dredging
-
డిసెంబర్‌కు రెడీ!
సాక్షి, అమరావతి: రామాయపట్నం పోర్టును డిసెంబర్‌కి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా పటిష్టమైన ప్రణాళికతో పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ తొలి దశలో డిసెంబర్‌కి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టిపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్సస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో హ్యాండిల్ చేసే నాలుగో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తి కావడంతో పాటు నార్త్ బ్రేక్ వాటర్‌ను ఆనుకొని బల్క్ కార్గో బెర్త్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి అదనంగా సముద్రపు ఒడ్డుపై (ఆఫ్‌షోర్) అవసరమైన కస్టమ్స్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. డిసెంబర్‌కి పోర్టులో వాణిజ్య పరంగా కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారని, దీనికనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.ప్రతాప్ ‘సాక్షి’కి తెలిపారు. బెర్తుల నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ టెస్టెల్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, పోర్టు నిర్వహణకు అవసరమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ లేఖ రాయడంతో పాటు కస్టమ్స్ కార్యకలాపాల కోసం 27.88 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. కస్టమ్స్ నిబంధనలు అనుసరించి సరుకు నిర్వహణ చేపట్టడం, రామాయపట్నం పోర్టును ఇమ్మిగ్రేషన్ ల్యాండింగ్ పాయింటింగ్ ప్రకటించడం వంటి దానికోసం కేంద్ర సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు నవంబర్‌లోగా తీసుకువస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అవసరమైన రహదారి, రైలు మార్గం, నీటి వసతి వంటివాటిపై ఏపీ మారిటైమ్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. జాతీయ రహదారి నుంచి రామాయపట్నం పోర్టును అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 5.5 కి.మీ పొడవైన రహదారి మార్గాన్ని కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. 5 కి.మీ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వేతో చర్చిస్తున్నారు. పోర్టు నిర్వహణకు అవసరమైన నీటిని కావలి వాటర్ ట్యాంక్ నుంచి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. -
సాగర మథనం..
గ్రేటర్ తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా జలమండలి చర్యలు ► డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా పుట్టంగండి వద్ద కాల్వ తవ్వకం ► నీటిలోనే భారీ యంత్రాలతో తవ్వకం సాగిస్తున్న సిబ్బంది ► రాతి నేలను తొలిచేందుకు అనేక వ్యయప్రయాసలు ► మరో వారం రోజుల్లో సాగర మథనం పూర్తయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్ గ్రేటర్ తాగునీటి అవసరాలకు తరలిస్తున్న కృష్ణా జలాలకు ఎలాంటి ఢోకా లేకుండా చూసేందుకు జలమండలి చేపట్టిన ‘సాగర మథనం’కొనసాగుతోంది. ఈ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తికానుంది. నగర తాగునీటి అవసరాలకు ప్రస్తుతం నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్(పుట్టంగండి) నుంచి నిత్యం కృష్ణా మూడు దశల ప్రాజెక్టు ద్వారా 270 మిలియన్ గ్యాలన్ల జలాలను అక్కంపల్లి జలాశయానికి తరలించి అక్కడి నుంచి నగరానికి పంపింగ్ చేస్తున్నారు. సాగర్‌లో గరిష్ట నీటిమట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం నీటిమట్టం 500.300 అడుగులకు చేరింది. దీంతో పుట్టంగండి వద్ద ఇప్పటికే నీటితో ఉన్న కాల్వను 485 అడుగుల లోతు వరకు డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తవ్వి.. అత్యంత లోతు నుంచి రెండో దశ అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని సేకరించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రుతుపవనాలు ఆలస్యమైనా మరో 45 రోజుల వరకూ నగరానికి తరలిస్తున్న కృష్ణా జలాలకు కోత పడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అక్కంపల్లిలో అరకొర నిల్వలే.. ప్రస్తుతం పుట్టంగండి నుంచి రోజువారీగా జలమండలి 700 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి నగర తాగునీటి అవసరాలకు పంపింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ జలాశయంలో నీటినిల్వలు 0.193 మీటర్లకు చేరుకున్నాయి. ఈ నిల్వలు రెండు రోజుల నగర తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటడం.. సాగర్‌లో నీటిమట్టాలు రోజురోజుకూ పడిపోతుండటం, ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాతి నేలను తొలిచేందుకు వ్యయప్రయాసలు.. పుట్టంగండి వద్ద అత్యవసర పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసిన చోటు నుంచి కిలోమీటర్ పొడవునా నీటిలో డ్రెడ్జింగ్ ప్రక్రియను ధర్తీ ఇన్ఫ్రా అనే సంస్థ అనేక వ్యయప్రయాసలకోర్చి చేపడుతోంది. ఈ కాల్వను 19 మీటర్ల వెడల్పు, 15 అడుగుల లోతున నీటిలోనే ఏర్పాటు చేస్తున్నారు. నీటి అడుగున రాతినేల కావడం, బ్లాస్టింగ్‌కు అనుమతి లేకపోవడంతో భారీ హిటాచీ యంత్రాలతో కాల్వను తవ్వుతున్నారు. ఈ క్రమంలో యంత్రాల దంతాలు, హోస్పైప్లు దెబ్బతింటున్నాయని పనులు చేపట్టిన సంస్థ చెబుతోంది. అయినప్పటికీ పనులను నిరాటంకంగా సాగిస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సాగర్ గర్భంలో రాతినేలను తొలిచి కాల్వను తవ్వేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నామన్నారు. గ్రేటర్‌కు కృష్ణా.. గోదావరి జలాలే ఆధారం.. జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిసరఫరా నిలిచిపోవడం, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి సగానికిపైగా నీటిసరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుతం నగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ఎల్లంపల్లి(గోదావరి) నుంచి 114 మిలియన్ గ్యాలన్లు, అక్కంపల్లి(కృష్ణా) నుంచి 270 మిలియన్ గ్యాలన్లు, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 48 ఎంజీడీలు మొత్తంగా రోజుకు 432 ఎంజీడీల నీటిని గ్రేటర్ తాగునీటి అవసరాలకు జలమండలి తరలిస్తోంది. తాగునీటికి ఢోకా లేకుండా పటిష్ట చర్యలు గ్రేటర్ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. డ్రెడ్జింగ్ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి కృష్ణా జలాలకు కొరత లేకుండా చూస్తాం. రుతుపవనాలు ఆలస్యమైనా 9.65 లక్షల నల్లాలకు కొరత లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. పట్టణ మిషన్ భగీరథ పథకంతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1,900 కోట్ల హడ్కో నిధులతో వంద రోజుల రికార్డు సమయంలో 1,200 కి.మీ పైపులైన్లు ఏర్పాటు చేసి సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల దాహార్తిని దూరం చేశాం. ఔటర్లోపలున్న 183 పంచాయతీలు, 7 నగర పాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.628 కోట్లతో రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులను మొదలుపెట్టాం. ఏడాదిలో ఈ ప్రాంతాల దాహార్తిని కూడా దూరం చేస్తాం. – ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ నగర దాహార్తిని తీరుస్తోన్న జలాశయాల్లో శుక్రవారం నాటికి నీటిమట్టాలిలా ఉన్నాయి.. (అడుగుల్లో..) జలాశయం గరిష్టమట్టం ప్రస్తుతమట్టం నాగార్జునసాగర్ 590 500.300 ఎల్లంపల్లి(గోదావరి) 485.560 473.060 సింగూరు 1,717.932 1,708.712 మంజీరా 1,651.750 1,647.400 -
రూ 1.50 కోట్లు కడలి పాలు
- అమీనాబాద్ తీరంలో డ్రెడ్జింగ్ పనుల తీరు - నెల తిరక్కుండానే మూసుకుపోయిన ఉప్పుటేరు - బోట్లు ధ్వంసమవుతున్నాయని మత్స్యకారుల ఆందోళన పిఠాపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారయింది ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ పనులు. ఇసుక మేటలు వేసి బోట్లు వెళ్లడానికి వీలు లేదని దాన్ని లోతు చేయడానికి చేసిన పనులు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయని మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రంలో చేపల వేటకోసం వెళ్లే బోట్లు ఒడ్డుకు రావడానికి ఉప్పుటేరు అనువుగా లేకపోవడంతో లోతు చేసే పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు వెచ్చించిన ఈ పనుల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు సాగరతీరంలో మినీ హార్భర్ కోసం కేటాయించిన ప్రాంతంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన వందలాది మత్స్యకార బోట్లు నిలుపుతుంటారు. ఇక్కడ నిత్యం చేపల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కాకినాడ హార్భర్‌లో ఇతర బోట్లను నిలపడానికి నిరాకరించిన నాటి నుంచి సుమారు పదేళ్లుగా రెండు మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు ఇక్కడే నిలుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఉప్పుటేరు సాగరతీరానికి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో బోట్లు ఒడ్డుకు చేరడానికి అనువుగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో మినీ హార్బర్ నిర్మాణానికి గత పదేళ్ల కిందటే 50 ఎకరాల భూమిని సేకరించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ప్రభుత్వాలు మారడంతో ఇది నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం వ్యయం రూ. 200 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో తమ బోట్లు ఒడ్డుకు తీసుకువచ్చే సమయంలో ఉప్పుటేరు మూసుకుపోవడం వల్ల బోట్లు పాడైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఇలా ప్రారంభం... దీంతో ఉప్పుటేరులో మట్టిని తొలగించి లోతు చేయడానికి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద నిధులు రూ. 1.50 కోట్లు వ్యయంతో డ్రెడ్జింగ్ పనులు గత మార్చి 17వ తేదీన ప్రారంభించారు. ఓషన్ స్పార్కల్ లిమిటెడ్ కంపెనీ ఈ పనులను నిర్వహించగా ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. డ్రెడ్జింగ్ యంత్రంతో ఉప్పుటేరులో ఉన్న ఇసుక మట్టిని తీసి పక్కనే వేశారు. అయితే కేవలం ఇసుకను తీయడం తప్ప గట్లు పటిష్టం చేయకపోవడంతో ఇటీవల సముద్ర ఉథృతికి డ్రెడ్జింగ్ చేసిన ప్రాంతమంతా తిరిగి ఇసుకతో మూసుకు పోవడంతోపాటు గట్లు అండలు జారి ఉప్పుటేరులో కలిసిపోవడంతో బోట్లు బయటకు తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన పది రోజులు కూడా వినియోగించకుండానే నిరుపయోగంగా మారడంతో పనులు తూతూమంత్రంగా సాగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మట్టితో ఉప్పుటేరు మూసుకు పోవడంతో తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి బోట్లు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే మూసుకు పోయింది బోట్లు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తే ఇసుక తొలగించామన్నారు. కానీ వెంటనే మూసుకు పోయింది ఇప్పుడు బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు చేశారో తెలియడం లేదు. ఏకంగా రూ.1.50 కోట్లు వృథాగా పోయినట్లే వంకా నాగేశ్వరరావు , మత్స్యకారుడు, అమీనాబాద్. బోట్లు దెబ్బతింటున్నాయి.. డ్రెడ్జింగ్ చేశామని చెబుతున్న ప్రాంతంలో బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. వేట నిషేధం అమలులో ఉండగా బోట్లు మరమ్మతుల కోసం బయటకు తీద్దామంటే కదిలే పరిస్థితి లేదు. గతంలోనే బాగుండేది ఇప్పుడు ఉప్పుటేరు పూర్తిగా మూసుఉపోయి బోట్ల ఫ్యాన్లు విరిగిపోతున్నాయి. బోట్లు దెబ్బతింటున్నాయి. కంబాల జగన్నాధం,, మత్స్యకారుడు, అమీనాబాద్ -
సఖినేటిపల్లి రేవును సందర్శించిన డ్రెడ్జింగ్ శాఖ అధికారులు
సఖినేటిపల్లి : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రాజేష్ త్రిపాఠి, కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సఖినేటిపల్లిరేవును బుధవారం సందర్శించారు. అంతర్వేదికరలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం దాదాపు ఖరారైన నేపద్యంలో పశ్చిమగోదావరి జిల్లా నుంచి డ్రెడ్జింగ్‌కు సంబంధించిన భారీ వాహనాలు అంతర్వేదికరకు చేరుకోవడానికి వీలుగా మెరుగైన రహదారి నిమిత్తం ఈ పరిశీలన వారు చేశారు. ఇందుకు గోదావరి నదిపై వంతెన నిర్మాణ ప్రతిపాదనకు వారు తగిన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అంతర్వేది శ్రీలక్ష్మినృసింహస్వామిని వారు దర్శించుకున్నారు. ఆలయంలోని కార్యాలయంలో డ్రెడ్జింగ్ హార్బర్‌కు గతంలో కేటాయించిన స్థలం మ్యాప్‌ను సర్వే నంబర్లు ఆధారంగా తహసీల్దారు సుధాకర్‌రాజు, సర్వేయర్ రాజుతో డ్రెడ్జింగ్ శాఖ ఉన్నతాధికారులు త్రిపాఠి, శాస్త్రి చర్చించారు. కేటాయించిన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హార్బర్‌కు మొత్తం 238 ఎకరాలు కేటాయించినట్లు తహసీల్దారు చెప్పారు. ఇదిలా ఉండగా తొలివిడతగా హార్బర్ నిమిత్తం పిలిచిన రూ.838 కోట్ల టెండరు ఖరారు దశకు చేరుకున్నట్లు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు. దీనికి జనవరిలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ధవళేశ్వరం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు, సర్పంచ్‌లు పోతురాజు నాగేంద్రకుమార్, చొప్పల చిట్టిబాబు, వీఆర్వో పోతురాజు బాబు, ప్రముఖులు ఉన్నారు -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
నంది విగ్రహం తొలగించిన దుండగులు వివరాలు సేకరించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి యాచారం: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపి నంది విగ్రహం తొలగించారు. ఈ సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామ ప్రారంభంలోనే కుక్కరూపంలోని నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం కింద గుప్త నిధులు ఉండొచ్చనే ఆశతో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహన్ని ఓ పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. దుండగులు రెండు అడుగుల లోతులో ఉన్న విలువైన నిధులను అపహరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి తవ్వకాల జరిపిన తీరును పరిశీలించారు. మూడేళ్ల క్రితం ఓసారి గుర్తు తెలియని వ్యక్తులు ఈ నంది విగ్రహం వద్ద తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, సర్పంచ్ రాజునాయక్ తదితరులు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. విచారణ జరుపుతున్నామని సీఐ మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఇంకా డ్రెడ్జింగ్ ఎందుకో?
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవి నాటికి హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనకు... ప్రస్తుతం నెక్లెస్ రోడ్డులోని నాలా ముఖద్వారాల వద్ద పూడికతీత పనులకు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. సాగర్‌ను సుందర జలాశయంగా మార్చేందుకు పకడ్బందీ బృహత్తర ప్రణాళికకు ఒక వైపు ప్రభుత్వం తెరతీస్తుంటే... మరో వైపు హెచ్ఎండీఏ అరకొరగా పూడికతీత పనులు నిర్వహిస్తుండటంలో అర్థం లేదన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్న సాకుతో హెచ్ఎండీఏ అధికారులు సాగర్‌లో డ్రెడ్జింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పూడికతీత పనులకు సుమారు రూ.19 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించిన అధికారులు మరో రూ.10కోట్ల వరకు ప్రజాధనం వృథాకు సన్నాహాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాగర్‌ను కాలుష్య కాసారంలా మారుస్తున్న పికెట్ నాలా, బంజారా నాలా, బల్కాపూర్ నాలా, కూకట్పల్లి నాలాల ద్వారా నిత్యం 380-420ఎంఎల్డీల మురుగు నీరు కలుస్తోంది. వీటి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు రెండేళ్ల క్రితం రూ.43 కోట్ల అంచనాలతో హెచ్ఎండీఏ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది. కూకట్పల్లి తప్ప మిగతా 3 నాలాల వద్ద సుమారు 7 లక్షల క్యూ.మీ. పూడిక తొలగించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు 1.90 వేల క్యూ.మీ. మాత్రమే తొలగించగలిగారు. సాగర్ నుంచి తీసిన వ్యర్థాలను సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్ యార్డుకు పైపుల ద్వారా తరలించి... అక్కడి పాండ్స్‌లో ఎండబెట్టాక లారీల ద్వారా గాజులరామారంలోని క్యారీపిట్స్లోకి తరలిస్తున్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పూడిక తీత పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా సాగర్‌ను ఖాళీ చేసి పూడికను తొలగించాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో డ్రెడ్జింగ్‌ను నిలిపేయాల్సి ఉంది. దీనితో తమకు సంబంధం లేదన్నట్టుగా హెచ్ఎండీఏ పనులు కొనసాగిస్తోంది. ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినందున ...కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని రుణదాత జైకాకు తెలిపి...పూడిక తీతను నిలిపివేయకపోతే రూ.10 కోట్ల వరకూవృథా ఖాయమని కొందరు అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం సాగర్‌నే ప్రక్షాళన చేస్తున్నప్పుడు... ఇక నాలాల వద్ద పూడికతీత పేరుతో నిధులు వృథా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారుల స్వప్రయోజనాలకే డ్రెడ్జింగ్ పనులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.