రూ 1.50 కోట్లు కడలి పాలు | 1.50 crore dredging works | Sakshi
Sakshi News home page

రూ 1.50 కోట్లు కడలి పాలు

Published Mon, May 22 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

రూ 1.50 కోట్లు కడలి పాలు

రూ 1.50 కోట్లు కడలి పాలు

- అమీనాబాద్‌ తీరంలో డ్రెడ్జింగ్‌ పనుల తీరు
- నెల తిరక్కుండానే మూసుకుపోయిన ఉప్పుటేరు
- బోట్లు ధ్వంసమవుతున్నాయని మత్స్యకారుల ఆందోళన
పిఠాపురం:  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారయింది ఉప్పుటేరులో డ్రెడ్జింగ్‌ పనులు. ఇసుక మేటలు వేసి బోట్లు వెళ్లడానికి వీలు లేదని దాన్ని లోతు చేయడానికి చేసిన పనులు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయని మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రంలో చేపల వేటకోసం వెళ్లే బోట్లు ఒడ్డుకు రావడానికి ఉప్పుటేరు అనువుగా లేకపోవడంతో లోతు చేసే పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు వెచ్చించిన ఈ పనుల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్‌ శివారు సాగరతీరంలో మినీ హార్భర్‌ కోసం కేటాయించిన ప్రాంతంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన వందలాది మత్స్యకార బోట్లు నిలుపుతుంటారు. ఇక్కడ నిత్యం చేపల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కాకినాడ హార్భర్‌లో ఇతర బోట్లను నిలపడానికి నిరాకరించిన నాటి నుంచి సుమారు పదేళ్లుగా రెండు మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు ఇక్కడే నిలుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఉప్పుటేరు సాగరతీరానికి మెయిన్‌ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో బోట్లు ఒడ్డుకు చేరడానికి అనువుగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో మినీ హార్బర్‌ నిర్మాణానికి గత పదేళ్ల కిందటే 50 ఎకరాల భూమిని సేకరించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ప్రభుత్వాలు మారడంతో ఇది నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం వ్యయం రూ. 200 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో తమ బోట్లు ఒడ్డుకు తీసుకువచ్చే సమయంలో ఉప్పుటేరు మూసుకుపోవడం వల్ల బోట్లు పాడైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 
సమస్య ఇలా ప్రారంభం...
దీంతో ఉప్పుటేరులో మట్టిని తొలగించి లోతు చేయడానికి కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద నిధులు రూ. 1.50 కోట్లు వ్యయంతో డ్రెడ్జింగ్‌ పనులు గత మార్చి 17వ తేదీన ప్రారంభించారు. ఓషన్‌ స్పార్కల్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పనులను నిర్వహించగా ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ప్రారంభించారు. డ్రెడ్జింగ్‌ యంత్రంతో ఉప్పుటేరులో ఉన్న ఇసుక మట్టిని తీసి పక్కనే వేశారు. అయితే కేవలం ఇసుకను తీయడం తప్ప గట్లు పటిష్టం చేయకపోవడంతో ఇటీవల సముద్ర ఉథృతికి డ్రెడ్జింగ్‌ చేసిన ప్రాంతమంతా తిరిగి ఇసుకతో మూసుకు పోవడంతోపాటు గట్లు అండలు జారి ఉప్పుటేరులో కలిసిపోవడంతో బోట్లు బయటకు తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన పది రోజులు కూడా వినియోగించకుండానే నిరుపయోగంగా మారడంతో పనులు తూతూమంత్రంగా సాగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మట్టితో ఉప్పుటేరు మూసుకు పోవడంతో తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి బోట్లు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. 
వెంటనే మూసుకు పోయింది
బోట్లు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తే ఇసుక తొలగించామన్నారు. కానీ వెంటనే మూసుకు పోయింది ఇప్పుడు బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు చేశారో తెలియడం లేదు. ఏకంగా రూ.1.50 కోట్లు వృథాగా పోయినట్లే
వంకా నాగేశ్వరరావు , మత్స్యకారుడు, అమీనాబాద్‌.
బోట్లు దెబ్బతింటున్నాయి..
డ్రెడ్జింగ్‌ చేశామని చెబుతున్న ప్రాంతంలో బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. వేట నిషేధం అమలులో ఉండగా బోట్లు మరమ్మతుల కోసం బయటకు తీద్దామంటే కదిలే పరిస్థితి లేదు. గతంలోనే బాగుండేది ఇప్పుడు ఉప్పుటేరు పూర్తిగా మూసుఉపోయి బోట్ల ఫ్యాన్లు విరిగిపోతున్నాయి. బోట్లు దెబ్బతింటున్నాయి.
కంబాల జగన్నాధం,, మత్స్యకారుడు, అమీనాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement