సిండికేటు లూటీ! | TDP Govt officials colluded to Loot with close contractors in capital tenders | Sakshi

సిండికేటు లూటీ!

Published Mon, Mar 24 2025 4:46 AM | Last Updated on Mon, Mar 24 2025 4:46 AM

TDP Govt officials colluded to Loot with close contractors in capital tenders

రాజధాని టెండర్లలో సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు

సిండికేట్‌కు పనులు కట్టబెట్టేలా బిడ్‌ కెపాసిటీని ఫిబ్రవరి 10న పెంచేసిన సర్కార్‌

ఏడీసీఎల్‌ రూ.10,696.79 కోట్లతో 37 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు కాంట్రాక్టర్లకు పంచిన వైనం

తాజాగా సీఆర్‌డీఏ రూ.16,463.83 కోట్లతో 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు అస్మదీయ కాంట్రాక్టర్ల పరం

మొత్తం 59 ప్యాకేజీల పనులను తన సొంత మనుషులు అయిన కాంట్రాక్టర్లకే అప్పగింత

వీటి విలువ రూ.27,159 కోట్లు 

కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై అదనపు భారం

చంద్రబాబుకు సన్నిహితమైన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు రూ.6,216.47 కోట్లు, ఈనాడు కిరణ్‌ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.6,031.79 కోట్ల విలువైన పనుల అప్పగింత  

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడు­తున్నారు. మొన్న..  రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివా­రణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్‌­మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏడీసీఎల్‌) నిర్వహించిన టెండర్లలో సిండికేట్‌ బాగోతం బట్టబయలైంది. 

నేడు..  రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్‌ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్‌డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. 

ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్‌లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

సిండ్ఙికేటు’ రాజ్యం..!
రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్‌జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్‌ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్‌లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్‌ కెపాసిటీని 2 ఎన్‌ఎన్‌–బీ నుంచి 3 ఏఎన్‌–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. 

అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్‌ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.

పూలింగ్‌ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..
భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. 

ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్‌డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్‌ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్‌డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్‌లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.

– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.
– ఈనాడు కిరణ్‌ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్కు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.
– బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.
– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్‌తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ నిర్మాణం, ఓ ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్‌ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.
– మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు ఐఏఎస్‌ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.
– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్‌ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.

ఎనిమిది సంస్థలకే పనులన్నీ..
రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్‌కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్‌ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్‌డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. 

వాటన్నింటినీ సిండికేట్‌లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్‌సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రా (నారా లోకేష్‌ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్‌ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌కు రూ.779.82 కోట్లు, ఎల్‌ అండ్‌ టీ సంస్థకు   రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.

నీకింత.. నాకింత..
సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. 

ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్‌ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్‌ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement