
సాక్షి, న్యూఢిల్లీ : వారణాసి నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని డిస్మిస్ అయిన బీఎస్‌ఎఫ్ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ సర్వోన్నత న్యాయస్ధానంలో సవాల్ చేశారు. ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ యాదవ్ తరపున వాదనలు వినిపించనున్నారు. యాదవ్ నామినేషన్‌లో లోపాలున్నాయని బుధవారం రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
బీజేపీ నేతల కనుసైగలతోనే తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని యాదవ్ ఆరోపించారు. తన రెండు నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాల గురించి తాను సకాలంలో ఈసీకి వివరణ ఇచ్చినా నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ఈసీ కోరిన ఆధారాలను సైతం సకాలంలో సమర్పించినా నామినేషన్‌ను తిరస్కరించారని, దీనిపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన స‍్పష్టం చేశారు. కాగా యాదవ్ ఎస్పీ అభ్యర్ధిగా, స్వతంత్ర అభ్యర్ధిగా దాఖలు చేసిన రెండు నామినేషన్లలో తాను ఉద్యోగం నుంచి వైదొలిగేందుకు పరస్పరం వేర్వేరు కారణాలను పొందుపరిచారని ఈసీ ఆయన నామినేషన్‌ను బుధవారం తిరస్కరించింది. వారణాసిలో ప్రధాని మోదీపై ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్ధిగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను విపక్షాలు బరిలో దింపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment