అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ (ఫైల్)
శ్రీశైలం: ఆదాయానికి మించి ఆస్తులు కల్గివుండి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయిన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు గుప్త నిధుల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానానికి ఈఓగా 2013 మార్చిలో బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణదేవి ఆలయం ముందు 30 అడుగులకు పైగా వృత్తాకారంలో గొయ్యి తవ్వించారు. ఆలయ ప్రాకార ఈశాన్యంలో ఒక ధాతువు(ఎముకలాంటిది) కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. అది లభించకపోవడంతో తిరిగి ఆ గోతిని పూడ్చి.. అక్కడ వృత్తాకారంలోనే గోశాల నిర్మించారు.
ఇల్యూషన్స్ అనే గ్రంథాన్ని సేకరించి.. దాని ఆధారంగా శ్రీశైలాలయ ప్రాంగణంలోని గుప్త నిధులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ప్రచారంలో ఉంది. చివరకు స్వామివార్ల అంతరాలయం ముందున్న బండను తొలగించే ప్రయత్నం చేసినా.. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆలయ ప్రాంగణంలో కొన్ని పూడ్చివేసిన నీటి గుండాలను తిరిగి తవ్వకాలు జరిపి అందుబాటులోకి తీసుకొచ్చారు. శత్రు వినాశనం, అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగడానికి క్షుద్ర దేవతగా ప్రసిద్ధికెక్కిన బగళాముఖి యాగాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అత్యధిక ప్రాధాన్యతిచ్చి.. పూజాద్రవ్యాలు, నైవేద్యం కోసం భారీగా ఖర్చు చేసి ‘స్వాహా’ అనిపించారు. శ్రీశైల దేవస్థానం చరిత్రలోనే లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. 50 ఏళ్లకు పైగా స్వామివార్ల ఆలయంలో త్రికాలార్చన మాత్రమే కొనసాగుతూ వచ్చింది. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి షట్కాలార్చన పూజలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అభిషేకం అందనంత ఎత్తులో ఉంచేశారు. అభిషేక టిక్కెట్ల ధరలను కూడా విపరీతంగా పెంచేశారు.
బగళాముఖి హోమం చేస్తే...
బగళాముఖి హోమం చేస్తే శత్రు స్తంభన జరుగుతుందని, అనుకున్న అన్ని పనులు నెరవేరుతాయని నమ్మకం. అందుకే చంద్రశేఖర్ ఆజాద్ దీన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆయనపై అప్పటికే ఎన్నో వ్యాజ్యాలు కోర్టులో నడుస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ యాగాన్ని ప్రవేశపెట్టారన్న అభిప్రాయం ఆలయ వర్గాల్లో ఉంది. ఇక ఈ హోమం నిర్వహణకు ప్రత్యేక దిట్టాన్ని తయారు చేశారు. హోమంలో వేసే సమిధలు మొదలుకొని.. పూజాధి ద్రవ్యాలతో పాటు నైవేద్యం కోసం భారీగానే దిట్టం సిద్ధం చేశారు. అరకేజీ కేసరి ప్రసాదానికి రూ. 220, అరకిలో పులిహోర ప్రసాదానికి రూ.125లుగా వ్యయాన్ని చూపించారు. వాస్తవానికి అర కిలో కేసరి తయారీకి రూ. 150కి మించదు. దేవస్థానం వారు భక్తులకు ప్రసాదాల విక్రయ కేంద్రం ద్వారా 150 గ్రాముల పులిహోర రూ.5లకే అందజేస్తున్నారు. అలాంటిది బగళాముఖి హోమంలో అర కిలో పులిహోర ప్రసాదానికి రూ.125 వసూలు చేశారు. ఇక యాగ నిర్వహణ కోసం ఆజాద్ నియమించిన రుత్వికుడి నెలసరి వేతనం రూ.25వేలు. ఆయన నివసించడానికి వీలుగా ఉచితంగా వసతిగృహాన్ని కేటాయించారు. కుర్తాళం పీఠాధిపతి శిష్యుడిగా ఉన్న ఈ రుత్వికుడిని అతికష్టం మీద ఒప్పించి తీసుకువచ్చినట్లుగా ఆజాద్ అప్పట్లో చెప్పారు. అయితే.. ఈయన దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఒక దేవస్థానంలో విధులు నిర్వహించి పదవీవిరమణ పొందారనే ఆరోపణలున్నాయి.
30 అడుగులకు పైగా గుంత తీసి.. ఆపై పూడ్చి గోశాలను నిర్మించిన దృశ్యం
ఆజాద్ చుట్టూ‘ కోటరీ’
ఆజాద్ ప్రవేశ పెట్టిన ప్రతి పనికి ఎటువంటి వ్యతిరేకత కలగ కుండా చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. అందులోంచి పుట్టిందే వైదిక కమిటీ. దీని సూచన మేరకే ఆయా కార్యక్రమాలు, సంప్రదాయాలకు శ్రీకారం చుట్టినట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. దీనికితోడు మఠాధిపతులు, పీఠాధిపతులను సైతం తన మాయాజాలంతో ముగ్గులోకి దింపారనే విమర్శలున్నాయి. శ్రీ మల్లికార్జునస్వామివార్ల మహాలింగం అరిగిపోతుందని, లింగం చుట్టూ గాడి ఏర్పడిందని, దాన్ని అష్టదిగ్బంధన ప్రక్రియ ద్వారా పూడ్చివేయాలని ఆజాద్ భావించారు. ఈ ఒక్క విషయానికి మాత్రం అటు వైదిక కమిటీ గానీ, ఇటు ఆలయ అధికార సిబ్బంది, ఉభయదేవాలయాల అర్చకులు, వేదపండితులు గానీ సమ్మతించలేదు. కాగా.. అప్పట్లో శ్రీశైలాన్ని సందర్శించిన దేవాదాయ కమిషనర్ వైవీ అనురాధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రతువులు, నూతన సంప్రదాయాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో బగళాముఖి యాగంతో పాటు షట్కాల పూజలను బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment