'వాల్'ను (మో)ఢీ కొడతారా?
లోక్సభ ఎన్నికలు మోడీ వర్సెస్ కేజ్రీవాల్గా మారాయి. మొదట్లో మోడీ-రాహుల్ మధ్య సార్వత్రిక పోరు ఉంటుందని భావించినా ఇప్పుడు పరిస్థితి మారింది. ఢిల్లీ సీఎం పీఠం నుంచి దిగిపోయిన తర్వాత కేజ్రీవాల్ నేరుగా సాధారణ ఎన్నికల సమరంలోకి దూకారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందరికంటే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలకు సవాల్ విసిరారు. ఢిల్లీలో తనకు 'చేయి' ఇచ్చిన కాంగ్రెస్ను, హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మంత్రాంగం నడిపించిన 'కమలం' పార్టీని దుయ్యబడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేజ్రీవాల్ ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. దీనిలో భాగంగా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో నాలుగు రోజుల పాటు కేజ్రీవాల్ పర్యటన చేపట్టారు. నరేంద్ర మోడీ తాను చేసినట్లు చెప్పుకొంటున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. అయితే కేజ్రీవాల్కు కాషాయ దళాలు అడుగడుగునా నిరసనలతో స్వాగతం చెప్పాయి. నల్లజెండాల ప్రదర్శన, రాళ్ల దాడితో దౌర్జన్యానికి దిగాయి. నిబంధనల పేరుతో గుజరాత్ అధికార యంత్రాగం ఆయనకు అడ్డంకులు సృష్టించింది. ఒకదశలో ఆయనను నిర్బంధించారు. కేజ్రీవాల్ నిర్బంధంతో ఆప్, కాషాయ పార్టీల కార్యకర్తలు కుమ్ములాటలకు దిగారు.
గుజరాత్లో తీవ్రస్థాయిలో కాషాయ దండు నుంచి వ్యతిరేకత వచ్చినా కేజ్రీవాల్ బెదరలేదు. మోడీని నేరుగా కలిసేందుకు విఫలయత్నం చేశారు. గ్యాస్ ధరలు, గుజరాత్‌లో అభివృద్ధిపై చర్చించేందుకు మోడీతో సమావేశానికి పట్టుబట్టారు. అయితే అపాయింట్‌మెంట్ లేని కారణంగా ఆయన 'నమో'ను కలవలేకపోయారు. తన వంటి సామాన్యుడిని కలుసుకునేందుకు మోడీకి సమయం లేకపోయిందని కేజ్రీవాల్ ఆ తర్వాత విమర్శించారు. తాను ఉగ్రవాదిని కానని, ఓ మాజీ సీఎంను అని పేర్కొంటూ.. అందువల్ల తనను మోడీ మర్యాదపూర్వకంగా అయినా పిలవాల్సిదంటూ నిష్టూమాడారు.
కేజ్రీవాల్ గుజరాత్లో అడుగుపెట్టి విమర్శలు గుప్పించినా మోడీ పెద్దగా స్పందించలేదు. మరోవైపు మోడీపైనే పోటీ చేసేందుకు 'సామాన్యూడు' సిద్ధమవుతున్నాడు. గుజరాత్ కాకుండా మరెక్కడి నుంచైనా నరేంద్ర మోడీ పోటీ చేస్తే ఆయనపై పోటీకి కేజ్రీవాల్ సిద్ధమని ఆప్ నేతలు అంటున్నారు. 'షీలా దీక్షిత్ ఓడింది.. ఇక మోడీ వంతు' అంటూ చీపురుకట్టలు పట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. కాగా, మోడీని వారణాసి నుంచి బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. వారణాసిలో మోడీ పోటీ చేయడానికి సిద్ధమైతే..కేజ్రివాల్ కూడా బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నారని ఆప్ నేతలు ప్రకటించారు. మోడీ, కేజ్రీవాల్ ముఖాముఖి తలపడతారా, లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.