలు, పాచిపట్టిన పెద్దపెద్ద కొండరాళ్లు ఉన్నాయనుకుంటే పొరపాటే. తరతరాలకు తర‘గని’ చరిత్రకు ఇక్కడ కొదవ లేదు. కొండచుట్టూనే కాదు కొండలపై కనిపించే కందకాలు, ధ్వంసమైన పురాతన కట్టడాలు, ముక్కలైన రాతి శిల్పాలు, దూరప్రాంతాలకు తరలివెళ్లిన అమూల్యమైన ఆయుర్వేద వనసంపద ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు గుప్తనిధుల కోసం దుండగుల యథేచ్ఛగా సంచరిస్తూ కొండలపైనే నివాసం ఉండి భారీ తవ్వకాలు చేయడానికి కారణం అపారమైన గుప్త నిధుల సంపద ఈ శిలలమధ్య కొలువై ఉండడమే.
వివిధ శాఖల ఆధ్వర్యంలో చురుగ్గా పనులు
రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలు కొండపైనే పలుమార్లు జరిగాయి. ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖలకు నిధులను కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ఘాట్‌రోడ్డు చివరి అంచునుంచి పురాతన కట్టడాల వరకు అప్రోచ్‌మార్గం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఘాట్‌రోడ్డుపై 300 విద్యుత్ స్తంభాలు, కలర్ లైటింగ్ ఏర్పాటు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కోట గ్రామంలోని మెట్ల మార్గం ఆధునికీకరణ పనులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖతో కొండపై ఉన్న మూడు చెరువుల అభివృద్ధి, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. అయితే ఆయా పనులను అన్నింటినీ అటవీశాఖ సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కొండలపై బ్లాస్టింగ్, భారీ మిషన్లతో తవ్వకాలు, చెట్లు కొట్టడం, జంగిల్ క్లియరెన్సు, పురాతన కట్టడాల తొలగింపు తదితర పనులు ముమ్మరంగా చేస్తున్నారు.
కొండెక్కిన పర్యవేక్షణ..!
గతంలో 4కి.మీ వరకు ఘాట్‌రోడ్డుపైకి అనుమతించిన పర్యాటకులను సైతం కొండ కింది భాగంలోనే నిలిపివేశారు. కొండవీడు కొండలపై వివిధ పనుల కోసం మిషన్లతో ఎక్కడ పడితే అక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాని పనులు నిర్వహించే ప్రాంతాల్లో అధికారులకంటే అధికార పార్టీ వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉత్సవాల పనులు ప్రారంభించిన తర్వాత కూడా గుప్తనిధుల తవ్వకాలు చేస్తున్న ఓ బృందాన్ని కొందరు పట్టుకుని తరిమివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిని ఇక్కడకు రప్పించి తవ్వకాలకు ప్రోత్సహించిన వారు సమీప గ్రామాలకు చెందిన వారే కావడం, ఇంత జరిగినా సంబంధిత శాఖలు స్పందించక పోవడంపై ప్రజల అనుమానం మరింతగా బలపడుతోంది. ప్రాచీన కట్టడాల లోపల, వెలుపల మాత్రమే ఇప్పటివరకు గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి.
ఉత్సవాల సందర్భంగా చేస్తున్న పనుల నిమిత్తం ప్రాచీన ఆలయాలను తొలగించడంతో ఆలయాల ధ్వజస్తంభం, గర్భాలయం కింద భాగాలపై గుప్తనిధులు ఉంటాయనే ప్రచారం మండలంలో బాగా వ్యాపించింది. కొండపైకి ఎవరినీ రానివ్వకుండా చేయడానికి ఇదో కారణమనే విమర్శలు వినవస్తోంది. సమీప గ్రామాలకు చెందిన కొందరు పనుల పర్యవేక్షణకు వెళ్లినట్లుగా తవ్వకాల వద్దనే ఉంటున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కొండపైనే కనిపించడంపై మండిపడుతున్నారు. పనులు నిర్వహించే క్రమంలో పురాతన వస్తువులు, విలువైన సంపద బయల్పడితే అవి మాయం అయ్యే అవకాశం ఉంటుందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల సమయంలో విధిగా పురావస్తు, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో పాటు పోలీసులు ఉండాలని, వారెవరూ కన్పించడం లేదని, కొత్త వ్యక్తులు అధికారుల మాదిరిగా సంచరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారసత్వ సంపద ను చోరుల నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment