న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక నిరసనల్లో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం జామా మసీదు ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని ఆయనకు కోర్టు నిబంధన విధించింది. నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించింది. కాగా మతపరమైన ప్రార్థనా మందిరాలకు వెళ్లడానికి మాత్రం అనుమతి కల్పించింది. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా గురువారం రాత్రి విడుదలయ్యారు. (భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్)
ఢిల్లీ వదిలి వెళ్లడానికి 24 గంటల సమయం ఉండడంతో శుక్రవారం ఆయన జామా మసీదు దగ్గర జరుగుతున్న నిరసన ప్రదర్శనలో రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆర్డర్స్‌ను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనే తమ బలమన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు మాత్రమే ఆందోళన చేపట్టడంలేదని, అన్ని మతాల ప్రజలు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వాస్తవానికి ఇదే మసీదు ముందు నెల రోజుల క్రితం భీమ్ ఆర్మీ చీఫ్ ధర్నా చేపట్టి అరెస్టయ్యారు. కోర్టు షరతులకు అనుగుణంగానే తాను 24 గంటల్లో ఢిల్లీ వదిలి వెలతానని చెప్పారు. అయితే ఆయన జామా మసీదు వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నట్లే కనిపిస్తున్నా.. ఆయన మాత్రం నేను నిరసనల్లో పాల్గొనలేదని కేవలం రాజ్యాంగ ప్రవేశికను మాత్రమే చదివి వినిపించానని చెప్పారు. ఆయన జామా మసీదు ప్రాంగణంలో ఉన్నంతసేపు నిరసనకారులు ఆజాదీ.. ఆజాదీ అంటూ నినదించారు. (జామా మసీద్ పాక్‌లో ఉందా..?)
Comments
Please login to add a commentAdd a comment