
సాక్షి, అమరావతి: రామాయపట్నం పోర్టును డిసెంబర్‌కి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా పటిష్టమైన ప్రణాళికతో పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ తొలి దశలో డిసెంబర్‌కి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టిపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, ఒక మల్టీపర్సస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో హ్యాండిల్ చేసే నాలుగో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తి కావడంతో పాటు నార్త్ బ్రేక్ వాటర్‌ను ఆనుకొని బల్క్ కార్గో బెర్త్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి అదనంగా సముద్రపు ఒడ్డుపై (ఆఫ్‌షోర్) అవసరమైన కస్టమ్స్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది.
డిసెంబర్‌కి పోర్టులో వాణిజ్య పరంగా కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారని, దీనికనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.ప్రతాప్ ‘సాక్షి’కి తెలిపారు. బెర్తుల నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ టెస్టెల్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, పోర్టు నిర్వహణకు అవసరమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ లేఖ రాయడంతో పాటు కస్టమ్స్ కార్యకలాపాల కోసం 27.88 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు.
కస్టమ్స్ నిబంధనలు అనుసరించి సరుకు నిర్వహణ చేపట్టడం, రామాయపట్నం పోర్టును ఇమ్మిగ్రేషన్ ల్యాండింగ్ పాయింటింగ్ ప్రకటించడం వంటి దానికోసం కేంద్ర సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు నవంబర్‌లోగా తీసుకువస్తామని తెలిపారు.
మౌలిక వసతుల కల్పన
పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అవసరమైన రహదారి, రైలు మార్గం, నీటి వసతి వంటివాటిపై ఏపీ మారిటైమ్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. జాతీయ రహదారి నుంచి రామాయపట్నం పోర్టును అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 5.5 కి.మీ పొడవైన రహదారి మార్గాన్ని కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. 5 కి.మీ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వేతో చర్చిస్తున్నారు. పోర్టు నిర్వహణకు అవసరమైన నీటిని కావలి వాటర్ ట్యాంక్ నుంచి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment