న్యూఢిల్లీ: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీకి ప్రయత్నించిన బీఎస్‌ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. రూ. 50 కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపేస్తానని ఆయన చెప్తున్నట్టుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎస్పీ తరఫున వారణాసిలో తేజ్ బహదూర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పలు తప్పిదాల కారణంగా ఎన్నికల సంఘం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన రెండేళ్ల కిందట వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వీడియో ఎంతవరకు ప్రామాణికమైనదనే అంశం ఇంకా తేలలేదు. జాతీయ చానెళ్లలో ప్రసారమైన ఈ వీడియోలో తేజ్ బహదూర్ ఓ స్నేహితుడితో మాట్లాడుతూ.. రూ. 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని చెప్పాడు. అందుకు పాకిస్థాన్ ఇస్తుందని స్నేహితుడు బదులివ్వగా.. తాను దేశభక్తుడినని, పాక్ సాయం తీసుకోబోనని, భారతీయుడు డబ్బు ఇస్తే.. ఈ పని చేస్తానని అతను చెప్పుకొచ్చినట్టు ఈ వీడియోలో సంభాషణ ఉంది. ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి రూ. 50 కోట్లతో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేయడం షాకింగ్ ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో మార్ఫింగ్ చేశారని, ఇది ఫేక్ వీడియో అని తేజ్ బహదూర్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment