వారణాసిలో ఇదీ వరస | ex judge ex jawan priest to fight pm in varanasi | Sakshi
Sakshi News home page

వారణాసిలో ఇదీ వరస

Published Sun, Apr 14 2019 4:44 AM | Last Updated on Sun, Apr 14 2019 10:17 AM

ex judge ex jawan priest to fight pm in varanasi - Sakshi

తేజ్‌ బహదూర్‌ యాదవ్‌, డీఎస్‌ కర్ణన్‌, అభినందన్‌ పాఠక్‌

వారణాసి.. హరహర మహాదేవ్‌ నామస్మరణతో మారు మోగిపోయే పుణ్యక్షేత్రం. శివభక్తితో ఓలలాడే కాశీపురం. ఎన్నికల వేళ ‘హర్‌ హర్‌ మోదీ.. ఘర్‌ ఘర్‌ మోదీ’ నినాదాలతో హోరెత్తిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. అయితే అనూహ్యంగా చాలామంది ఈ నియోజకవర్గం నుంచి పోటీకి  సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలపడానికి కొందరు, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని మరికొందరు, ప్రధానిపై పోటీ చేస్తే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఇంకొందరు, ఇలా చాలామంది ‘కాశీకి పోతాము రామాహరీ’ అంటూ క్యూ కడుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణలో నిజామాబాద్‌ నియోజకవర్గంలో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఏకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ అభ్యర్థుల సంఖ్య 185కి చేరి.. ఎన్నికల సంఘానికే పరీక్షగా మారింది. ఇప్పుడు వారణాసిలోనూ అదే వరస కనిపించే సూచనలున్నాయి.

► కోల్‌కతా హైకోర్టుకి చెందిన రిటైర్డ్‌ న్యాయమూర్తి డీఎస్‌ కర్ణన్‌ వారణాసి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడి శిక్ష అనుభవించిన మొదటి న్యాయమూర్తి కర్ణన్‌. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈయ న వారణాసిని ఎంచుకున్నారు. 63 ఏళ్ల కర్ణన్‌ 2018లో యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు.

► బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ కూడా తన నిరసన తెలపడానికి ఎన్నికలనే ఎంచుకున్నారు. జవాన్లకు నాసిరకమైన ఆహారాన్ని పెడుతున్నారంటూ గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో అప్‌లోడ్‌ చేశారు. అది వైరల్‌గా మారడంతో తేజ్‌ బహదూర్‌పై కోర్టు విచారణ జరిగింది. ఆయన చేసిన ఆరోపణలన్నీ తప్పుడువని తేలడంతో కేంద్రం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ‘వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలియజెప్పడానికే. నేను ఈ ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ ఒక సందేశాన్నయితే పంపించగలను’ అని యాదవ్‌ అన్నారు.

► బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)కి చెం దిన ప్రొఫెసర్‌ విశ్వంభర్‌ నాథ్‌ మిశ్రా కూడా ఈసారి వారణాసి బరిలో ఉన్నారు.


తెలుగు రాష్ట్రాల ఫ్లోరోసిస్‌ బాధితులూ..
2017లో తమిళనాడుకి చెందిన వంద మందికి పైగా రైతు లు ఢిల్లీలో చేసిన నిరసన ప్రదర్శనలు గుర్తున్నాయి కదా.. ఎన్ని రోజులు పస్తులుంటూ నిరాహార దీక్ష చేసినా కేంద్రం వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కసితో వాళ్లంతా పి.అయ్యకన్ను నేతృత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఎన్ని కల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు చెందిన ఫ్లోరోసిస్‌ బాధితులు తమ దుర్భర జీవితాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి వారణాసి బరిని ఎంచుకున్నారు. వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్‌ తదితర సామాజిక కార్యకర్తల నేతృత్వంలో ఎన్నికల్లో మోదీతో పోటీకి సై అంటున్నారు.


ఫ్లోరోసిస్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న లక్ష్యం తోనే వీరు వారణాసిని ఎంచుకున్నారు. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ కూడా ఈసారి వారణాసిలో మోదీని ఎదుర్కొంటున్నారు. తన ఆవేశపూరిత ప్రసంగాలతో దళిత యువతను ఆకర్షిస్తున్నారు. ‘మోదీ ఓటమికి రోజులు దగ్గర పడ్డాయ్‌‘ అని ఆజాద్‌ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమంటే గంగ ప్రక్షాళన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, క్లీన్‌ గంగ ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వారణాసిలోని సంకట్‌ మోచన్‌ దేవాలయం మహంత్‌ విశ్వంభర్‌ నాథ్‌ మిశ్రా కాంగ్రెస్‌ టికెట్‌పై వారణాసి నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

రంగస్థలంలో మోదీ డూప్లికేట్‌
అభినందన్‌ పాఠక్‌ గుర్తున్నారా? అచ్చు గుద్దినట్టు మోదీ పోలికలతోనే ఉంటారు. ఆయన రూపురేఖలు, వేసుకునే దుస్తులు, నడక, నడత, పలుకు అన్నీ మోదీనే తలపిస్తాయి. తన ప్రసంగాలను కూడా మిత్రాన్‌ అనే మొదలు పెడతారు. ఒకప్పుడు మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఏడాది కిందటే రూటు మార్చి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన కూడా వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న మోదీ వారణాసిలో నామినేషన్‌ వేయనున్నారు. అదే రోజు ఈ డూప్లికేట్‌ మోదీ కూడా నామినేషన్‌ వేయడానికి సన్నాహా లు చేస్తున్నారు.

‘నేను డమ్మీ అభ్యర్థిని కాను. మోదీ పోలికలతో పుట్టడం నా శాపమేమో. చాలామంది నన్ను అడుగుతున్నారు. అచ్చేదిన్‌ ఎక్కడా అని. ప్రధాని తాను ఇచ్చి న హామీలు నెరవేర్చకపోతే నేనేం చేయాలి. అందుకే వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయదలచుకున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల గెలిస్తే రాహుల్‌గాంధీ కే మద్దతు ఇస్తా’ అని అన్నారు. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్‌ ఉప ఎన్నికల్లో ఈ అభినందన్‌ బీజేపీకి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం విశేషం.

బరిలో ప్రొఫెసర్లు, సైనికులు
ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్నికల బరిలో ఢీకొనడానికి ఎంతోమంది కదనోత్సాహంతో వారణాసికి కదిలి వెళుతున్నారు. వీరిలో ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి, తమిళనాడుకి చెందిన కొందరు రైతులు, కేంద్రం ఉద్యోగం నుంచి తొలగించిన సరిహద్దు భద్రతా జవాను, ఫ్లోరోసిస్‌ బాధితులు.. ఇలా చాలామందే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement