ఏపీకి రెండు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డులు | Two Skoch Awards For Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి రెండు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డులు

Nov 24 2022 4:50 AM | Updated on Nov 24 2022 1:01 PM

Two Skoch Awards For Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్‌ గోల్డ్, మరో నాలుగు స్కోచ్‌ సిల్వర్‌ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్‌ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్‌ సంస్థ అవార్డులను ప్రకటించింది.

మొత్తంగా 6 అవార్డులు
మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని çసద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్‌ సంస్థ గోల్డ్‌ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.35 వేల కోట్లను రుణాలుగా అందజేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పొదుపు సంఘాలు సగటున రూ.5.31 లక్షల చొప్పున బ్యాంకు రుణాలు పొందాయి. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తోంది.

ఇప్పటికే రూ. 12,758 కోట్లను వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందజేసింది. సకాలంలో రుణాలు చెల్లించే వారికి  వైఎ స్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వం తిరిగి ఆయా పొదుపు సంఘాలకు చెల్లిస్తోంది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు బ్యాం కుల నుంచి తీసుకుంటున్న రుణాలను 99.5 శాతం మేర సకాలంలో చెల్లిస్తూ రికార్డు సాధించారు. 

‘స్త్రీ నిధి’కి మరో గోల్డ్‌ అవార్డు
► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అనుబం« దంగా పనిచేస్తున్న ‘స్త్రీ నిధి’ సంస్థ బ్యాంకులిచ్చే రుణాలకు తోడు అత్యంత సులభ విధానంలో అదనంగా రుణాలు అందజేస్తుండటంతో స్కోచ్‌ సంస్థ స్త్రీ నిధిని గోల్డ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. 

► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొదుపు సంఘాల విజయ గాథలను ‘మహిళా నవోదయం’ పేరిట ప్రతినెలా ప్రత్యేక మాసపత్రిక రూపంలో ప్రచురిస్తూ సభ్యులందరికీ తెలియజేస్తున్న ఆ జిల్లా డీఆర్‌డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్‌ అవార్డు దక్కింది.

► ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్దఎత్తున నాటు కోళ్ల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నందుకు ఆ జిల్లా డీఆర్‌డీఏకు మరో సిల్వర్, పాడి గేదెల పెంపకం ద్వారా ఆధిక ఆదాయం సాధించేలా చేస్తున్న చిత్తూరు జిల్లా డీఆర్‌డీఏకు మరో సిల్వర్, జిల్లాలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నందుకు చిత్తూరు డీఆర్‌డీఏకు మరో సిల్వర్‌ అవార్డు దక్కాయి.

ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే..
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ ప్రోత్సాహకాల కారణంగా మహిళలు కీలకంగా ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించుకుంటున్నారు. ప్రభుత్వం అందజేసే అర్థిక సహాయానికి తోడు బ్యాంకుల నుంచి అందే రుణ మొత్తాలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

వ్యవసాయం మాత్రమే తెలిసిన వారు పెద్ద సంఖ్యలో పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారు. ఇలా లాభదాయక కార్యకలాపాలు సాగిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అందజేసే ప్రోత్సహకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సైకిల్‌ చాలా వేగంగా తిరుగుతోంది. ఇలాంటి విజయాలను నమోదు చేయడంతో సెర్ప్‌ కార్యక్రమాలకు ఈ ఏడాది ఆరు అవార్డులు దక్కాయి. 
    – ఇంతియాజ్‌ అహ్మద్, సీఈవో, సెర్ప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement