chandra shekar azad
-
స్వేచ్ఛ కోసం విప్లవించి...
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ పంథాలో పనిచేసి దేశానికి ప్రాణాలు అర్పించినవారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. 1906 జూలై 23న మధ్యప్రదేశ్ లోని బాబానగర్‌లో ఆయన జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు కాశీ విద్యా పీఠంలో సంస్కృత విద్యను అభ్యసించడానికి ఆయన్ని చేర్చారు.అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆకర్షితుడై 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తాను చదువుకుంటున్న సంస్కృత విద్యాపీఠం ముందే ధర్నా చేశాడు. పోలీ సులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ‘నీ పేరేమిటి?’ అన్న జడ్జి ప్రశ్నకు ఆ 15 ఏళ్ల బాలుడు ‘ఆజాద్’ (స్వేచ్ఛ) అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి అతడి పేరులో ఆజాద్ భాగమయ్యింది. ఇటువంటి సమాధానాలకు అతడికి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు జడ్జి.పెద్దవాడవుతున్న కొద్దీ అహింసా మార్గంలో దేశా నికి స్వాతంత్య్రం రాదని ఆయన నమ్మాడు. భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లాఖాన్లతో మైత్రి ఏర్పడింది. వీరంతా కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. వారి పోరాటానికి అవసరమైన వనరులను సమకూర్చు కోవడానికి 1925లో కకోరి వద్ద బ్రిటిష్ ప్రభుత్వ ధనాన్ని తరలిస్తున్న రైలును ఆపి దోపిడీ చేశారు.ఈ కేసులో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ లాంటివారిని పట్టు కుని ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్లి పనిచేయ సాగాడు. 1931 ఫిబ్రవరి 27 ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఆల్ఫ్రెడ్ పార్కు’లో ఆజాద్ ఉన్నాడని తెలిసిన పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్ తన తుపాకితో వీరోచి తంగా పోరాడి చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకొని పోలీసులకు ప్రాణా లతో చిక్కకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాడు. అలా స్వతంత్ర భారత యజ్ఞంలోస్వీయ సమిధయ్యాడు. – ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు -
టైమ్ 100 జాబితాలో భారతీయులు
న్యూయార్క్: ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దెతో యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్ సహా, భారతీయ సంతతికి చెందిన సామాజిక కార్యకర్తకు టైమ్ మ్యాగజైన్ వార్షిక ‘’ఎమర్జింగ్ లీడర్స్ çహూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లను 2021 టైమ్ 100 జాబితా ప్రకటిస్తుంది. ‘‘ఈ జాబితాలో చేరిన వ్యక్తులంతా చరిత్రసృష్టిస్తారు. నిజానికి చాలా మంది ఆ పనిచేసే ఉంటారు’’. టైమ్ 100 ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్మాక్సై చెప్పారు. ► టైమ్ 100 జాబితాలో పేరు దక్కించుకున్న మిగిలిన భారతీయ సంతతికి చెందిన నేతలు ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ అపూర్వ మెహతా, డాక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘గెట్ ఆన్ పీపీ ఈ’శిఖా గుప్తా, మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన రోహన్ పావులూరి ఉన్నారు. ► భీంఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా ప్రపంచస్థాయి ప్రముఖ నేతల సరసన చేరారు’’ఇక టైమ్ మ్యాగజైన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రొఫైల్‌లో ‘‘కొద్దికాలం క్రితం ఈ 40 ఏళ్ల బ్రిటన్‌లోని చాలా తక్కువ మందికి తెలిసిన జూనియర్ మినిస్టర్ అతి స్వల్పకాలంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు’అని రాశారు. సునాక్ దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వేత్త ’’అని పేర్కొనడం గమనార్హం. ► జనవరి 6న క్యాపిటల్ ఎటాక్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ని రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయాన్ని ప్రస్తావించిన టైమ్ ప్రొఫైల్, అత్యంత శక్తివంతమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెని ప్రశంసించింది. ► భీం ఆర్మీ నాయకుడు 34 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది’అంటూ భీం ఆర్మీ నాయకుడిని గురించి టైం ప్రస్తావించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమాన్ని టైమ్ గుర్తించింది. ► వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో గుప్తా లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత కీలక కోవిడ్ సంక్షోభకాలంలో వైట్‌హౌస్ లో నాయకత్వ లేమిని పూరిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు అవసరమైన ఆరోగ్య పరికరాలను సమకూర్చారు. గుప్తా సారథ్యంలో 6.5 మిలియన్ల పీపీఈ కిట్లను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అందించగలిగారు. ► 25 ఏళ్ల పావులూరి ఫ్రీ ఆన్లైన్ టూల్‌కి ఆద్యుడు. కోవిడ్–19 సంక్షోభంలో అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటి నుంచి బయటపడేందుకు పావులూరి తయారుచేసిన యాప్ సమర్థంగా పనిచేసింది. -
హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు
లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎలాంటి భయం లేకుండా.. పోలీసుల ఎదుటే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను బెదిరించారు. ఇక యోగి ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే వారికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంకలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిండానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు మరో 400 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ దారుణానికి పాల్పడిన నిందుతులకు మద్దతుగా 500 వ్యక్తులు చేరడమే కాక ఆజాద్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే పోలీసులు వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (చదవండి: బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి) దీనిపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండి’ అని డిమాండ్ చేశారు. ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్ పరిషత్ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ వారు మాత్రం నమ్మడం లేదు. రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వచ్చారంటూ చంద్రశేఖర్ ఆజాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ వ్యక్తి ‘దెబ్బలను తట్టుకునేందుకు ఠాకూర్లు పుట్టారు.. బయటకు రండి మీ పెద్ద సోదరులు మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఉన్నారు రండి’ అంటూ భీమ్ ఆర్మీ నాయకుడిని ఆహ్వానించారు. -
ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఆజాద్
సాక్షి, హైదరాబాద్ : భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను హైదరాబాద్ పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఉదయం 6.55 నిమిషాలకు ఆయన్ను తిరిగి ఢిల్లీకి పంపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్( టీఐఎస్ఎస్) విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆజాద్‌ను ఆదివారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెహిదిపట్నంలోని క్రిస్టల్ గార్డెన్లో జరిగే సమావేశంలో ఆజాద్ పాల్గొని అక్కడ ప్రసంగించాల్సి ఉంది. అయితే నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి లేనందున మార్గ మాధ్యలోనే ఆయన్ను అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. (చంద్రశేఖర్ ఆజాద్‌కు బెయిల్ సవరణ) సోమవారం తనను బలవంతంగా ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆజాద్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే ’తెలంగాణలో నియంతృత్వం తారాస్థాయికి చేరింది. ప్రజల నిరసన హక్కులను కొల్లగొడుతున్నారు. తొలుత మా అనుచరులపై లాఠీ చార్జ్ జరిపారు. తరువాత నన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం విమానాశ్రయానికి తీసుకువచ్చి ఢిల్లీకి పంపుతున్నారు. బహుజన్ సమాజం ఈ అవమానాన్ని ఎప్పటికీ మరచిపోదు. త్వరలో తిరిగి వస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా, జామా మసీదు వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినందుకు గాను ఆజాద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జనవరి 16న ఆజాద్ తీహార్ జైలు నుంచి బయటకొచ్చి.. మరోసారి జామా మసీదుకు వెళ్లి అక్కడ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తాను కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని.. జామా మసీదుకు రావడానికి ముందు గురుద్వారా, దేవాలయాలను సందర్శించినట్లు ఆ సందర్భంగా ఆజాద్ తెలిపారు. చదవండి: జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్ -
చంద్రశేఖర్ ఆజాద్‌కు బెయిల్ సవరణ
న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు విధించిన బెయిల్ షరతులను ఢిల్లీ కోర్టు మంగళవారం సవరించింది. వైద్యకారణాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం ఢిల్లీని సందర్శించడానికి కోర్టు అనుమతిస్తున్నట్లు అదనపు సెషన్స్ న్యాయమూర్తి కామిని ఆదేశాలిచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్ గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని, నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆజాద్ తనకు విధించిన బెయిల్ షరతులను సవరించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు షరతులను సవరించింది. అదే విధంగా ఆజాద్ కార్యాలయం రాజకీయపార్టీకి సంబంధించిందా.. కాదా.. అని ఎన్నికల సంఘం నుంచి నివేదిక తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: జామా మసీద్ పాక్‌లో ఉందా..? -
జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక నిరసనల్లో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం జామా మసీదు ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని ఆయనకు కోర్టు నిబంధన విధించింది. నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించింది. కాగా మతపరమైన ప్రార్థనా మందిరాలకు వెళ్లడానికి మాత్రం అనుమతి కల్పించింది. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా గురువారం రాత్రి విడుదలయ్యారు. (భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్) ఢిల్లీ వదిలి వెళ్లడానికి 24 గంటల సమయం ఉండడంతో శుక్రవారం ఆయన జామా మసీదు దగ్గర జరుగుతున్న నిరసన ప్రదర్శనలో రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆర్డర్స్‌ను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనే తమ బలమన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు మాత్రమే ఆందోళన చేపట్టడంలేదని, అన్ని మతాల ప్రజలు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వాస్తవానికి ఇదే మసీదు ముందు నెల రోజుల క్రితం భీమ్ ఆర్మీ చీఫ్ ధర్నా చేపట్టి అరెస్టయ్యారు. కోర్టు షరతులకు అనుగుణంగానే తాను 24 గంటల్లో ఢిల్లీ వదిలి వెలతానని చెప్పారు. అయితే ఆయన జామా మసీదు వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నట్లే కనిపిస్తున్నా.. ఆయన మాత్రం నేను నిరసనల్లో పాల్గొనలేదని కేవలం రాజ్యాంగ ప్రవేశికను మాత్రమే చదివి వినిపించానని చెప్పారు. ఆయన జామా మసీదు ప్రాంగణంలో ఉన్నంతసేపు నిరసనకారులు ఆజాదీ.. ఆజాదీ అంటూ నినదించారు. (జామా మసీద్ పాక్‌లో ఉందా..?) -
భీం ఆర్మీది ఓట్ల రాజకీయం : మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ : భీం ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని బీఎస్పీ అధినేత మాయావతి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ఢిల్లీలోని జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతిని పోలీసులు నిరాకరించినా ర్యాలీ నిర్వహించడంతో శనివారం ఉదయం జామా మసీదు వెలుపల చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయన్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఆజాద్‌ను తీహార్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలపై మాయావతి ఆదివారం ట్విటర్లో స్పందించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలో నిరసన తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే ఓటర్లను ప్రభావితం చేయడానికి అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించి కావాలని అరెస్ట్ అయ్యారని మాయావతి విమర్శించారు. ఇలాంటి స్వార్థపూరిత వ్యక్తులు, సంస్థలు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, బీఎస్పీ పార్టీ కార్యకర్తలను మాయావతి హెచ్చరించారు. చదవండి : భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్ -
వారణాసిలో ఇదీ వరస
వారణాసి.. హరహర మహాదేవ్ నామస్మరణతో మారు మోగిపోయే పుణ్యక్షేత్రం. శివభక్తితో ఓలలాడే కాశీపురం. ఎన్నికల వేళ ‘హర్ హర్ మోదీ.. ఘర్ ఘర్ మోదీ’ నినాదాలతో హోరెత్తిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. అయితే అనూహ్యంగా చాలామంది ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలపడానికి కొందరు, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని మరికొందరు, ప్రధానిపై పోటీ చేస్తే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఇంకొందరు, ఇలా చాలామంది ‘కాశీకి పోతాము రామాహరీ’ అంటూ క్యూ కడుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణలో నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఏకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ అభ్యర్థుల సంఖ్య 185కి చేరి.. ఎన్నికల సంఘానికే పరీక్షగా మారింది. ఇప్పుడు వారణాసిలోనూ అదే వరస కనిపించే సూచనలున్నాయి. ► కోల్‌కతా హైకోర్టుకి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి డీఎస్ కర్ణన్ వారణాసి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడి శిక్ష అనుభవించిన మొదటి న్యాయమూర్తి కర్ణన్. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈయ న వారణాసిని ఎంచుకున్నారు. 63 ఏళ్ల కర్ణన్ 2018లో యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ► బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కూడా తన నిరసన తెలపడానికి ఎన్నికలనే ఎంచుకున్నారు. జవాన్లకు నాసిరకమైన ఆహారాన్ని పెడుతున్నారంటూ గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. అది వైరల్‌గా మారడంతో తేజ్ బహదూర్‌పై కోర్టు విచారణ జరిగింది. ఆయన చేసిన ఆరోపణలన్నీ తప్పుడువని తేలడంతో కేంద్రం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ‘వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలియజెప్పడానికే. నేను ఈ ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ ఒక సందేశాన్నయితే పంపించగలను’ అని యాదవ్ అన్నారు. ► బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)కి చెం దిన ప్రొఫెసర్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కూడా ఈసారి వారణాసి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ఫ్లోరోసిస్ బాధితులూ.. 2017లో తమిళనాడుకి చెందిన వంద మందికి పైగా రైతు లు ఢిల్లీలో చేసిన నిరసన ప్రదర్శనలు గుర్తున్నాయి కదా.. ఎన్ని రోజులు పస్తులుంటూ నిరాహార దీక్ష చేసినా కేంద్రం వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కసితో వాళ్లంతా పి.అయ్యకన్ను నేతృత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఎన్ని కల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు చెందిన ఫ్లోరోసిస్ బాధితులు తమ దుర్భర జీవితాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి వారణాసి బరిని ఎంచుకున్నారు. వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్ తదితర సామాజిక కార్యకర్తల నేతృత్వంలో ఎన్నికల్లో మోదీతో పోటీకి సై అంటున్నారు. ఫ్లోరోసిస్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న లక్ష్యం తోనే వీరు వారణాసిని ఎంచుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈసారి వారణాసిలో మోదీని ఎదుర్కొంటున్నారు. తన ఆవేశపూరిత ప్రసంగాలతో దళిత యువతను ఆకర్షిస్తున్నారు. ‘మోదీ ఓటమికి రోజులు దగ్గర పడ్డాయ్‘ అని ఆజాద్ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమంటే గంగ ప్రక్షాళన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, క్లీన్ గంగ ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం మహంత్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కాంగ్రెస్ టికెట్‌పై వారణాసి నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రంగస్థలంలో మోదీ డూప్లికేట్ అభినందన్ పాఠక్ గుర్తున్నారా? అచ్చు గుద్దినట్టు మోదీ పోలికలతోనే ఉంటారు. ఆయన రూపురేఖలు, వేసుకునే దుస్తులు, నడక, నడత, పలుకు అన్నీ మోదీనే తలపిస్తాయి. తన ప్రసంగాలను కూడా మిత్రాన్ అనే మొదలు పెడతారు. ఒకప్పుడు మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఏడాది కిందటే రూటు మార్చి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన కూడా వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న మోదీ వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. అదే రోజు ఈ డూప్లికేట్ మోదీ కూడా నామినేషన్ వేయడానికి సన్నాహా లు చేస్తున్నారు. ‘నేను డమ్మీ అభ్యర్థిని కాను. మోదీ పోలికలతో పుట్టడం నా శాపమేమో. చాలామంది నన్ను అడుగుతున్నారు. అచ్చేదిన్ ఎక్కడా అని. ప్రధాని తాను ఇచ్చి న హామీలు నెరవేర్చకపోతే నేనేం చేయాలి. అందుకే వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయదలచుకున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల గెలిస్తే రాహుల్‌గాంధీ కే మద్దతు ఇస్తా’ అని అన్నారు. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఈ అభినందన్ బీజేపీకి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం విశేషం. బరిలో ప్రొఫెసర్లు, సైనికులు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్నికల బరిలో ఢీకొనడానికి ఎంతోమంది కదనోత్సాహంతో వారణాసికి కదిలి వెళుతున్నారు. వీరిలో ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి, తమిళనాడుకి చెందిన కొందరు రైతులు, కేంద్రం ఉద్యోగం నుంచి తొలగించిన సరిహద్దు భద్రతా జవాను, ఫ్లోరోసిస్ బాధితులు.. ఇలా చాలామందే ఉన్నారు. -
ఆ జాదూ..మాములోడు కాదు!
శ్రీశైలం: ఆదాయానికి మించి ఆస్తులు కల్గివుండి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయిన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు గుప్త నిధుల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానానికి ఈఓగా 2013 మార్చిలో బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణదేవి ఆలయం ముందు 30 అడుగులకు పైగా వృత్తాకారంలో గొయ్యి తవ్వించారు. ఆలయ ప్రాకార ఈశాన్యంలో ఒక ధాతువు(ఎముకలాంటిది) కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. అది లభించకపోవడంతో తిరిగి ఆ గోతిని పూడ్చి.. అక్కడ వృత్తాకారంలోనే గోశాల నిర్మించారు. ఇల్యూషన్స్ అనే గ్రంథాన్ని సేకరించి.. దాని ఆధారంగా శ్రీశైలాలయ ప్రాంగణంలోని గుప్త నిధులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ప్రచారంలో ఉంది. చివరకు స్వామివార్ల అంతరాలయం ముందున్న బండను తొలగించే ప్రయత్నం చేసినా.. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆలయ ప్రాంగణంలో కొన్ని పూడ్చివేసిన నీటి గుండాలను తిరిగి తవ్వకాలు జరిపి అందుబాటులోకి తీసుకొచ్చారు. శత్రు వినాశనం, అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగడానికి క్షుద్ర దేవతగా ప్రసిద్ధికెక్కిన బగళాముఖి యాగాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అత్యధిక ప్రాధాన్యతిచ్చి.. పూజాద్రవ్యాలు, నైవేద్యం కోసం భారీగా ఖర్చు చేసి ‘స్వాహా’ అనిపించారు. శ్రీశైల దేవస్థానం చరిత్రలోనే లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. 50 ఏళ్లకు పైగా స్వామివార్ల ఆలయంలో త్రికాలార్చన మాత్రమే కొనసాగుతూ వచ్చింది. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి షట్కాలార్చన పూజలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అభిషేకం అందనంత ఎత్తులో ఉంచేశారు. అభిషేక టిక్కెట్ల ధరలను కూడా విపరీతంగా పెంచేశారు. బగళాముఖి హోమం చేస్తే... బగళాముఖి హోమం చేస్తే శత్రు స్తంభన జరుగుతుందని, అనుకున్న అన్ని పనులు నెరవేరుతాయని నమ్మకం. అందుకే చంద్రశేఖర్ ఆజాద్ దీన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆయనపై అప్పటికే ఎన్నో వ్యాజ్యాలు కోర్టులో నడుస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ యాగాన్ని ప్రవేశపెట్టారన్న అభిప్రాయం ఆలయ వర్గాల్లో ఉంది. ఇక ఈ హోమం నిర్వహణకు ప్రత్యేక దిట్టాన్ని తయారు చేశారు. హోమంలో వేసే సమిధలు మొదలుకొని.. పూజాధి ద్రవ్యాలతో పాటు నైవేద్యం కోసం భారీగానే దిట్టం సిద్ధం చేశారు. అరకేజీ కేసరి ప్రసాదానికి రూ. 220, అరకిలో పులిహోర ప్రసాదానికి రూ.125లుగా వ్యయాన్ని చూపించారు. వాస్తవానికి అర కిలో కేసరి తయారీకి రూ. 150కి మించదు. దేవస్థానం వారు భక్తులకు ప్రసాదాల విక్రయ కేంద్రం ద్వారా 150 గ్రాముల పులిహోర రూ.5లకే అందజేస్తున్నారు. అలాంటిది బగళాముఖి హోమంలో అర కిలో పులిహోర ప్రసాదానికి రూ.125 వసూలు చేశారు. ఇక యాగ నిర్వహణ కోసం ఆజాద్ నియమించిన రుత్వికుడి నెలసరి వేతనం రూ.25వేలు. ఆయన నివసించడానికి వీలుగా ఉచితంగా వసతిగృహాన్ని కేటాయించారు. కుర్తాళం పీఠాధిపతి శిష్యుడిగా ఉన్న ఈ రుత్వికుడిని అతికష్టం మీద ఒప్పించి తీసుకువచ్చినట్లుగా ఆజాద్ అప్పట్లో చెప్పారు. అయితే.. ఈయన దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఒక దేవస్థానంలో విధులు నిర్వహించి పదవీవిరమణ పొందారనే ఆరోపణలున్నాయి. 30 అడుగులకు పైగా గుంత తీసి.. ఆపై పూడ్చి గోశాలను నిర్మించిన దృశ్యం ఆజాద్ చుట్టూ‘ కోటరీ’ ఆజాద్ ప్రవేశ పెట్టిన ప్రతి పనికి ఎటువంటి వ్యతిరేకత కలగ కుండా చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. అందులోంచి పుట్టిందే వైదిక కమిటీ. దీని సూచన మేరకే ఆయా కార్యక్రమాలు, సంప్రదాయాలకు శ్రీకారం చుట్టినట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. దీనికితోడు మఠాధిపతులు, పీఠాధిపతులను సైతం తన మాయాజాలంతో ముగ్గులోకి దింపారనే విమర్శలున్నాయి. శ్రీ మల్లికార్జునస్వామివార్ల మహాలింగం అరిగిపోతుందని, లింగం చుట్టూ గాడి ఏర్పడిందని, దాన్ని అష్టదిగ్బంధన ప్రక్రియ ద్వారా పూడ్చివేయాలని ఆజాద్ భావించారు. ఈ ఒక్క విషయానికి మాత్రం అటు వైదిక కమిటీ గానీ, ఇటు ఆలయ అధికార సిబ్బంది, ఉభయదేవాలయాల అర్చకులు, వేదపండితులు గానీ సమ్మతించలేదు. కాగా.. అప్పట్లో శ్రీశైలాన్ని సందర్శించిన దేవాదాయ కమిషనర్ వైవీ అనురాధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రతువులు, నూతన సంప్రదాయాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో బగళాముఖి యాగంతో పాటు షట్కాల పూజలను బ్రేక్ పడింది. -
శుభప్రదం.. శ్రీగిరి ప్రదక్షిణం
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైలానికి నాలుగుదిక్కుల్లో ఉన్న త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపూర్ దేవాలయాలను సందర్శించి మల్లన్నను దర్శించుకుంటే శ్రీగిరి ప్రదక్షిణ చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహిమాన్వితమైనదే శుక్రవారం శ్రీశైలంలో జరిగిన శ్రీగిరిప్రదక్షిణ. శ్రీశైలక్షేత్రానికి వలయకారంలో 6 కి.మీ రోడ్డుమార్గంగా నిర్మించిన బసవన్న మార్గ్ (రింగ్‌రోడ్డు) ద్వారా శ్రీగిరిప్రదక్షిణ చేస్తే నాలుగు ముఖద్వారాలను దర్శించుకున్నంత ఫలం దక్కుతుందని పీఠాధిపతులు, పండితులు చెబుతున్నారు. శ్రీశైలమహాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఈఓ చంద్రశేఖర ఆజాద్ శుక్రవారం దీనిని నిర్వహించారు. వందలాది మంది భక్తులు పంచాక్షరి నామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల ఓంకార నాదంతో శ్రీగిరిక్షేత్రం మారుమ్రోగింది. మార్గమధ్యలో పంచమఠాలు, మహిషాసురమర్ధిని, రుద్రాక్ష, భీమశంకర, ఘంటామఠాలు, మహారుద్రుని విగ్రహాల వద్ద ఆయా దేవతామూర్తులకు విశేషపూజలను చేశారు. యజ్ఞవాటిక, హేమారెడ్డి మల్లమ్మ మందిరాల వద్ద ప్రసాత వితరణ జరిగింది. మహాఫలదాయకం గిరిప్రదక్షిణను శివదీక్షను స్వీకరించిన శివస్వాములు చేసినట్లయితే మహాఫలదాయకమని పండితులు చెబుతున్నారు. జ్యోతిర్ముడి సమర్పించడానికి ముందు ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా శుభఫలితాలను పొందుతారని, ప్రదక్షిణానంతరం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని జ్యోతిర్ముడిని సమర్పించడం ద్వారా వారు చేపట్టిన శివదీక్షకు పూర్తి ఫలం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘ముక్కంటి’కి గంతలు
శ్రీశైలాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రోజుకో నిర్మాణం కూల్చివేత.. పూటకో నిర్ణయం మార్పు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం అధికారుల పనితీరుకు నిదర్శనం. మహాశివరాత్రి ముంచుకొస్తున్న వేళ.. నాణ్యత కృష్ణా జలాల్లో కలసిపోతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి.. జ్యోతిర్లింగ క్షేత్రం కలసి వెలసిన శ్రీశైలాలయం పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. చంద్రశేఖర్ఆజాద్ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు ఏ మార్పు చోటు చేసుకుంటుందో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా రూపురేఖలను కోల్పోతుండటం పట్ల భక్తులు పెదవిరుస్తున్నారు. రెడ్డిరాజుల కాలంలో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన సాలు మండపాలలో కొంత భాగాన్ని తొలగించడం విమర్శలకు తావిస్తోంది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారనే ప్రశ్నకు సమాధానం కరువైంది. పంచభూతాల ప్రతిష్టిత ఆలయాల పక్కనే ఉన్న మండపాన్ని తొలగించి మెట్ల మార్గాన్ని అదనంగా పొడిగించడంలోని ఆంతర్యం ఎవరికీ అంతుపట్టడం లేదు. అభివృద్ధి పేరిట సుమారు పాతిక అడుగుల ఎత్తున గాల్వలం షీట్లతో విశాలమైన షెడ్ల నిర్మాణం చేపట్టడంతో ఆలయ ప్రాంగణం శోభ కోల్పోయింది. అదేవిధంగా ఇటీవల భారీ షెడ్డు ఏర్పాటు చేయడంతో సాక్షి గణపతి ఆలయం కళావిహీనంగా మారిపోయింది. ఇదే విషయమై బీజేపీ, భజరంగదళ్, వీహెచ్‌పీ నేతలు సైతం ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే సుమారు రూ.100 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మాస్లర్‌ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్, సీవరేజ్ ప్లాంట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెద్ద పనులను పక్కనపెట్టి రూ.10 లక్షల లోపు పనులను ఆగమేఘాలపై చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. భక్తుల మనోభావాలతో ఆటలు: మల్లన్న లింగ స్వరూపం అరిగిపోతుందనే సాకుతో సువర్ణ కవచం ఏర్పాటుకు ఈవో వేగంగా పావులు కదపడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను వీరశైవులు, పండితులు, స్వాములు తప్పుపడుతున్నారు. ఆలయ ప్రాంగణంలోని కట్టడాల్లో సహజత్వం తీసుకొచ్చేందుకంటూ రాతి నిర్మాణాలపై టైల్స్ ఏర్పాటు, సున్నపు పొరలను శాండ్ బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పనులకు ఆలయ ప్రాంగణంలో వినియోగిస్తున్న పొక్లెయిన్లు, ట్రాక్టర్లు రణగొణ ధ్వనులతో భక్తులు విసిగిపోతున్నారు. స్వామి సన్నిధిలో ప్రశాంతత కోరి వచ్చి తమను ఈవో చర్యలు నిరాశ కలిగిస్తున్నాయని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇష్టారాజ్యం: ఏడెనిమిది నెలల్లోనే పరిచారకులు, అర్చకులు, వంటమనుషులు, ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిపై చేపట్టిన నియామకాల్లో ఈవో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన అతిథిగృహాలకు సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయానికి భక్తులు తాకిడి పెరిగిన నేపథ్యంలో వారి నెత్తిన భారం మోపి ఆదాయం పెంపొందించుకునే దిశగా చేపట్టిన మార్పుల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిషేకం.. శీఘ్రదర్శనం.. మహామంగళహారతి.. సుప్రభాత సేవా టిక్కెట్ల ధరలను అమాంతం పెంచడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. నిబంధనల మేరకే పనులు శ్రీశైల మహాక్షేత్రంలో అభివృద్ధి పనులన్నీ అధికారికంగా ఆమోదం పొందినవే. ఆగమ శాస్త్ర ప్రకారం.. వైదిక కమిటీ.. పీఠాధిపతుల సూచనల మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన షెడ్లను నిర్మించి డార్మెంటరీలుగా తీర్చిదిద్దుతున్నాం. - చంద్రశేఖర్ ఆజాద్, ఈఓ, శ్రీశైలం దేవస్థానం -
కల్యాణ వైభోగమే..
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి రోజున చెంచుల సంప్రదాయంతో మల్లన్న కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్‌తెలిపారు. చెంచుల సంస్కృతి సంప్రదాయాలకు శ్రీశైలక్షేత్రానికి, సంకాత్రి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రచారంలో ఉన్న స్థానిక జానపద కథలలో భాగంగా ఒకప్పుడు శ్రీ మల్లికార్జునస్వామి శ్రీశైలం అడవుల్లో చెంచు వేషంలో సంచరిస్తూ ఒక చెంచు కన్యను మకర సంక్రాంతి రోజునే వివాహం చేసుకున్నారని చెబుతారన్నారు. అందుకే ఇప్పటికీ చెంచులు శ్రీ భ్రమరాంబాదేవిని తమ కూతురిగా మల్లికార్జునుడిని తమ అల్లుడిగా భావిస్తారని వివరించారు. అలాగే చెంచులు స్వామివార్లను చెంచుమల్లన్న, చెంచు మల్లయ్య అని అప్యాయంగా పిలుచుకుంటారన్నారు. ఆలయ ప్రాకార కుడ్యంపై ఒక అటవిక యువతికాలిలో గ్రుచ్చుకున్న ముల్లును ఒక అటవిక యువకుడు తీస్తున్నట్లుగా మలచబడిన శిల్పం ఈ జానపత కథకు బలాన్ని చేకూరుస్తుందన్నారు. ఈశిల్పంలోని అటవిక యువకుడే చెంచుల వేషంలో ఉండే మల్లికార్జునుడు అని చెంచు భక్తులు భావిస్తారన్నారు. అంతేకాకుండా మల్లికార్జునుడు చెంచు యువతిని ఎవరికీ తెలియకుండా సంక్రాంతి రోజున రహస్యంగా వివాహం చేసుకున్నాడని, అందుకే ఈ సంక్రాంతి కల్యాణోత్సవాన్ని తమ సంప్రదాయంలో శ్రీ స్వామివారి దొంగపెళ్లిగా భావిస్తారని స్థానిక చెంచులు పేర్కొన్నట్లు చెప్పారు.