గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..
..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు.
నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా.
మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్‌ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్‌ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.
ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment