గుప్తనిధుల కోసం తవ్వకాలు
నంది విగ్రహం తొలగించిన దుండగులు
వివరాలు సేకరించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి
యాచారం: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపి నంది విగ్రహం తొలగించారు. ఈ సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామ ప్రారంభంలోనే కుక్కరూపంలోని నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం కింద గుప్త నిధులు ఉండొచ్చనే ఆశతో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహన్ని ఓ పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. దుండగులు రెండు అడుగుల లోతులో ఉన్న విలువైన నిధులను అపహరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి తవ్వకాల జరిపిన తీరును పరిశీలించారు. మూడేళ్ల క్రితం ఓసారి గుర్తు తెలియని వ్యక్తులు ఈ నంది విగ్రహం వద్ద తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, సర్పంచ్ రాజునాయక్ తదితరులు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. విచారణ జరుపుతున్నామని సీఐ మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.