
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు అందాయి. అయితే.. ఒక బోరుకు మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన వాల్టా చట్టంలో ఉంది. దీంతో సమస్య పరిష్కారానికి పథకం అర్హత నిబంధనలలో సవరణలు సూచిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపగా.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అర్హత నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరణలతో కూడిన నిబంధన ప్రకారం.. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ పథకంలో ఉచిత బోరు మంజూరైతే.. ఆ కుటుంబంలో మరొకరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారని పేర్కొన్నారు.
సవరించిన నిబంధనలివీ..
► ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు
► ఈ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతులకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేనిపక్షంలో చుట్టుపక్కల రైతులతో గ్రూపుగా ఏర్పడి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► ఈ పథకంలో ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్ తర్వాత అది ఫెయిలై.. అక్కడ మరో బోరు వేయాలంటే మరోసారి హైడ్రో జియాలజికల్ సర్వే జరిపించాలి. ఎంపీడీవో, డ్వామా ఏపీడీ పర్యవేక్షణలో రెండో బోరు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది.
► వైఎస్సార్ జలకళ పథకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు.