జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment