అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకీ వంటి బ్రాండ్ల ప్రీమియం మోటార్ సైకిళ్లపై సుంకాలను 5-20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.
దిగుమతి సుంకాల తగ్గింపు అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై డిమాండ్ స్థిరంగా కొనసాగించేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ టారిఫ్ విధానాలను, హార్లే డేవిడ్సన్ దిగుమతులకు సంబంధించి విమర్శించారు. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని పదేపదే పిలుపునిచ్చారు.
కొత్త విధానం ప్రకారం 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై గతంలో ఉన్న 50 శాతం నుంచి 40 శాతానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతోపాటు సెమీ నాక్ డౌన్ (ఎస్‌కేడీ-తయారీదారు ప్లాంట్‌లో పాక్షికంగా అసెంబుల్ చేసిన వాహనం(లైట్ మోటార్ సైకిళ్లు లేదా కార్లు)), పూర్తిగా నాక్ డౌన్ (సీకేడీ-తయారీదారు ప్లాంట్ వద్దే పూర్తిగా విడి భాగాలుగా చేయడం) యూనిట్లపై సుంకాలను కూడా తగ్గించారు.
ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
ఈ చర్య భారతీయ వినియోగదారులకు ప్రీమియం మోటార్ సైకిళ్లను మరింత చౌకగా మారుస్తుందని, ఈ హై-ఎండ్ బ్రాండ్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఫిర్యాదులను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారతదేశం సుముఖంగా ఉందని ఈ నిర్ణయం సూచిస్తుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగం.
Comments
Please login to add a commentAdd a comment