రాజోళి శివారులో జంట హత్య (ఫైల్)
గద్వాల క్రైం: ఏ కుటుంబంలోనైనా వారి మధ్య సంబంధాలు బలంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ పదికాలాలపాటు నిలబడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఆత్మీయ అనురాగాలు, అనుబంధాల మధ్య జీవనం సాగించేవారు.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు చెడుదారులు.. వ్యసనాలకుఅలవాటుపడి తమ విలువైన జీవితాలను చే జేతులా నాశనం చేసుకుంటున్నారు. జోగుళాంబ జిల్లాలోని గద్వాల, గట్టు, కేటీదొడ్డి, మల్దకల్, ధరూరు, అయిజ, ఇటిక్యాల, మానవపాడు, అలంపూర్, రాజోలి, శాంతినగర్ తదితర మండలాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు హత్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
కార్తీక్ హత్యతో కలకలం..
గద్వాలకు చెందిన కార్తీక్ హత్య, మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య ఘటనలు ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించాయి. వివాహిత మొదట కార్తీక్‌తో అనంతరం రవికుమార్ సన్నిహితంగా ఉండడం.. చివరకు కార్తీక్‌ను అడ్డుతొలగించుకునేందుకు మిగతా ఇద్దరు పథకం పన్ని హత్య చేయడం, అనంతరం వివాహిత సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.
మరికొన్ని ఘటనలు ఇలా..
♦ 2019 అక్టోబర్ 15న రాజోళి మండలం తాండ్రపాడుకు చెందిన ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. భర్తకు తెలిస్తే ప్రమాదమని తెలిసి.. మరొకరితో కలిసి భర్తనే హత్య చేయించింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
♦ 2019 మే 7న కర్నూలుకు చెందిన ఇద్దరు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు. అయితే మహిళకు సంబంధించిన బంధువులు (వడ్డేపల్లి మండలంలోని కొంకల) ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా రాజోళి శివారులో ఇద్దరిని సొంత కుమారుడే తన తల్లితోపాటు మరో వ్యక్తిని అందరూ చూస్తుండగానే వేట కొడవలితో హత్య చేశాడు.
♦ 2019 మార్చిలో కేటీదొడ్డి మండలానికి తిమ్మప్ప, పాతపాలెంకు చెందిన కొలిమి వె ంకటేష్‌లను వివాహేతర సంబంధం నేపథ్యంలో గు ర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
జల్సాలకు అలవాటుపడి..
ప్రస్తుతం కొందరు యువత ఆకర్షణకు లోనై.. జల్సాలకు, విలాసవంతమైన జీవనం సాగించాలనే దృక్పథంతో మెలుగుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులోనే మద్యం, ఇతర అలవాట్లకు బానిసవుతున్నారు. సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో స్నేహమంటూనే తమలోని విషం కక్కుతున్నారు. గంటల తరబడి చాటింగ్, ఫోన్ సంభాషణతో వారికి నచ్చిన కానుకలను ఇవ్వాలనే కుతూహలంతో తప్పటడుగులు వేస్తున్నారు. కట్టడి చేయాల్సిన తల్లిదండ్రులు సైతం పెద్దగా పట్టించుకోకపోవడం వీరికి కలిసొచ్చే అవకాశంగా మారింది. ఇంట్లో పెద్దలతో ఎలా మాట్లాడాలనే విషయాలు కుటుంబ సభ్యులు చెప్పకపోవడం సమస్యగా ఉంది. దీంతో అల్లరి తిరుగుడులు, చెడుస్నేహాలు, నీలి చిత్రాలు, మద్యం, గంజాయి, గుట్కా తదితర వ్యసనాలకు బానిసలై నేరస్థులుగా మారుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో మధ్యలో చదువు మానేసి.. జులాయిగా తిరగడం అలవాటు చేసుకుంటున్నారు. జల్సాలకు చోటిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సీరియల్స్ ప్రభావం తీవ్రమే..
ఆత్మీయ అనురాగాల మధ్య ఉండాల్సిన కుటుంబ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకత ధోరణి ఉంది. నిత్యం టీవీలలో వచ్చే సీరియల్స్, సినిమాలలో జరుగుతున్న సంఘటనలు మానవాళి వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఇంటిల్లిపాది చూడాల్సిన సిమాలు, సీరియల్స్ వస్తున్న దాఖలాలు లేవు. తెరపై వస్తున్న దృశ్యాలు మనుషుల మొదడులో నిర్లిప్తమవుతాయి. వినడం కంటే కనిపించే దృశ్యాలే చాలా వరకు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. మరోవైపు కాలంతో పరుగులు తీస్తున్నామనే ధోరణితో కుటుంబ సభ్యులు ఇంట్లోని అంశాలను మాట్లాడుకోవడం ఎక్కడా లేదు. దీంతో నేడు ఎన్నో కుటుంబాలు సరైన మార్గంలో లేక వ్యవస్థను పాతాళం వైపు తీసుకెళ్తున్నాయి. దీంతో పిల్లలను కుటుంబ సభ్యులు కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో అనుకోని సమస్యలు చుట్టుముడుతున్నాయి.
తగు చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక హత్యల విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో జరుగుతున్న హత్యలన్నీ అవగాహన లోపం, క్షణికావేశంలో జరుగుతున్నవే. వీటిపై పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. అలాగే నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం. హత్య కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment