Varanasi lok sabha constituency
-
మోదీకి ప్రకాశం వాసుల ఝలక్..
సాక్షి, ప్రకాశం: తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వినూత్న మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తూ తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు అవశ్యకతను చాటిచెప్పుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ బరిలో నిలుస్తున్న వారాణాసి లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మలు శుక్రవారం వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పలువురు స్థానికులు కూడా వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాళభైరవ ఆలయం వద్ద వెలిగొండ పోరాట సాధన సమితి సభ్యులు నిరసన తెలిపారు. కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్నారు. ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. మరోవైపు మోదీపై పోటీ చేయడానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు కూడా గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని నిజామాబాద్ రైతులు పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో రైతులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీ కవిత బరిలో నిలిచిన నిజామాబాద్ స్థానం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అక్కడ ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఇబ్బందికరంగా మారింది. -
నామినేషన్ వేసిన నరేంద్ర మోదీ
సాక్షి, వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కాలభైరవుడి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాసిలో నామినేషన్ వేసేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. కాలభైరవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా స్థానిక మహిళలతో మోదీ కరచాలనం చేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. నరేంద్ర మోదీ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నాయకులు వారణాసికి వరుస కట్టారు. నామినేషన్ వేయడానికి ముందు కలెక్టరేట్ ఆఫీస్‌లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం, అప్నాదళ్, నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలతో మోదీ భేటీ అయ్యారు. ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు ఈ సందర్భంగా పాదాభివందనం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మోదీపై మళ్లీ ఆయన్నే బరిలో నిలిపిన కాంగ్రెస్..!
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారనే ప్రచారం సాగినప్పటికీ అవన్నీ తేలిపోయాయి. గత ఎన్నికల్లో మోదీని ఎదుర్కొన్న అజయ్ రాయ్‌నే కాంగ్రెస్ మళ్లీ బరిలో నిలిపింది. పార్టీ ఆదేశిస్తే పోటీకి దిగుతానని ప్రియాంక చెప్పడం.. సస్పెన్స్ కొనసాగించడం మంచిదే కదా అని రాహుల్ వ్యాఖ్యానించడంతో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అజయ్ రాయ్ స్థానికుడు కావడం, రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఆయనవైపే పార్టీ మొగ్గు చూపినట్టు తెలిసింది. (చదవండి : నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని) అయితే, కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ప్రియాంకకు పరాజయం ఎదురైతే పార్టీకి మరింత నష్టమని భావించే అజయ్‌రాయ్‌ని మరోసారి పోటీకి దించారని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం అజయ్ నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై పోటీచేసిన అజయ్ 75 వేల ఓట్లు సాధించి మూడు స్థానంలో నిలిచారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రెండు లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడు లక్షల ఓట్ల మెజారిటీతో మోదీ రికార్డు విజయం సాధించారు. బీజేపీలోనే రాజకీయ పాఠాలు.. బీజేపీ విద్యార్థి విభాగంలో పనిచేసిన అజయ్ అక్కడే రాజకీయ ఓనమాలు దిద్దారు. తొలిసారి (1996) కలాస్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పటి వరకు తొమ్మిది సార్లు కలాస్లాలో పాగావేసిన సీపీఐ అభ్యర్థిని ఓడించడంతో ఆయన పేరు మారుమోగింది. 2009లో వారణాసి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ అజయ్ పార్టీని వీడారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున మురళీమనోహర్ జోషితో తలపడి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీచేశారు. గంగా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం నిషేదాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టడంతో అజయ్ 2015లో అరెస్టయ్యారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అజయ్ మోదీని రెండోసారి ఢీకొట్టి ఏమేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి..! -
నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో వారణాసి లోక్‌సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. చివరి దశ (ఏడో దశ)లో భాగంగా మే 19న ఇక్కడ ఎన్నిక జరగనుంది. మోదీ శుక్రవారం (రేపు) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం సాయంత్రం భారీ రోడ్‌షో నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కాషాయ కోలాహలంతో నిండిపోయింది. ‘దర్భంగా, బందాలో భారీ బహిరంగ సభల అనతరం తనకెంతో ఇష్టమైన కాశీకి చేరుకున్నా. లక్షలాది మంది నా సోదర, సోదరీమణులను కలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. హరహర మహదేవ్’ అంటూ ట్వీట్ చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన మదన్‌పురా, సోనార్‌పురాతో పాటు 150కి పైగా ప్రదేశాలగుండా ఈ ర్యాలీ సాగనుంది. కాశీలో గంగా హారతి అనంతరం మూడు వేల మంది ఇంటలెక్చువల్స్‌తో భేటీ అయి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కాశీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్‌షో జరిగే ప్రాంతమంతా డ్రోన్లతో నిఘావేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్‌షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, పీయూష్ గోయల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బిహార్ సీఎం నితీష్‌కుమార్, శిరోమణి అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్ బాదల్, లోక్ జనశక్తి చీఫ్ రామ్‌విలాస్ పాశ్వాన్ తదితరులు పాల్గొననున్నారు. After bumper rallies in Darbhanga and Banda, I am heading to beloved Kashi. There are a series of programmes lined up, which would give me another excellent opportunity to interact with my sisters and brothers of Kashi. Har Har Mahadev! — Chowkidar Narendra Modi (@narendramodi) April 25, 2019 -
వారణాసిలో ఇదీ వరస
వారణాసి.. హరహర మహాదేవ్ నామస్మరణతో మారు మోగిపోయే పుణ్యక్షేత్రం. శివభక్తితో ఓలలాడే కాశీపురం. ఎన్నికల వేళ ‘హర్ హర్ మోదీ.. ఘర్ ఘర్ మోదీ’ నినాదాలతో హోరెత్తిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. అయితే అనూహ్యంగా చాలామంది ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలపడానికి కొందరు, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని మరికొందరు, ప్రధానిపై పోటీ చేస్తే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఇంకొందరు, ఇలా చాలామంది ‘కాశీకి పోతాము రామాహరీ’ అంటూ క్యూ కడుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణలో నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఏకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ అభ్యర్థుల సంఖ్య 185కి చేరి.. ఎన్నికల సంఘానికే పరీక్షగా మారింది. ఇప్పుడు వారణాసిలోనూ అదే వరస కనిపించే సూచనలున్నాయి. ► కోల్‌కతా హైకోర్టుకి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి డీఎస్ కర్ణన్ వారణాసి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడి శిక్ష అనుభవించిన మొదటి న్యాయమూర్తి కర్ణన్. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈయ న వారణాసిని ఎంచుకున్నారు. 63 ఏళ్ల కర్ణన్ 2018లో యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ► బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కూడా తన నిరసన తెలపడానికి ఎన్నికలనే ఎంచుకున్నారు. జవాన్లకు నాసిరకమైన ఆహారాన్ని పెడుతున్నారంటూ గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. అది వైరల్‌గా మారడంతో తేజ్ బహదూర్‌పై కోర్టు విచారణ జరిగింది. ఆయన చేసిన ఆరోపణలన్నీ తప్పుడువని తేలడంతో కేంద్రం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ‘వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలియజెప్పడానికే. నేను ఈ ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ ఒక సందేశాన్నయితే పంపించగలను’ అని యాదవ్ అన్నారు. ► బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)కి చెం దిన ప్రొఫెసర్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కూడా ఈసారి వారణాసి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ఫ్లోరోసిస్ బాధితులూ.. 2017లో తమిళనాడుకి చెందిన వంద మందికి పైగా రైతు లు ఢిల్లీలో చేసిన నిరసన ప్రదర్శనలు గుర్తున్నాయి కదా.. ఎన్ని రోజులు పస్తులుంటూ నిరాహార దీక్ష చేసినా కేంద్రం వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కసితో వాళ్లంతా పి.అయ్యకన్ను నేతృత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఎన్ని కల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు చెందిన ఫ్లోరోసిస్ బాధితులు తమ దుర్భర జీవితాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి వారణాసి బరిని ఎంచుకున్నారు. వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్ తదితర సామాజిక కార్యకర్తల నేతృత్వంలో ఎన్నికల్లో మోదీతో పోటీకి సై అంటున్నారు. ఫ్లోరోసిస్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న లక్ష్యం తోనే వీరు వారణాసిని ఎంచుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈసారి వారణాసిలో మోదీని ఎదుర్కొంటున్నారు. తన ఆవేశపూరిత ప్రసంగాలతో దళిత యువతను ఆకర్షిస్తున్నారు. ‘మోదీ ఓటమికి రోజులు దగ్గర పడ్డాయ్‘ అని ఆజాద్ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమంటే గంగ ప్రక్షాళన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, క్లీన్ గంగ ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం మహంత్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కాంగ్రెస్ టికెట్‌పై వారణాసి నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రంగస్థలంలో మోదీ డూప్లికేట్ అభినందన్ పాఠక్ గుర్తున్నారా? అచ్చు గుద్దినట్టు మోదీ పోలికలతోనే ఉంటారు. ఆయన రూపురేఖలు, వేసుకునే దుస్తులు, నడక, నడత, పలుకు అన్నీ మోదీనే తలపిస్తాయి. తన ప్రసంగాలను కూడా మిత్రాన్ అనే మొదలు పెడతారు. ఒకప్పుడు మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఏడాది కిందటే రూటు మార్చి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన కూడా వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న మోదీ వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. అదే రోజు ఈ డూప్లికేట్ మోదీ కూడా నామినేషన్ వేయడానికి సన్నాహా లు చేస్తున్నారు. ‘నేను డమ్మీ అభ్యర్థిని కాను. మోదీ పోలికలతో పుట్టడం నా శాపమేమో. చాలామంది నన్ను అడుగుతున్నారు. అచ్చేదిన్ ఎక్కడా అని. ప్రధాని తాను ఇచ్చి న హామీలు నెరవేర్చకపోతే నేనేం చేయాలి. అందుకే వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయదలచుకున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల గెలిస్తే రాహుల్‌గాంధీ కే మద్దతు ఇస్తా’ అని అన్నారు. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఈ అభినందన్ బీజేపీకి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం విశేషం. బరిలో ప్రొఫెసర్లు, సైనికులు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్నికల బరిలో ఢీకొనడానికి ఎంతోమంది కదనోత్సాహంతో వారణాసికి కదిలి వెళుతున్నారు. వీరిలో ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి, తమిళనాడుకి చెందిన కొందరు రైతులు, కేంద్రం ఉద్యోగం నుంచి తొలగించిన సరిహద్దు భద్రతా జవాను, ఫ్లోరోసిస్ బాధితులు.. ఇలా చాలామందే ఉన్నారు. -
వారణాసిని పట్టించుకోరు
అయోధ్య: ప్రధానిపై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ విదేశాలు నిర్విరామంగా తిరుగుతున్న మోదీ సొంత నియోజకవర్గం వారణాసిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దీంతో వారణాసిలో ఆమె బరిలోకి దిగుతారని వినిపిస్తున్న ఊహాగాలను మరింత బలం చేకూరినట్లయింది. శుక్రవారం అయోధ్యలో ఓ వీధిలో ప్రజలతో ముచ్చటిస్తూ ప్రియాంక.. బీజేపీ ప్రభుత్వం ధనికులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతులు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన సందర్భంగా అక్కడ జరిగిన అభివృద్ధి గురించి అడిగితే విమానాశ్రయం నుంచి పట్టణానికి నిర్మించిన రోడ్డు గురించి చెప్పారని అన్నారు. గత యూపీయే ప్రభుత్వం మంజూరు చేసిన 150 కి.మీలో కేవలం 15 కి.మీ రోడ్డు వేశారని, విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగే ఆ దారి నిండా గుంతలున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో మోదీ తన నియోజకవర్గంలోని గ్రామంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని గుర్తుచేశారు. యూపీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
'విఛ్చిన్నకర శక్తులను తిప్పికొట్టండి'
వారణాసి: విఛ్చిన్నకర శక్తులను తిప్పికొట్టాలని వారణాసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఘనమైన సాంస్కృతిక సంపదను కాపాడుకోవాలని వారణాసి ప్రజలను కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి మనీష్ తివారి కోరారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే విభజనవాదులను గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా కాశీ పోరును వర్ణించారు. వారణాసిలో నిన్న నామినేషన్ వేయడానికి వచ్చిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం పలికారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ పోటీలో మరొక ప్రముఖ అభ్యర్థి. మే 12న వారణాసి లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
నాకు ఓటేయొద్దు ప్లీజ్..: నరేంద్రనాథ్ దూబే
ఫలితాలెలా ఉన్నా, గెలవాలనే లక్ష్యంతోనే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తారు. నరేంద్రనాథ్ దూబే మాత్రం కాస్త వెరైటీ వ్యక్తి. ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాలనేది ఆయన లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసమే ఆయన 1984 నుంచి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పొరపాటుగానైనా గెలిచిన పాపాన పోని నరేంద్రనాథ్, ఈసారి కూడా ఇదే ఒరవడి కొనసాగించాలనుకుంటున్నారు. తొలిసారిగా 1984లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చెరాల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు. ఆ తర్వాత మునిసిపాలిటీ స్థాయి నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పలు ఎన్నికల్లో పోటీచేసి, అప్రతిహతంగా పరాజయ పరంపరను కొనసాగించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి జనశక్తి ఏకతా పార్టీ అభ్యర్థిగా దూబే బరిలోకి దిగారు. గిన్నిస్ రికార్డు సాధించడమే తన ఏకైక లక్ష్యమని, ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే ఓడి తీరుతానని ఈ ఓటువీరుడు ధీమాగా చెబుతున్నారు. -
త్రిముఖ ‘వార్’ణాసి
కాశీలో ‘కమల’ వికాసం తేలికేం కాదు వారణాసి నుంచి శ్రీదేవి - సాక్షి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం వారణాసిని ఎంచుకోవడంతో ఈ నియోజకవర్గం మీడియాలో ఇదివరకు ఎన్నడూ లేని ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని వడోదరా నుంచి కూడా మోడీ పోటీ చేస్తున్నా, వారణాసిపై బీజేపీ సర్వశక్తులూ కేంద్రీకరిస్తోంది. వారణాసి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోిషీ 2009 ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్ల ఆధిక్యతతో గట్టెక్కారు. వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు- ఉత్తర వారణాసి, దక్షిణ వారణాసి, వారణాసి కంటోన్మెంట్, రోహనియా, సేవాపురి ఉన్నాయి. వారణాసి (ఉత్తర, దక్షిణ, కంటోన్మెంట్) సెగ్మెంట్లు మూడింటినీ 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. సేవాపురిని సమాజ్‌వాదీ పార్టీ, రోహనియాను అప్నాదళ్ గెలుచుకున్నాయి. మోడీ గెలుపు కోసం మార్గాన్ని సుగమం చేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ బృందం రోహనియా సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్‌తో పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా బీజేపీ ప్రతాప్‌గఢ్, మీర్జాపూర్ (ఎస్సీ) లోక్‌సభ స్థానాలను అప్నాదళ్‌కు విడిచిపెట్టింది. సేవాపురి, రోహనియా సెగ్మెంట్లలో బీజేపీ ఉనికి నామమాత్రం. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చోట్లా బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది. అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ ఓబీసీ అయిన కుర్మీ వర్గానికి చెందిన నేత కావడంతో, పొత్తు ఫలితంగా ఈ ప్రాంతంలో కుర్మీ వర్గానికి చెందిన 1.50 లక్షల ఓట్లు మోడీ ఖాతాలో పడగలవని బీజేపీ భావిస్తోంది. దక్షిణ వారణాసికి చెందిన కాంగ్రెస్ నేత దయాశంకర్ మిశ్రా అలియాస్ దయాళును అమిత్ షా బృందం బీజేపీ వైపు మళ్లించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దయాళు ఓటమి చెందినా, గెలుపొందిన బీజేపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రజల ధోరణిని గమనిస్తే, బీజేపీ పట్ల ఓటర్లు పెద్దగా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. అయితే మోడీని ఇక్కడి నుంచి గెలిపిస్తే, ఆయన ద్వారా వారణాసిలో కొంత మేరకు ‘అభివృద్ధి’ సాధ్యపడుతుందని మాత్రం భావిస్తున్నారు. వారణాసి అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన నగరమే అయినా ఇక్కడ తగిన విద్యుత్తు, రహదారులు, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు లేవని, మోడీ ప్రధాని పదవి చేపడితే పరిస్థితిలో మార్పు రాగలదని వారణాసికి చెందిన ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. ఇక్కడ మోడీకి గెలుపు మాత్రం నల్లేరుపై నడక కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి బరిలోకి దించిన అజయ్ రాయ్‌కి వారణాసి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఈయన ప్రస్తుతం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో లేకున్నా, వారణాసి ప్రజలు అజయ్‌ని స్థానికుడిగానే గుర్తిస్తారు. భూమిహార్ బ్రాహ్మణ వర్గానికి చెందిన అజయ్‌కి గల అంగబలం కారణంగా ఆయనకు స్థానికంగా ‘బాహుబలి’గా గుర్తింపు ఉంది. వారణాసిలో బ్రాహ్మణుల జనాభా గణనీయంగా ఉన్నందున ఇది కూడా అజయ్ కలిసొచ్చే అవకాశం ఉంది. బ్రాహ్మణుడైన మురళీమనోహర్ జోషీకి ఈసారి పార్టీకి అంతగా పట్టులేని కాన్పూర్ స్థానాన్ని కేటాయించడంతో ఇక్కడి బ్రాహ్మణులు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై విద్యార్థులు, యువకులు, మేధావుల్లో ఆదరణ కనిపిస్తోంది. చక్రం తిప్పనున్న ‘డాన్’ వారణాసి బరి నుంచి వైదొలిగిన ఖ్వామీ ఏక్తా పార్టీ అధినేత, మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, ఈ ఎన్నికల్లో చక్రం తిప్పనున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే అయిన ముఖ్తార్ ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉన్నారు. వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తొలుత ప్రకటించినా తర్వాత తప్పుకున్నారు. అయినా ఈయన ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా లౌకిక అభ్యర్థికి మద్దతిస్తామని ఈ ‘డాన్’ చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌తో ముఖ్తార్ అన్సారీకి పాత స్పర్థలు ఉన్నాయి. వారణాసిలో ఇద్దరికీ గ్యాంగులు ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ‘ఆప్’ లేదా కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీకి అన్సారీ మద్దతు ప్రకటించే సూచనలు ఉన్నాయి. పాత గొడవలను పక్కనపెట్టి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే మోడీకి గట్టి పోటీ తప్పదు. దేశంలో మిగిలిన అన్ని చోట్లా పోలింగ్ ముగిశాక, తుది విడతలో మే 12న ఇక్కడ పోలింగ్ జరగనున్నందున, ఇక్కడి ఫలితాలపై ఇప్పటిదాకా వెలువడ్డ అంచనాలు తారుమారయ్యే అవకాశాలూ లేకపోలేదు. వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన నేతలు 1977: చంద్రశేఖర్, జనతా పార్టీ 1980: కమలాపతి త్రిపాఠీ, కాంగ్రెస్(ఐ) 1984: శ్యామ్‌లాల్ యాదవ్, కాంగ్రెస్ 1989: అనిల్ శాస్త్రి, జనతాదళ్ 1991: శిరీష్‌చంద్ర దీక్షిత్, బీజేపీ 1996: శంకర్‌ప్రసాద్ జైస్వాల్, బీజేపీ 1998: శంకర్‌ప్రసాద్ జైస్వాల్, బీజేపీ 1999: శంకర్‌ప్రసాద్ జైస్వాల్, బీజేపీ 2004: డాక్టర్ రాజేశ్‌కుమార్ మిశ్రా, కాంగ్రెస్ 2009: డాక్టర్ మురళీమనోహర్ జోషీ, బీజేపీ -
ప్రియాంక- మో'ఢీ'
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ఎలావుంటుందో ఊహించండి. ఇదే నిజమైతే దేశం యావత్తు దృష్టి ఈ పోటీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఆసక్తికర పోటీకి అవకాశం లేకపోలేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో సోనియా తనయ ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రియాంకను పోటీకి దించితే మోడీకి చెమటలు పట్టడం ఖాయమని కాంగీయులు అంచనా వేస్తున్నారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేథీలో ప్రజాకర్ష ప్రచారకర్తగా ఉన్న ప్రియాంక దూసుకుపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. అయితే మోడీకి చెక్ పెట్టగల సమర్థురాలు ప్రియాంక గాంధీయేనని, ఆమెను వారణాసిలో పోటీకి దించాలన్న ప్రతిపాదన వచ్చింది. సీనియర్ నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచన చేశారు. పోటీకి ప్రియాంక విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పెద్దలు వెనక్కు తగ్గారు. మోడీపై పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేయడంలో ఆసక్తికర పోటీ ప్రతిపాదన ఆదిలోనే ఆగిపోయింది. రాయబరేలీ, అమేథీ మాత్రమే పరిమితమవుతానని ఆమె పేర్కొన్నారు. -
'వాల్'ను (మో)ఢీ కొడతారా?
లోక్‌సభ ఎన్నికలు మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌గా మారాయి. మొదట్లో మోడీ-రాహుల్ మధ్య సార్వత్రిక పోరు ఉంటుందని భావించినా ఇప్పుడు పరిస్థితి మారింది. ఢిల్లీ సీఎం పీఠం నుంచి దిగిపోయిన తర్వాత కేజ్రీవాల్ నేరుగా సాధారణ ఎన్నికల సమరంలోకి దూకారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందరికంటే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలకు సవాల్ విసిరారు. ఢిల్లీలో తనకు 'చేయి' ఇచ్చిన కాంగ్రెస్‌ను, హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మంత్రాంగం నడిపించిన 'కమలం' పార్టీని దుయ్యబడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేజ్రీవాల్ ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. దీనిలో భాగంగా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో నాలుగు రోజుల పాటు కేజ్రీవాల్ పర్యటన చేపట్టారు. నరేంద్ర మోడీ తాను చేసినట్లు చెప్పుకొంటున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. అయితే కేజ్రీవాల్‌కు కాషాయ దళాలు అడుగడుగునా నిరసనలతో స్వాగతం చెప్పాయి. నల్లజెండాల ప్రదర్శన, రాళ్ల దాడితో దౌర్జన్యానికి దిగాయి. నిబంధనల పేరుతో గుజరాత్ అధికార యంత్రాగం ఆయనకు అడ్డంకులు సృష్టించింది. ఒకదశలో ఆయనను నిర్బంధించారు. కేజ్రీవాల్ నిర్బంధంతో ఆప్, కాషాయ పార్టీల కార్యకర్తలు కుమ్ములాటలకు దిగారు. గుజరాత్లో తీవ్రస్థాయిలో కాషాయ దండు నుంచి వ్యతిరేకత వచ్చినా కేజ్రీవాల్ బెదరలేదు. మోడీని నేరుగా కలిసేందుకు విఫలయత్నం చేశారు. గ్యాస్ ధరలు, గుజరాత్లో అభివృద్ధిపై చర్చించేందుకు మోడీతో సమావేశానికి పట్టుబట్టారు. అయితే అపాయింట్మెంట్ లేని కారణంగా ఆయన 'నమో'ను కలవలేకపోయారు. తన వంటి సామాన్యుడిని కలుసుకునేందుకు మోడీకి సమయం లేకపోయిందని కేజ్రీవాల్ ఆ తర్వాత విమర్శించారు. తాను ఉగ్రవాదిని కానని, ఓ మాజీ సీఎంను అని పేర్కొంటూ.. అందువల్ల తనను మోడీ మర్యాదపూర్వకంగా అయినా పిలవాల్సిదంటూ నిష్టూమాడారు. కేజ్రీవాల్ గుజరాత్లో అడుగుపెట్టి విమర్శలు గుప్పించినా మోడీ పెద్దగా స్పందించలేదు. మరోవైపు మోడీపైనే పోటీ చేసేందుకు 'సామాన్యూడు' సిద్ధమవుతున్నాడు. గుజరాత్ కాకుండా మరెక్కడి నుంచైనా నరేంద్ర మోడీ పోటీ చేస్తే ఆయనపై పోటీకి కేజ్రీవాల్ సిద్ధమని ఆప్ నేతలు అంటున్నారు. 'షీలా దీక్షిత్ ఓడింది.. ఇక మోడీ వంతు' అంటూ చీపురుకట్టలు పట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. కాగా, మోడీని వారణాసి నుంచి బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. వారణాసిలో మోడీ పోటీ చేయడానికి సిద్ధమైతే..కేజ్రివాల్ కూడా బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నారని ఆప్ నేతలు ప్రకటించారు. మోడీ, కేజ్రీవాల్ ముఖాముఖి తలపడతారా, లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.