సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవి నాటికి హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనకు... ప్రస్తుతం నెక్లెస్ రోడ్డులోని నాలా ముఖద్వారాల వద్ద పూడికతీత పనులకు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. సాగర్‌ను సుందర జలాశయంగా మార్చేందుకు పకడ్బందీ బృహత్తర ప్రణాళికకు ఒక వైపు ప్రభుత్వం తెరతీస్తుంటే... మరో వైపు హెచ్‌ఎండీఏ అరకొరగా పూడికతీత పనులు నిర్వహిస్తుండటంలో అర్థం లేదన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్న సాకుతో హెచ్‌ఎండీఏ అధికారులు సాగర్‌లో డ్రెడ్జింగ్‌ను కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే పూడికతీత పనులకు సుమారు రూ.19 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించిన అధికారులు మరో రూ.10కోట్ల వరకు ప్రజాధనం వృథాకు సన్నాహాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాగర్‌ను కాలుష్య కాసారంలా మారుస్తున్న పికెట్ నాలా, బంజారా నాలా, బల్కాపూర్ నాలా, కూకట్‌పల్లి నాలాల ద్వారా నిత్యం 380-420ఎంఎల్‌డీల మురుగు నీరు కలుస్తోంది. వీటి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు రెండేళ్ల క్రితం రూ.43 కోట్ల అంచనాలతో హెచ్‌ఎండీఏ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది.
కూకట్‌పల్లి తప్ప మిగతా 3 నాలాల వద్ద సుమారు 7 లక్షల క్యూ.మీ. పూడిక తొలగించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు 1.90 వేల క్యూ.మీ. మాత్రమే తొలగించగలిగారు. సాగర్ నుంచి తీసిన వ్యర్థాలను సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్ యార్డుకు పైపుల ద్వారా తరలించి... అక్కడి పాండ్స్‌లో ఎండబెట్టాక లారీల ద్వారా గాజులరామారంలోని క్యారీపిట్స్‌లోకి తరలిస్తున్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పూడిక తీత పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా సాగర్‌ను ఖాళీ చేసి పూడికను తొలగించాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో డ్రెడ్జింగ్‌ను నిలిపేయాల్సి ఉంది. దీనితో తమకు సంబంధం లేదన్నట్టుగా హెచ్‌ఎండీఏ పనులు కొనసాగిస్తోంది.
ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినందున ...కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని రుణదాత జైకాకు తెలిపి...పూడిక తీతను నిలిపివేయకపోతే రూ.10 కోట్ల వరకూవృథా ఖాయమని కొందరు అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం సాగర్‌నే ప్రక్షాళన చేస్తున్నప్పుడు... ఇక నాలాల వద్ద పూడికతీత పేరుతో నిధులు వృథా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారుల స్వప్రయోజనాలకే డ్రెడ్జింగ్ పనులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంకా డ్రెడ్జింగ్ ఎందుకో?
Published Tue, Nov 25 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement