గద్వాల క్రైం: ఆ గ్రామంలో గుప్తనిధులు దొరుకుతాయనే ప్రచారం ఉంది. అందులోనూ ఇంటి నిర్మాణాల కోసం గుంతలు తవ్వినా పురాతన నాణేలు బయటపడిన సంఘటనలు కోకొల్లలు. గత పదేళ్ల క్రితం పంచలోహాల విగ్రహాలు లభ్యమయ్యాయి. గద్వాల సంస్థానాధీశులు ఆ గ్రామాన్ని రాజుల రాజధానిగా కార్యకళాపాలు సాగించిన ఊరు. పురావస్తు శాఖ అధికారులు సైతం గ్రామంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అంతా సవ్యంగా ఉన్న గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు పూడూరు గ్రామ శివారులోని పురాతన విగ్రహాన్ని తొలగించిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని బక్కమ్మ చెరువు సమీపంలో వెలసిన శివలింగంను గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి గుప్తనిధుల కోసం సుమారు ఆరు ఫీట్ల మేర తవ్వకాలు జరిపారు. దీంతో గ్రామస్తులు గద్వాల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని పురాతన ఆలయాల వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో విగ్రహాలు, బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయన్నారు. స్తబ్ధుగా ఉన్న గ్రామంలో మళ్లీ గుప్తనిధుల కోసం తవ్వకాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది సైతం..
గద్వాల రాజులు పూడూరు గ్రామాన్ని రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని పలు ఆలయాలను నిర్మించారు. చోళ్లరాజులు సైతం ఈ ప్రాంతంలో దేవాలయం నిర్మించారు. దీంతో గ్రామంలో నిధులు ఉన్నాయనే తెలుసుకుని పలువురు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అయితే గ్రామంలోని పురాతన ఆలయాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలపై నిషేధాజ్ఞలు విధించారు. గ్రామస్తులు సైతం ఇంటి నిర్మాణాలు, వ్యవసాయ పనుల కోసం గుంతలు తవ్విన క్రమంలో పలు విలువైన నాణేలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంకుడు గుంత కోసం తవ్వకాలు జరిపిన క్రమంలో 20 పురాతన నాణేలు బయటపడ్డాయి. గ్రామస్తుల సమాచారం మేరకు వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గుప్తనిధుల కోసం రహస్యంగా పలువురు అంగతకులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు తెలిపారు.
కేసు నమోదు..
గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలం వద్దకు చేరుకొని పరిశీలించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. గుప్తనిధుల కోసం తవ్విన తవ్వకాలనే అంశాలపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment