![Record of Devotees in Mahakumbh number of People Taking dip Crosses 50 Crores](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/record-main.jpg.webp?itok=nBrFuvST)
ప్రయాగ్‌రాజ్: యూపీలోని తీర్థరాజం ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో ఇప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసినవారి సంఖ్య 50 కోట్లు దాటింది. గతంలో కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.
అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ (జనాభా 34,20,34,432), ఇండోనేషియా (జనాభా 28,35,87,097), పాకిస్తాన్ (జనాభా 25,70,47,044), నైజీరియా (జనాభా 24,27,94,751), బ్రెజిల్ (జనాభా 22,13,59,387), బంగ్లాదేశ్ (జనాభా 17,01,83,916), రష్యా (జనాభా 14,01,34,279), మెక్సికో (జనాభా 13,17,41,347)లలోని జనాభాను దాటినంతమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.
మహా కుంభమేళకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించిన రీతిలో కుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ప్రారంభంలో 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్ర సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 55 నుంచి 60 కోట్లు దాటవచ్చనే కొత్త అంచనాలు నెలకొన్నాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/12_33.jpg)
ఇప్పటివరకు స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది భక్తులు స్నానం చేయగా, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్లకు పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.
ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా
Comments
Please login to add a commentAdd a comment