Nandi idol
-
వజ్రాలు ఉన్నాయనే నంది విగ్రహం ధ్వంసం..
విజయవాడ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కాపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలోని నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. గతేడాది సెప్టెంబరు 17న విశ్వేశ్వర ఆలయంలో జరిగిన ఘటనలో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వజ్రాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నిందితులు నంది విగ్రహ చెవులను విరగొట్టారని ఆయన వెల్లడించారు. నంది విగ్రహం నడుము భాగంలో హంస ఉంటే వజ్రాలు ఉంటాయని నిందితులు భావించారని, ఈ విషయంపై పూజారి యుగంధర్ శర్మను వివరాలు అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారని ఎస్పీ తెలిపారు. విగ్రహ ధ్వంసానికి ముందు నిందితులు పలు మార్లు రెక్కీ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. గుప్త నిధుల వేటలోనే విగ్రహాన్ని పగలగొట్టినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. నిందితులపై 447, 427, 295, 295A,153, IPC & 20 of Indian treasure trove act 1878 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి Ap 24 AP 8999 ఇన్నోవా కార్, Ap 16 DQ 4243 స్విఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. విగ్రహాన్ని పగలగొట్టడానికి వినియోగించిన సుత్తి ,గ్యాస్ కట్టర్లను సీస్ చేశామని పేర్కొన్నారు. గుప్తనిధుల వేటలో నిందితులు రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో రెక్కీ నిర్వహించినట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన ఫోటోలను నిందితుల సెల్ ఫోన్లలో గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. -
కెమెరా కంటికి చిక్కిన టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి, శ్రీకాకుళం: రాజకీయ ఉనికి కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోందన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలిగిస్తూ అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ తమ్ముళ్లు. తొలగించిన విగ్రహాన్ని సమీపంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న సిమెంట్ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వారి బండారం బయటపడింది. ఈనెల 14న సంతబొమ్మాళిలోని అతి పురాతన పాళేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారడంతో గ్రామస్తుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా విషయం వెలుగు చూసింది. ఈ విషయంపై విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు మాట్లాడుతూ.. సంతబొమ్మాళి మండలం పాళేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ తరలింపు చట్ట విరుద్ధమని, విగ్రహం తరలింపు వెనుక దురుద్దేశం కనిపించిందని పేర్కొన్నారు. ముందురోజు పోలీసులు వివరాలు అడిగినా చెప్పని ఆలయ వర్గాలు.. గుట్టుగా రోడ్డు మధ్యలో విగ్రహాన్ని పెట్టాలని యత్నించారని తెలిపారు. ఈ కేసులో వీఆర్వో 22 మంది పై ఫిర్యాదు చేయగా, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పేర్కొన్నారు. వీరిలో ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు నలుగురు ఉన్నారని ఆయన తెలిపారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
నంది విగ్రహం తొలగించిన దుండగులు వివరాలు సేకరించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి యాచారం: గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపి నంది విగ్రహం తొలగించారు. ఈ సంఘటన మండల పరిధిలోని నందివనపర్తిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామ ప్రారంభంలోనే కుక్కరూపంలోని నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం కింద గుప్త నిధులు ఉండొచ్చనే ఆశతో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహన్ని ఓ పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. దుండగులు రెండు అడుగుల లోతులో ఉన్న విలువైన నిధులను అపహరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ మదన్‌మోహన్‌రెడ్డి తవ్వకాల జరిపిన తీరును పరిశీలించారు. మూడేళ్ల క్రితం ఓసారి గుర్తు తెలియని వ్యక్తులు ఈ నంది విగ్రహం వద్ద తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, సర్పంచ్ రాజునాయక్ తదితరులు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. విచారణ జరుపుతున్నామని సీఐ మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. -
చోళుల కాలంనాటి నంది విగ్రహం చోరీ
గుంటూరు : నల్లరాయితో చేసిన అతిపురాతనమైన నంది విగ్రాహాన్ని దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలోని శ్రీబాలత్రిపుర సుందరి సమేత శంకరస్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకుంది. దాంతో భక్తుల తాకిడి చాలా వరకు తగ్గింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆలయ ఆవరణలో ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని అపహరించుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన నంది విగ్రహాం నాలుగో శతాబ్దం నాటిదని స్థానికులు తెలిపారు. ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని స్థానికులకు పోలీసులు వెల్లడించారు.