Tej Bahadur Yadav
-
‘దుష్యంత్ చౌతాలా నన్ను మోసం చేశారు’
చండీగఢ్ : జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తనను మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి, భారత ఆర్మీ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టి హరియాణా ప్రజల తీర్పును దుష్యంత్ అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీకి జేజేపీ బీ- టీమ్‌లా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని స్థానిక జేజేపీ హరియాణా కింగ్‌మేకర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేశాయి. అనేక పరిణామాల అనంతరం తమ పార్టీ బీజేపీకి మద్దతునిస్తున్నట్లు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ఇక జేజేపీ అండతో మరోసారి అధికారం చేపట్టనున్న బీజేపీ.. ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్లో తగిన ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం. (చదవండి : హరియాణాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే) ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై జేజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజ్ బహదూర్ దుష్యంత్ తీరుపై మండిపడ్డారు. ‘దుష్యంత్ చౌతాలా నాతో పాటు హరియాణా ప్రజలను ఘోరంగా మోసం చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీకి మద్దతునిచ్చారు. బీజేపీని రాష్ట్రం నుంచి, అధికారం నుంచి తొలగించాలంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఇక 2017లో భారత జవాన్లకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ సెల్ఫీ వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన తేజ్ బహదూర్‌ను భారత భద్రతా దళం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ(ఉత్తరప్రదేశ్)లో చేరిన ఆయన... 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ మహాకూటమి(బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ) అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరులో జేజేపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం మనోహర్‌లాల్‌పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. -
యాదవ్ నామినేషన్ తిరస్కరణ : ఈసీ వివరణ కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఎస్పీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఈసీ వివరణ కోరింది. దీనిపై రేపటిలోగా బదులివ్వాలని, యాదవ్ విజ్ఞప్తిని పరిశీలించాలని ఈసీని ఆదేశించింది. కాగా స్వతంత్ర అభ్యర్ధిగా, ఎస్పీ అభ్యర్ధిగా తాను దాఖలు చేసిన రెండు నామినేషన్లను ఈసీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ యాదవ్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తన రెండు నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాల గురించి తాను సకాలంలో ఈసీకి వివరణ ఇచ్చినా నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ఈసీ కోరిన ఆధారాలను సైతం సకాలంలో సమర్పించినా నామినేషన్‌ను తిరస్కరించారని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా యాదవ్ ఎస్పీ అభ్యర్ధిగా, స్వతంత్ర అభ్యర్ధిగా దాఖలు చేసిన రెండు నామినేషన్లలో తాను ఉద్యోగం నుంచి వైదొలిగేందుకు పరస్పరం వేర్వేరు కారణాలను పొందుపరిచారని అంటూ ఈసీ ఆయన నామినేషన్‌ను బుధవారం తిరస్కరించింది. వారణాసిలో ప్రధాని మోదీపై ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్ధిగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను విపక్షాలు బరిలో దింపిన సంగతి తెలిసిందే. -
రూ. 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తా!
న్యూఢిల్లీ: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీకి ప్రయత్నించిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. రూ. 50 కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపేస్తానని ఆయన చెప్తున్నట్టుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎస్పీ తరఫున వారణాసిలో తేజ్ బహదూర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పలు తప్పిదాల కారణంగా ఎన్నికల సంఘం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన రెండేళ్ల కిందట వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వీడియో ఎంతవరకు ప్రామాణికమైనదనే అంశం ఇంకా తేలలేదు. జాతీయ చానెళ్లలో ప్రసారమైన ఈ వీడియోలో తేజ్ బహదూర్ ఓ స్నేహితుడితో మాట్లాడుతూ.. రూ. 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని చెప్పాడు. అందుకు పాకిస్థాన్ ఇస్తుందని స్నేహితుడు బదులివ్వగా.. తాను దేశభక్తుడినని, పాక్ సాయం తీసుకోబోనని, భారతీయుడు డబ్బు ఇస్తే.. ఈ పని చేస్తానని అతను చెప్పుకొచ్చినట్టు ఈ వీడియోలో సంభాషణ ఉంది. ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి రూ. 50 కోట్లతో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేయడం షాకింగ్ ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో మార్ఫింగ్ చేశారని, ఇది ఫేక్ వీడియో అని తేజ్ బహదూర్ అంటున్నారు. -
నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకు జవాన్
సాక్షి, న్యూఢిల్లీ : వారణాసి నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ సర్వోన్నత న్యాయస్ధానంలో సవాల్ చేశారు. ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ యాదవ్ తరపున వాదనలు వినిపించనున్నారు. యాదవ్ నామినేషన్లో లోపాలున్నాయని బుధవారం రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. బీజేపీ నేతల కనుసైగలతోనే తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని యాదవ్ ఆరోపించారు. తన రెండు నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాల గురించి తాను సకాలంలో ఈసీకి వివరణ ఇచ్చినా నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ఈసీ కోరిన ఆధారాలను సైతం సకాలంలో సమర్పించినా నామినేషన్‌ను తిరస్కరించారని, దీనిపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా యాదవ్ ఎస్పీ అభ్యర్ధిగా, స్వతంత్ర అభ్యర్ధిగా దాఖలు చేసిన రెండు నామినేషన్లలో తాను ఉద్యోగం నుంచి వైదొలిగేందుకు పరస్పరం వేర్వేరు కారణాలను పొందుపరిచారని ఈసీ ఆయన నామినేషన్‌ను బుధవారం తిరస్కరించింది. వారణాసిలో ప్రధాని మోదీపై ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్ధిగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను విపక్షాలు బరిలో దింపిన సంగతి తెలిసిందే. -
మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ
వారణాసి: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. భద్రతాబలగాలకు పెట్టే ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేస్తూ ఆన్లైన్లో వీడియో పెట్టడంతో 2017లో తేజ్ బహదూర్‌ను విధుల నుంచి తొలగించారు. ఆయన సమర్పించిన రెండు జతల నామినేషన్ పత్రాల్లో తేడాలున్నట్లు గుర్తించిన వారణాసి రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. -
వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీకి చుక్కెదురు
-
మాజీ జవానుకు షాకిచ్చిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసి బరిలో నిలిచిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీచేస్తున్న యాదవ్ నామినేషన్‌ను అక్కడి అధికారులు తిరస్కరించారు. సరైన పత్రాలు సమర్పించ లేదంటూ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసీ ఆదేశించినట్టే సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అన్యాయంగా తన నామినేషన్‌ను తిరస్కరించారని యాదవ్ ఆరోపించారు. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించ నున్నట్టు తెలిపారు. కాగా షాలినీ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌ను బరిలో నిలిపింది ఎస్పీ. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కోలేదంటూ ఈసీ మంగళవారం యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది. మే 1వ తేదీలోగా (బుధవారంలోగా) సమాధానం ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ప్రధాని X మాజీ కానిస్టేబుల్
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని మార్చింది. భద్రతాదళాలకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో ఫిర్యాదు చేసి విధుల నుంచి తొలగిన బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ నేత ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) లతో కూడిన ఎస్పీ కూటమి వారణాసి నుంచి మొదట తన అభ్యర్థిగా షాలిని యాదవ్‌ను ప్రకటించింది. ‘అవినీతిపై ప్రశ్నించినందుకు నన్ను విధుల నుంచి తొలగించారు. భద్రతా దళాల్లో ఉన్న అవినీతిని తొలగించడమే నా ప్రధాన ధ్యేయం’అని తేజ్ బహదూర్ విలేకరులకు వెల్లడించారు. మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయిన తేజ్ బహదూర్ యాదవ్ జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు అందించే ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదుచేస్తూ 2017లో సోషల్ మీడియాలో ఓ వీడియో అప్లోడ్ చేశారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. 7వ దశ ఎన్నికల్లో భాగంగా వారణాసిలో మే 19న ఎన్నికలు జరుగనున్నాయి. -
వారణాసిలో ఇదీ వరస
వారణాసి.. హరహర మహాదేవ్ నామస్మరణతో మారు మోగిపోయే పుణ్యక్షేత్రం. శివభక్తితో ఓలలాడే కాశీపురం. ఎన్నికల వేళ ‘హర్ హర్ మోదీ.. ఘర్ ఘర్ మోదీ’ నినాదాలతో హోరెత్తిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. అయితే అనూహ్యంగా చాలామంది ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలపడానికి కొందరు, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని మరికొందరు, ప్రధానిపై పోటీ చేస్తే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఇంకొందరు, ఇలా చాలామంది ‘కాశీకి పోతాము రామాహరీ’ అంటూ క్యూ కడుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణలో నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఏకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ అభ్యర్థుల సంఖ్య 185కి చేరి.. ఎన్నికల సంఘానికే పరీక్షగా మారింది. ఇప్పుడు వారణాసిలోనూ అదే వరస కనిపించే సూచనలున్నాయి. ► కోల్‌కతా హైకోర్టుకి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి డీఎస్ కర్ణన్ వారణాసి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడి శిక్ష అనుభవించిన మొదటి న్యాయమూర్తి కర్ణన్. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈయ న వారణాసిని ఎంచుకున్నారు. 63 ఏళ్ల కర్ణన్ 2018లో యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ► బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కూడా తన నిరసన తెలపడానికి ఎన్నికలనే ఎంచుకున్నారు. జవాన్లకు నాసిరకమైన ఆహారాన్ని పెడుతున్నారంటూ గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. అది వైరల్‌గా మారడంతో తేజ్ బహదూర్‌పై కోర్టు విచారణ జరిగింది. ఆయన చేసిన ఆరోపణలన్నీ తప్పుడువని తేలడంతో కేంద్రం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ‘వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలియజెప్పడానికే. నేను ఈ ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ ఒక సందేశాన్నయితే పంపించగలను’ అని యాదవ్ అన్నారు. ► బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)కి చెం దిన ప్రొఫెసర్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కూడా ఈసారి వారణాసి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ఫ్లోరోసిస్ బాధితులూ.. 2017లో తమిళనాడుకి చెందిన వంద మందికి పైగా రైతు లు ఢిల్లీలో చేసిన నిరసన ప్రదర్శనలు గుర్తున్నాయి కదా.. ఎన్ని రోజులు పస్తులుంటూ నిరాహార దీక్ష చేసినా కేంద్రం వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కసితో వాళ్లంతా పి.అయ్యకన్ను నేతృత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఎన్ని కల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు చెందిన ఫ్లోరోసిస్ బాధితులు తమ దుర్భర జీవితాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి వారణాసి బరిని ఎంచుకున్నారు. వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్ తదితర సామాజిక కార్యకర్తల నేతృత్వంలో ఎన్నికల్లో మోదీతో పోటీకి సై అంటున్నారు. ఫ్లోరోసిస్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న లక్ష్యం తోనే వీరు వారణాసిని ఎంచుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈసారి వారణాసిలో మోదీని ఎదుర్కొంటున్నారు. తన ఆవేశపూరిత ప్రసంగాలతో దళిత యువతను ఆకర్షిస్తున్నారు. ‘మోదీ ఓటమికి రోజులు దగ్గర పడ్డాయ్‘ అని ఆజాద్ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమంటే గంగ ప్రక్షాళన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, క్లీన్ గంగ ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం మహంత్ విశ్వంభర్ నాథ్ మిశ్రా కాంగ్రెస్ టికెట్‌పై వారణాసి నుంచి పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రంగస్థలంలో మోదీ డూప్లికేట్ అభినందన్ పాఠక్ గుర్తున్నారా? అచ్చు గుద్దినట్టు మోదీ పోలికలతోనే ఉంటారు. ఆయన రూపురేఖలు, వేసుకునే దుస్తులు, నడక, నడత, పలుకు అన్నీ మోదీనే తలపిస్తాయి. తన ప్రసంగాలను కూడా మిత్రాన్ అనే మొదలు పెడతారు. ఒకప్పుడు మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఏడాది కిందటే రూటు మార్చి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన కూడా వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న మోదీ వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. అదే రోజు ఈ డూప్లికేట్ మోదీ కూడా నామినేషన్ వేయడానికి సన్నాహా లు చేస్తున్నారు. ‘నేను డమ్మీ అభ్యర్థిని కాను. మోదీ పోలికలతో పుట్టడం నా శాపమేమో. చాలామంది నన్ను అడుగుతున్నారు. అచ్చేదిన్ ఎక్కడా అని. ప్రధాని తాను ఇచ్చి న హామీలు నెరవేర్చకపోతే నేనేం చేయాలి. అందుకే వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయదలచుకున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల గెలిస్తే రాహుల్‌గాంధీ కే మద్దతు ఇస్తా’ అని అన్నారు. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఈ అభినందన్ బీజేపీకి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం విశేషం. బరిలో ప్రొఫెసర్లు, సైనికులు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్నికల బరిలో ఢీకొనడానికి ఎంతోమంది కదనోత్సాహంతో వారణాసికి కదిలి వెళుతున్నారు. వీరిలో ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి, తమిళనాడుకి చెందిన కొందరు రైతులు, కేంద్రం ఉద్యోగం నుంచి తొలగించిన సరిహద్దు భద్రతా జవాను, ఫ్లోరోసిస్ బాధితులు.. ఇలా చాలామందే ఉన్నారు. -
'ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు'
సాక్షి, చండీగఢ్ : సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికులకు పౌష్టికాహారం పెట్టడం లేదంటూ సంచలన వీడియో పోస్ట్ చేసి అనంతరం ఉద్యోగాన్నికోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కోర్టు మెట్లెక్కారు. తన ఉద్యోగాన్ని తనకు తిరిగి ఇప్పించాలంటూ హర్యానా కోర్టును ఆశ్రయించారు. ఆ వీడియోను తాను అప్లోడ్ చేయలేదని, తన సహచరులే ఆ పనిచేశారని కోర్టుకు వెళ్లడించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర హోంశాఖకు, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మకు, బీఎస్ఎఫ్ 29 బెటాలియన్ కమాండెంట్‌కు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వచ్చే మే (2018) 28కి వాయిదా వేసింది. తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ ఓ సెల్ఫీ వీడియోను తేజ్ బహదూర్ గత ఏడాది (2017) జనవరి 8న ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో దేశ వ్యాప్తంగా పెను సంచలనం అయింది. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతడిని ఎవరికీ తెలియని చోట పోస్టింగ్ ఇచ్చారని కక్ష పూరితంగా వ్యవహరించారిన తేజ్ భార్య కూడా ఆరోపించింది. అయితే, తేజ్ ఉద్దేశ పూర్వకంగా ఈ పనిచేశాడని పేర్కొంటూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ బీఎస్ఎఫ్ నిర్ణం తీసుకుంది. అయితే, ఆ వీడియోను తాను పోస్ట్ చేయలేదని, తన సహచర ఉద్యోగుల్లో ఎవరో ఒకరు అది చేసి ఉంటారని, అతడి ఉద్యోగంపై వేసిన వేటును బీఎస్ఎఫ్ వెనక్కు తీసుకొని తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ తేజ్ తరుపు న్యాయవాది తాజాగా కోర్టును అభ్యర్థించారు. -
ఆ జవాను ఫేస్బుక్ అకౌంట్లో 500 మంది పాకిస్తానీలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్బుక్ స్నేహితుల్లో 500 మంది పాకిస్తానీలు ఉన్నారు. తేజ్ ఫేస్బుక్ అకౌంట్ ను పరిశీలించగా అతని ఫ్రెండ్స్‌లో 17శాతం మంది పాకిస్తానీలు ఉన్నట్లు తేలిందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వారిలో ఎంతమందికి పాకిస్తానీ నిఘా సంస్ధ ఐఎస్ఐతో సంబంధాలున్నాయో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. తేజ్ ఒరిజినల్ అకౌంట్ మాత్రమే కాక మరో 39 నకిలీ అకౌంట్లను కలిగి ఉన్నాడని చెప్పారు. దీనిపై స్పందించిన ఓ బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి తేజ్ ఫేస్బుక్ అకౌంట్లో మూడు వేల మంది స్నేహితులు ఉన్నట్లు వెల్లడించారు. జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద తేజ్‌ను బీఎస్ఎఫ్ విధులకు పంపింది. కాగా, గత నెల మొదటి వారంలో బోర్డర్లో కాపలాకాస్తున్న జవానులకు పెడుతున్న ఆహారం గురించి తేజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. -
జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులకు నాణ్యమైన ఆహారం అందించడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ ఇటీవల తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేయగా, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా బీఎస్ఎఫ్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించడం తెలిసిందే. ఆరోపణలు చేసిన జవాను అవిధేయుడనీ, మత్తులో తూగుతూ గతంలో పై అధికారి మీదకు తుపాకీ కూడా ఎక్కు పెట్టాడని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ ఆరోపణలను తేజ్ బహదూర్ యాదవ్ కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. -
అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?
చండీగఢ్: సరిహద్దు రక్షక దళం(బీఎస్ఎఫ్)లో సైనికుల దుస్థితిని వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చిన తన భర్తపై కక్ష సాధిస్తున్నారని తేజ్ బహదూర్ యాదవ్ భార్య షర్మిల వాపోయింది. ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని తనను ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని తనతో యాదవ్ చెప్పాడని ఆమె వెల్లడించారు. బీఎస్ఎఫ్ సైనికులకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ తన భర్త వీడియో ద్వారా ప్రపంచానికి వెల్లడి చేయడాన్ని ఆమె సమర్థించారు. కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని తన భర్త సహించడని, అందువల్లే ఉద్యోగంలో చాలాసార్లు సమస్యలు ఎదుర్కొన్నాడని తెలిపారు. తన భర్త మానసిక పరిస్థితి సరిగా లేదన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. ‘ఆయనకు మతిస్థిమితం లేదని, క్రమశిక్షణ పాటించడని అంటున్నారు. అటువంటి ఆయనకు సరిహద్దులో కీలక ప్రాంతాల్లో కాపలా కాయడానికి తుపాకీ ఎందుకు ఇచ్చార’ని షర్మిల ప్రశ్నించారు. కాగా, తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో ఇప్పటివరకు 90 లక్షల మంది వీక్షించారు. 4.4 లక్షల మంది షేర్ చేశారు. -
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
-
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో జవానుల ధీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను చేరింది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సోషల్ మీడియాల్లో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాల్లో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు. మీడియాలో యాదవ్ వీడియోలు ప్రసారమైన వెంటనే రాజ్‌నాథ్ స్పందించారు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.