నుపుర్ శర్మ అరెస్టు కోరుతూ ఢిల్లీలో జామియా మిలియా విద్యార్థుల ధర్నా
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల తాలూకు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాటిని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ నిరసనలు, ఆందోళనలు జరిగాయి. రాంచీ తదితర చోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి. వాటిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కూడా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కశ్మీర్‌లో పలుచోట్ల కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. నిరసనల వ్యాప్తిని అడ్డుకునేందుకు కశ్మీర్‌తో పాటు పశ్చిమబెంగాల్లోనూ కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. పలు రాష్ట్రాల్లో వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.
రాంచీలో రాళ్ల దాడి
ఢిల్లీలోని చారిత్రక జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనకారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ప్రవక్తపై అభ్యంతకరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ అరెస్టుకు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. దాంతో భారీగా బలగాలను మోహరించాల్సి వచ్చింది. ప్రాంగణం బయట నిరసనలకు దిగిందెవరో తెలియదని జామా మసీదు షాహీ ఇమాం సయీద్ అహ్మద్ బుఖారీ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నుపుర్‌ను అరెస్టు చేయాలంటూ జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లో ధర్నాకు దిగారు.
బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జార్ఖండ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాంచీలో స్థానిక హనుమాన్ మందిర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ప్రార్థనల అనంతరం భారీ నినాదాలతో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఒక దశలో సంయమనం కోల్పోయి రాళ్ల దాడికి పాల్పడటంతో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అయినా లాభం లేకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్తత నేపథ్యంలో రాంచీలో ఉదయం నుంచీ తీవ్ర ఉద్రిక్త త నెలకోవడంతో దుకాణాలూ తెరుచుకోలేదు.
అట్టుడికిన కశ్మీర్
నుపుర్ వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ అట్టుడికింది. రెండు ప్రాంతాల్లోనూ భారీ ఆందోళనలతో పాటు పలుచోట్ల భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు జరిగాయి. ముందుజాగ్రత్తగా శ్రీనగర్‌తో పాటు భదేర్వా, కిష్త్‌వార్ తదితర పట్టణాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపేశారు. లోయలో చాలాచోట్ల దుకాణాలు తదితరాలు తెరుచుకోలేదు. పశ్చిమబెంగాల్లో హౌరా జిల్లాలో పోలీసులతో నిరసనకారులు బాహాబాహీ తలపడ్డారు.
అక్కడ పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. నిరసనల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఇటు మహారాష్ట్రలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై శివార్లలోని పన్వేల్‌లో జరిగిన భారీ నిరసనల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థానే, ఔరంగాబాద్, సోలాపూర్, నందుర్బార్, పర్భనీ, బీడ్, లాతూర్, భండారా, చంద్రపూర్, పుణె జిల్లాల్లో చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి. నుపుర్, జిందార్‌తో పాటు స్వామి యతి నర్సింగానంద్‌లను అరెస్టు చేయాలంటూ మహారాష్ట్ర, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
దిష్టిబొమ్మకు ఉరి
యూపీలోనూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ప్రయాగ్‌రాజ్, సహరన్‌పూర్ సహా నాలుగైదు నగరాల్లో పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రయాగ్‌రాజ్‌లో మోటార్‌సైకిళ్లకు, రిక్షాలకు నిప్పంటించారు. ఓ పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లక్నోతో పాటు బిజ్నోర్, రాంపూర్ తదితర చోట్లా అల్లర్లు చెలరేగాయి. గుజరాత్‌లో అహ్మదాబాద్, వదోదర తదితర నగరాల్లో నిరసనలు కొనసాగాయి. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బంద్ పాటించారు. కర్నాటకలోని బెల్గావీలో ఓ మసీదు వద్ద నుపుర్ దిష్టిబొమ్మను ఉరి తీశారు. ‘నుపుర్‌ను తక్షణం అరెస్టు చేయాలి’ అంటూ హైదరాబాద్‌లో కూడా భారీ నిరసనలు జరిగాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా ఇదే డిమాండ్‌తో ఢాకా సహా పలు నగరాలు, పట్టణాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు.
#WATCH People in large numbers protest at Delhi's Jama Masjid over inflammatory remarks by suspended BJP leader Nupur Sharma & expelled leader Naveen Jindal, earlier today
— ANI (@ANI) June 10, 2022
No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH
Comments
Please login to add a commentAdd a comment