savings associations
-
పదో తేదీ వస్తోంది.. కిస్తీ కట్టండమ్మా!
పటమట(విజయవాడ తూర్పు): మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది బుడమేరు వరద ముంపు ప్రాంతంలోని స్వయం సహాయ సంఘాల సభ్యుల పరిస్థితి. బుడమేరు వరద వల్ల ఇళ్లు మునిగి సర్వం కోల్పోయి వారం రోజుల నుంచి కట్టుబట్టలతో అల్లాడుతున్నవారిని ఆదుకోవాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ సాధికారిక విభాగం అధికారులు... మానవత్వాన్ని మరిచి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరి బురదను శుభ్రం చేసుకుంటున్న వారి వద్దకు సిబ్బందిని పంపి ‘పదో తేదీ వస్తోంది పొదుపు రుణం కిస్తీ కట్టండి... లేకపోతే వడ్డీ పెరుగుతుంది.తర్వాత ఇబ్బందిపడతారు...’ అని హెచ్చరించడంపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘అనేక సంవత్సరాలుగా పని చేసి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్లన్నీ నాశనమైపోయాయి. ఇప్పుడు తినడానికి తిండికి కూడా లేకుండా అల్లాడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. దాతలు ఇచ్చే పులిహోర పొట్లాలు తిని బతుకుతున్నాం. బురదనీటిలోనే బతుకీడుస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బుక్ కీపర్లు వచ్చి కిస్తీ కట్టాలని చెప్పడం దారుణం. వారికి మనసెలా వచి్చందో అర్థం కావడం లేదు..’ అంటూ అజిత్‌సింగ్‌నగర్ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు మండిపడుతున్నారు. వెంటనే పొదుపు రుణాల చెల్లింపులను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు. 1.50లక్షల మందిపై ప్రభావం⇒ విజయవాడలోని మూడు సర్కిళ్ల పరిధిలో సుమారు 12వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ⇒ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సర్కిల్–1, సర్కిల్–2 పరిధిలోని విద్యాధరపురం, భవానీపురం, చిట్టినగర్, పాత ఆర్‌ఆర్‌పేట, కొత్త ఆర్‌ఆర్‌పేట, కొత్తపేట, అజిత్‌సింగ్‌నగర్, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరినగర్, ఇందిరానాయక్‌నగర్, పాయకాపురం, పైపులరోడ్డు, వాంబేకాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 8వేల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 1.50లక్షల మంది సభ్యులు పొదుపు రుణాలు పొందారు. ⇒ఒక్కో సంఘం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణాలు పొందాయి. ఆయా సంఘాల సభ్యులు రెండు నెలల నుంచి 15 నెలల వరకు వాయిదాలు చెల్లించారు. ⇒ఇప్పటి వరకు తాము తీసుకున్న రుణాలతో చిరువ్యాపారాలు, చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ప్రతి నెల పదో తేదీలోపు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కిస్తీలను పక్కాగా చెల్లిస్తున్నారు. ⇒ప్రస్తుతం ఆకస్మిక వరద వల్ల పనిలేక, ఉన్న వస్తువులన్నీ పాడైపోయి అల్లాడుతున్నారు. వీరు తేరుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. మేం ఇప్పుడు కట్టలేం మా పరిస్థితి చూశారుగా... ఇళ్లన్నీ మునిగిపోయాయి. సామాన్లు కొట్టుకుపోయాయి. ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు వచ్చి పొదుపు రుణం కిస్తీ చెల్లించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం కట్టలేం... కట్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి. మాలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి అప్పు కట్టమనడం ఎంతవరకు న్యాయం? మేం మళ్లీ మా పాత రోజువారీ జీవితానికి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. అప్పటి వరకు మేం రుణాలు కట్టలేం. ప్రభుత్వం మాకు కొత్త రుణాలు ఇవ్వాలి. ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – మీనాక్షి, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ బాధితులనే విరాళాలు అడుగుతారా? ఇప్పటి వరకు వాహనాలు, ఎల్రక్టానిక్ వస్తువుల బీమాపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పొదుపు సంఘాల పరిస్థితిని అసలు పట్టించుకోవడం లేదు. పైగా కిస్తీలు కట్టండి... పొదుపు సంఘాలు కూడా విరాళాలు ఇవ్వండి... అని చెబుతున్నారు. మేమే బాధితులమైతే మేం ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలా..? ఇదెక్కడి విడ్డూరం? మాపై ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా రుణాలు మాఫీ చేయాలి. సున్నా వడ్డీకి కొత్త రుణం అందించాలి. – సునీత, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ -
నాడు పేద మహిళలు.. నేడు లక్షాధికారులు 'ఆమె' బలోపేతం
ఈమె పేరు నగీనా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి సొంతూరు. శ్రీవాణి స్వయం సహాయక పొదుపు సంఘం సభ్యురాలు. అంతకు ముందు కుటుంబ పోషణ ఎలా అని మథనపడ్డ ఈమె ఐదు నెలల క్రితం గ్రామంలోని రైలుగేట్ వద్ద ఫ్యాన్సీ, చెప్పుల దుకాణం ప్రారంభించింది. ప్రస్తుతం ఇంటి ఖర్చులు పోను నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించే చిట్టీలో సభ్యురాలిగా చేరింది. (కృష్ణా జిల్లా బాపులపాడు, వీరవల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి మేడికొండ కోటిరెడ్డి) : రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్థిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. ఇంకొక 31,04,314 మంది పేదింటి ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల చొప్పున ఏటా రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే పెరిగింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై ఒక సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులతో పాటు గత నాలుగేళ్ల కాలంలో పొదుపు సంఘాల మహిళ ఆదాయాలు పెరిగిన తీరును సేకరించింది. పొదుపు కార్యక్రమాలలో క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే మండల కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో అన్ని చోట్ల గ్రామ సమాఖ్య సహాయకులు – వీవోఏల ద్వారా గత 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల ఆదాయ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 89.29 లక్షల పొదుపు సంఘాల మహిళలకు గాను 84.90 లక్షల మంది వివరాలు సేకరించగా, అందులో 54 శాతం మంది ఆదాయం ఏటా రూ.60 వేలకు పైగా పెరిగింది. మరో 39 శాతం మంది ఆదాయం కూడా రూ.రెండు వేల నుంచి ఐదు వేల మధ్య పెరిగినట్టు తేలింది. ఆచరణలో మహిళా సాధికారత ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత అన్నది కేవలం ఒక నినాదంగా కాకుండా, ఒక లక్ష్యంగా అమలుకు పూనుకుంది. దీంతో పేదల ఇళ్లలో సిరులు కనిపిస్తున్నాయి. మహిళా సాధికారిత సాధన కోసం ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటిస్తూ క్రమతప్పకుండా వాటిని అమలు చేస్తూ వస్తోంది. ► ప్రత్యేకించి రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది మహిళలకు సంబంధించి 7.96 లక్షల పొదుపు సంఘాల పేరిట గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఉన్న రూ.25,571 కోట్ల అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆయా మహిళలకు చెల్లించే కార్యక్రమాన్ని చేపట్టింది. ► దాదాపు 7.96 లక్షల పొదుపు సంఘాలు సరాసరి రూ.3.21 లక్షల చొప్పున ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. దీనికితోడు, బ్యాంకుల నుంచి మహిళలు తీసుకున్న ‘పొదుపు’ రుణాలపై వడ్డీ భారాన్ని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తోంది. ► ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు నగదు రూపంలో (డీబీటీ) 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2.31 లక్షల కోట్లను అందజేసింది. పొదుపు సంఘాల మహిళల్లో అత్యధికులకు తద్వారా లబ్ధి చేకూరింది. ఇందులో కేవలం మహిళా లబ్ధిదారులకే రూ.1.64 లక్షల కోట్లు చేరాయి. ► వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా మహిళలకు చేరిన డబ్బులను అసక్తి ఉన్న వారు నెల వారీ స్థిర ఆదాయం వచ్చే జీవనోపాధి మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకుంటే వారికి తగిన ‘చేయూత’ అందజేసేలా ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీలు ఐటీసీ, హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, రిలయెన్స్, అమూల్ వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కొత్తగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వారికి అవసరమైతే అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలోనూ ప్రభుత్వం తోడ్పడింది. సంక్షేమ కార్యక్రమాలతో పేదల ఇంట సిరులు జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ తదితర మొత్తం 28 రకాల సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధిని మెజారిటీ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాల మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల ఆదాయ వివరాల సేకరణ సమయంలో ఈ విషయం నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అందజేసిన లబ్ధిని ఉపయోగించుకొని కొందరు తమ తమ ఊళ్లలో చిరు వ్యాపారాలు మొదలు పెద్ద దుకాణాల వరకు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కేవలం కూలి పనుల మీద ఆధారపడే బతికే వారిలో చాలా మంది కొత్తగా పాడిగేదెలు, అవులు, మేకలు వంటివి కొనుగోలు చేసుకొని స్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నారు. అన్నింటికీ మించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు ఇలా ప్రతి అవసరానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం తగ్గిపొయింది. పాత అప్పులు కూడా తీర్చేశారు. తద్వారా ఏటా రూ.25 వేల నుంచి రూ.40 వేల దాక కట్టే వడ్డీల బెడద తగ్గిపోయిందని సర్వే సమయంలో మహిళలు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఆర్డీ ద్వారా అధ్యయనం పొదుపు సంఘాల మహిళల ఆదాయాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ద్వారా సర్వే చేసిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి సమగ్ర విశ్లేషణకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనంలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ) ద్వారా అధ్యయనం చేయించేందుకు పూనుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ఎన్ఐఆర్డీ మధ్య ప్రాథమికంగా ఒక అవగాహన ఒప్పందం పూర్తయింది. ఈ అధ్యయనం కార్యక్రమం మొదలు కావాల్సి ఉందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. నెల వారీ స్థిర ఆదాయం బాపులపాడు మండలంలోని వీరవల్లికి పక్కనే ఉండే కొడూరుపాడు గ్రామం శివారు ఉమామహేశ్వరపురానికి చెందిన రెడ్డి నాగరాణికి సొంతంగా వ్యవసాయ భూములు లేకపోయినా, కౌలు భూములు సాగు చేసుకుంటోంది. కౌలుదారు కార్డుతో ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకంలో లబ్ధి పొందింది. గ్రామంలో పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఈమె తన రెక్కల కష్టంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నెలా వారీ ఆదాయం మూడు రెట్లకు పైగా పెంచుకుంది. మొదటి నుంచి పాడి గేదెల వృత్తిగా కొనసాగుతున్న ఆ కుటుంబం మూడేళ్ల కిత్రం వరకు ప్రతి 15 రోజులకు రూ.6 వేల నుంచి రూ.7 వేల ఆదాయం పొందుతుండేది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ఈమె కుటుంబం ఇప్పుడు 11 అవులను పోషిస్తోంది. రోజూ 40 లీటర్ల పాలు కేంద్రానికి పోస్తూ ప్రతి 15 రోజులకు రూ.20 వేల ఆదాయం పొందుతోంది. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పాలకు లీటరుకు అదనంగా నాలుగు రూపాయలు ప్రయోజనం చేకూరిందని ఈమె కుటుంబం సంబరపడుతోంది. సొంత కాళ్లపై నిలదొక్కుకున్న సభ్యులు బాపులపాడు మండల కేంద్రంలో ఓం గణపతి స్వయం సహాయక పొదుపు సంఘం పది మంది సభ్యులతో 2007లో ఏర్పాటైంది. వీరు ప్రతి నెలా కొద్ది మొత్తం చొప్పున ఇప్పటి వరకు రూ.2.53 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ సంఘానికి వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.2.12 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. వారు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించి ఆ మహిళలు ఈ నాలుగేళ్ల కాలంలో చెల్లించాల్సిన వడ్డీకి సంబంధించి మరో రూ.41 వేలు మూడు విడతల్లో అందించింది. ఆ సంఘంలో సభ్యులు అమ్మఒడి, వైఎస్సార్ దీవెన, కాపు నేస్తం, రైతు భరోసా.. ఇలా వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. ఈ సంఘంలో సభ్యురాలిగా ఉండే చోడిశెట్టి లక్ష్మీ కుటుంబం వ్యాపారం నిర్వహించే అద్దె షాపును పది నెలల కిత్రం కొనుగోలు చేసింది. ఇదే సంఘంలో సభ్యురాలిగా ఉండే కుర్ర అనూష కుటుంబం మూడేళ్ల కిత్రం వరకు అద్దె ఇంటిలో ఉండి, ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుగోలు చేసింది. ఇంకో సభ్యురాలి కుటుంబం కొత్తగా వ్యాను కొనుగోలు చేసింది. గతంలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే ఆమె భర్త ఇప్పుడు వ్యాను యజమాని అయ్యారు. బాపులపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరికపాటి హేమలత.. వెన్నల స్వయం సహాయక పొదుపు సంఘ సభ్యురాలు. వీళ్ల ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే వీరవల్లిలో గత ఏడాది డిసెంబర్లో జనరల్ స్టోర్ ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఆమెకు అలాంటి వ్యాపారం నడపాలన్న ఆలోచనే లేదు. కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమై గృహిణిగా కొనసాగుతుండేది. భర్త అక్కడికి దగ్గరలో ఉండే స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న తోడ్పాటుతో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టింది. -
పొదుపు వ్యవస్థలో విప్లవం..వైఎస్ ‘పావలా వడ్డీ’
సాక్షి, అమరావతి: నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి ఆలోచనలోంచి రూపుదిద్దుకున్న పథకం దేశంలో పొదుపు వ్యవస్థలో విప్లవం సృష్టించింది. మహిళల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు దిక్సూచిగా నిలిచింది. అదే పావలా వడ్డీ పథకం. ఆ పథకం రూపకర్త మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అమలు చేసిన ఈ పథకం తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది. కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుత విభిజిత ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం పొదుపు సంఘాల్లో మూడోవంతుకుపైగా 2004–08 మధ్య కాలంలో ఏర్పడినవే. దీనికి పావలా వడ్డీ అమలే ప్రధాన కారణం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎనిమిది లక్షల వరకు పొదుపు సంఘాలున్నాయి. వీటిలో 2,90,928 సంఘాలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004–08 మధ్య ఏర్పడినవే. అదే సమయంలో పావలా వడ్డీ కార్యక్రమంతో అప్పట్లో పెద్దసంఖ్యలో మహిళలు రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో చేరారు. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని నిర్ణయించింది. అభయహస్తంతో భరోసాకి దారి..: పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళల వయసు 60 ఏళ్ల దాటిన తర్వాత వారికి రుణాలిచ్చేందుకు అప్పట్లో చాలా బ్యాంకులు ఆసక్తి చూపేవి కాదు. ఈ నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన పొదుపు సంఘాల మహిళలకు ఆదాయ భద్రత, భరోసా కల్పించేందుకు రాజశేఖరరెడ్డి అప్పట్లో ‘అభయహస్తం’ అనే మరో విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు మళ్లీ జగన్ ‘ఆసరా’తో..: చంద్రబాబు హయాంలో మోసపోయిన డ్వాక్రా మహిళలకు ఆసరాగా నిలవాలని 2019లో ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిన వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాలు రూ.25,571 కోట్లను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం రూ.19,178 కోట్లు ఈ పథకం కింద చెల్లించింది. దీనికితోడు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా గత నాలుగేళ్లు సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు ఆ వడ్డీ డబ్బులను ఏ ఏడాదికి ఆ ఏడాదే నేరుగా వారికే ప్రభుత్వం అందజేస్తోంది. -
ఏపీకి రెండు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డులు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్ గోల్డ్, మరో నాలుగు స్కోచ్ సిల్వర్ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్ సంస్థ అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 6 అవార్డులు మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని çసద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ గోల్డ్ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.35 వేల కోట్లను రుణాలుగా అందజేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పొదుపు సంఘాలు సగటున రూ.5.31 లక్షల చొప్పున బ్యాంకు రుణాలు పొందాయి. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఇప్పటికే రూ. 12,758 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందజేసింది. సకాలంలో రుణాలు చెల్లించే వారికి వైఎ స్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వం తిరిగి ఆయా పొదుపు సంఘాలకు చెల్లిస్తోంది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు బ్యాం కుల నుంచి తీసుకుంటున్న రుణాలను 99.5 శాతం మేర సకాలంలో చెల్లిస్తూ రికార్డు సాధించారు. ‘స్త్రీ నిధి’కి మరో గోల్డ్ అవార్డు ► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అనుబం« దంగా పనిచేస్తున్న ‘స్త్రీ నిధి’ సంస్థ బ్యాంకులిచ్చే రుణాలకు తోడు అత్యంత సులభ విధానంలో అదనంగా రుణాలు అందజేస్తుండటంతో స్కోచ్ సంస్థ స్త్రీ నిధిని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. ► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొదుపు సంఘాల విజయ గాథలను ‘మహిళా నవోదయం’ పేరిట ప్రతినెలా ప్రత్యేక మాసపత్రిక రూపంలో ప్రచురిస్తూ సభ్యులందరికీ తెలియజేస్తున్న ఆ జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్ అవార్డు దక్కింది. ► ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్దఎత్తున నాటు కోళ్ల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నందుకు ఆ జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, పాడి గేదెల పెంపకం ద్వారా ఆధిక ఆదాయం సాధించేలా చేస్తున్న చిత్తూరు జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, జిల్లాలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు మరో సిల్వర్ అవార్డు దక్కాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ ప్రోత్సాహకాల కారణంగా మహిళలు కీలకంగా ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించుకుంటున్నారు. ప్రభుత్వం అందజేసే అర్థిక సహాయానికి తోడు బ్యాంకుల నుంచి అందే రుణ మొత్తాలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యవసాయం మాత్రమే తెలిసిన వారు పెద్ద సంఖ్యలో పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారు. ఇలా లాభదాయక కార్యకలాపాలు సాగిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అందజేసే ప్రోత్సహకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సైకిల్ చాలా వేగంగా తిరుగుతోంది. ఇలాంటి విజయాలను నమోదు చేయడంతో సెర్ప్ కార్యక్రమాలకు ఈ ఏడాది ఆరు అవార్డులు దక్కాయి. – ఇంతియాజ్ అహ్మద్, సీఈవో, సెర్ప్ -
పొదుపుసొమ్ము స్వాహా కేసులో టీడీపీ నేత అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం/ప్రొద్దుటూరు: పొదుపు సంఘం డబ్బు స్వాహా కేసులో టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, ఆమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్తె లలితలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. బంగారులక్ష్మి సమాఖ్య పరిధిలోని 30 డ్వాక్రా గ్రూపులకు సం బంధించి రూ.31,83,097కు పైగా అవినీతి జరి గినట్లు మున్సిపల్ అధికారులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఖాతాల్లో అవకతవకలు జరిగాయని, రూ.30 లక్షలకు పైగా డబ్బు స్వాహాచేశారని మహిళలు గతనెలలో లక్ష్మీనారాయణమ్మ ఇంటిముందు ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న తమపై లక్ష్మీనారాయణమ్మ కుటుంబసభ్యులు దాడిచేశారని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తమను మోసం చేసిన లక్ష్మీనారాయణ మ్మకు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ మహిళలు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేశారు. వారిపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు లక్ష్మీనారాయణమ్మ వద్ద ఉన్న రికార్డులను స్వా« దీనం చేసుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం రూ.31,83,097కు పైగా అవినీతి జరిగినట్లు తేలిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. మహిళల ఆత్మగౌరవ దీక్ష విరమణ డ్వాక్రా మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారా>యణమ్మ, ఆమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్తె లలితలను అరెస్ట్ చేయాలంటూ వారం రోజులుగా కొనసాగుతున్న ‘ప్రొద్దుటూరు మహిళల ఆత్మగౌరవ దీక్ష’ను గురువారం విరమించారు. దీక్ష చేస్తున్న మహిళలకు కడప దిశ డీఎస్పీ వాసుదేవన్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. చివరిరోజు దీక్షలో సోములవారిపల్లె సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీటీసీ సభ్యురాలు బాలగుర్రమ్మ, మాజీ కౌన్సిలర్లు వుట్టి రమణమ్మ, రమాదేవి, మాజీ సర్పంచ్ రాజేశ్వరి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి కూర్చున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాసెసింగ్ చార్జీలొద్దు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం బుధవారం రిజర్వు బ్యాంకు అప్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మహ్మద్ ఇంతియాజ్ బుధవారం ముంబయిలోని రిజర్వు బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని ఛీప్ జనరల్ మేనేజర్, హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్‌తో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) కన్వీనర్లకు వేర్వేరుగా లేఖ రాశారు. రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రస్తుతం పొదుపు సంఘాల రుణ మొత్తంపై 0.5 శాతం నుంచి 1.2 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులు బాటు ఉంది. అంటే, మహిళలు రూ.20 లక్షల రుణం తీసుకుంటే సుమారు రూ.20 వేలు ప్రాసెసింగ్ ఫీజు పేరిట బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి. పొదుపు సంఘాలు తీసుకునే రుణాల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఈ తరహా ప్రాసెసింగ్ చార్జీలు వారికి భారంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలతో పాటు డాక్యుమెంటేషన్ చార్జీలు, ఇతర అడహాక్ చార్జీలు సైతం బ్యాంకులు వసూలు చేయకుండా అన్ని బ్యాంకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరింది. రుణాల చెల్లింపులో దేశంలోనే ప్రథమ స్థానం పొదుపు సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరాతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి సున్నా వడ్డీ పథకం అమలు వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలలో 99.5 శాతం సకాలంలో చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో బ్యాంకులు కూడా మహిళా పొదుపు సంఘాల గరిష్ట పరిమితి మేరకు రుణాలు ఇస్తున్నాయి. మరో పక్క.. రాష్ట్రంలో పొదుపు సంఘాల పేరిట ప్రస్తుతం రూ.30 వేల కోట్ల పైబడి మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఉన్నారు. అందులో ఎప్పటికప్పుడు కిస్తీ ప్రకారం పాత రుణాల చెల్లింపులు పూర్తి కాగానే, తిరిగి కొత్తగా ఏటా రూ.15 వేల కోట్లు రుణాలు పొందుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకుల స్పందన ► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.2.5 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ ఆర్బీఐ గతంలోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల కిత్రం వరకు మన రాష్ట్రంలోనూ అత్యధిక సంఘాలు ఈ పరిమితి మేరకే బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితి ఉండింది. ► అయితే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రూ.10 లక్షలకు పైబడే రుణాలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ చార్జీ భారంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టి రాగానే.. గత రెండేళ్లగా జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశాలన్నింటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చింది. ► ఫలితంగా రూ.10 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ యూనియన్ బ్యాంకు (గతంలో ఆంధ్రా బ్యాంకు) 2021 సెప్టెంబర్ 1వ తేదీన అన్ని బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 2021 ఆగస్ట్ 23వ తేదీన అదే తరహా ఉత్తర్వులిచ్చింది. ► సకాలంలో చెల్లింపులు జరుగుతుండడంతో ఇప్పుడు బ్యాంకులు రూ.20 లక్షల దాకా సంఘాల పేరిట రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని సమావేశ మినిట్స్‌లో ఉదహరించి, అన్ని బ్యాంకులకు ఆదేశాలివ్వాలంటూ సూచన చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు (అప్కాబ్) ఇప్పటికే రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు వసూలును పూర్తిగా మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
పొదుపు సంఘాల మహిళల్లో ఆనందోత్సాహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మహిళల సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా చొరవ తీసుకున్న ప్రభుత్వం.. వీరు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని తాజాగా జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా మూడో ఏడాది సొమ్మును వారి ఖాతాల్లో నేరుగా వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, పాణ్యం, గడివేముల మండలాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. మహిళలకు చెక్కులు అందజేశారు. -
పొదుపు.. కొత్త మలుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే డ్వాక్రా మహిళల పొదుపు బిలియన్ డాలర్లను దాటేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బిలియన్ డాలర్లకు ప్రత్యేక స్థానం ఉంది. బిలియన్ డాలర్ల మూల ధన నిధి.. అంటే ప్రస్తుత ధరల ప్రకారం రూ.7,324 కోట్లు. ఈ మేరకు మూల ధన నిధి ఉండే కంపెనీలకు వ్యాపార రంగంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న మొత్తం ప్రస్తుతం రూ.8,706 కోట్లకు చేరింది. సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు ప్రతి నెలా వంద రూపాయల చొప్పున తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలన్న నిబంధన ఉంది. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థ మొదలైన కొత్తలో రోజుకు ఒక రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు చేసుకునేవారు. క్రమంగా ఆ మొత్తం రూ.వందకు పెరిగింది. సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంతమంది ప్రతి నెలా సమావేశమై, తమ స్థితిగతులను చర్చించుకుంటారు. అందరి సభ్యుల పొదుపును పోగు చేసి, సంఘం పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాల్లో జమ చేసుకుంటారు. ఈ మొత్తానికి తోడు సంఘ సభ్యుల రుణ చెల్లింపుల రికార్డు ఆధారంగా బ్యాంకులు ఆయా సంఘాలకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేస్తుంటాయి. గత ప్రభుత్వ తీరుతో డీలా ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలు రూ.81.76 కోట్ల మొత్తాన్ని పొదుపు చేసుకున్నారు. గత రెండేళ్లుగా ప్రతి నెలా రూ.70 కోట్లకు తగ్గకుండా పొదుపు చేసుకుంటున్నారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 జూన్ తర్వాత నుంచి 2016 మార్చి మధ్య చాలా నెలల పాటు గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా రూ.7 లక్షల చొప్పున మాత్రమే పొదుపు చేసుకునే పరిస్థితి ఉండేది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలొకి వచ్చాక హామీని గాలికి వదిలేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు పొదుపు పట్ల ఆసక్తి చూపలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను అమలు చేయడంతో వారు కార్యకలాపాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటున్నారు. పొదుపు డబ్బును వినియోగించుకోవచ్చు.. పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా దాచుకున్న డబ్బు ఇప్పటి వరకు బ్యాంకులో పొదుపు ఖాతాల్లో నిరుపయోగంగా ఉంటున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. వారు దాచుకున్న డబ్బు రూ.8,706 కోట్లు ఉన్నా, వారు ఆ డబ్బును అలానే తక్కువ వడ్డీ వచ్చే పొదుపు ఖాతాలో ఉంచి, అధిక వడ్డీకి ఆవే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. వారి పొదుపు డబ్బుకు 4 శాతం వడ్డీ వస్తుండగా, వారు బ్యాంకుల నుంచి 10 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళలు తమ పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని మొదట సంఘంలో డబ్బు అవసరం ఉన్న మహిళలకు అప్పుగా ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవసరం మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా సెర్ప్ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. బ్యాంకులు కూడా పొదుపు సంఘాలలో డబ్బులను ష్యూరిటీగా ఉంచుకొని ఆయా సంఘాలకు కావాల్సిన మొత్తం రుణం ఇవ్వడం పరిపాటిగా కొనసాగుతోంది. కాగా, రుణ పంపిణీకి ఇబ్బంది లేకుండా పొదుపు సంఘాల మహిళలు తమ పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాలను తొలత తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఎస్బీఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, డీసీసీబీ బ్యాంకులు ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాలు ప్రస్తుతం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలు దాచుకున్న రూ.8,706 కోట్లను వారి అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించడం ద్వారా మహిళలు బ్యాంకు రుణాలపై ఆధార పడే పరిస్థితి తగ్గుతుంది. ఆయా సంఘాల మూల ధన నిధి మరింత పెరిగే అవకాశం ఉంది. -
‘పరపతి’ పెంచుకున్న అక్కచెల్లెమ్మలు
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పరపతి పెరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలు ఇప్పుడు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినా సకాలంలో వాయిదాలు చెల్లించే మహిళల సంఖ్య అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 6 లక్షలు పెరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు నిర్ధారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8,78,874 సంఘాల పేరిట తీసుకున్న రుణాలకు సంబంధించి ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు సక్రమంగా వాయిదాలు చెల్లించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9,34,852 సంఘాలకు చెందిన మహిళలు సకాలంలో రుణ కిస్తీ చెల్లించినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం నాటి పరిస్థితులతో పోలిస్తే 20 లక్షల మందికి పైగా మహిళలు సక్రమంగా రుణ కిస్తీలు చెల్లిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా పథకాలతో... గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సంఘాల్లో ప్రతి నెలా చేసుకోవాల్సిన పొదుపును కూడా మహిళలు పూర్తిగా పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో కొంత కాలంపాటు రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా చేపట్టిన చర్యలతో మహిళలు మళ్లీ పొదుపు సంఘాల కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనడం పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా చెల్లించడంతో పాటు పొదుపు రుణ వ్యవహారాలు యథావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో మహిళలకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారానే పొదుపు సంఘాల మహిళలకు దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ చర్యలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. లక్ష సంఘాలకు రూ.10 లక్షలపైగా రుణాలు ముందెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో పొదుపు సంఘాల మహిళలు సకాలంలో రుణ కిస్తీలు చెల్లిస్తుండటంతో బ్యాంకులు ఇప్పుడు ఒక్కొక్క పొదుపు సంఘానికి రూ.10 లక్షలకు పైబడి కూడా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు దాదాపు లక్ష సంఘాలకు రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొచ్చాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
ప్రతి అక్కచెల్లెమ్మ లక్షాధికారి కావాలి
‘‘మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా తెలియజేస్తున్నా’’ ‘‘ఒక సమాజంలో మానవ హక్కులు అమలవుతున్నాయా? స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయా? రాజ్యాంగపరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? ఈ సమాజంలో రక్షణ ఉందా?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. ఇవన్నీ మహిళలకు ఏ సమాజంలో పూర్తిగా లభిస్తున్నాయో అక్కడ మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్నీ ఉన్నట్లే.. అన్నీ బాగున్నట్లే. అలాంటి సమాజాన్ని నిర్మించుకునేందుకు మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 23 నెలలుగా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సీఎం ఆకాంక్షించారు. ‘ప్రతి అమ్మాయి కనీసం గ్రాడ్యుయేట్ కావాలి. ప్రతి అక్కచెల్లెమ్మ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారి కావాలి. ప్రతి మహిళ గౌరవప్రదంగా పూర్తి రక్షణతో జీవించే పరిస్థితి కల్పించాలి. లింగ వివక్షతను రూపుమాపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది’ అని సీఎం తెలిపారు. ఆర్థిక స్వావలంబనతో మొదలయ్యే ఈ ప్రయాణం సామాజికంగా, రాజకీయంగా కూడా మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టే పరిస్థితి రావాలన్నారు. మహిళా సాధికారత కోసం ఈ 23 నెలల్లో పలు అడుగులు వేశామని, గర్భంలో ఉన్న శిశువు మొదలు అవ్వల వరకు ప్రతి అడుగులో వారికి అండగా నిలబడ్డామని సీఎం తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మంది పొదుపు మహిళలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లను సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సెర్ప్ సీఈవో రాజబాబు, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ కేవీ నాంచారయ్య, ఎస్ఎల్బీసీ ప్రతినిధిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రమేష్ వేగేతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన సంఘాల సభ్యులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ.. మనపై నమ్మకానికి నిదర్శనం.. ఇవాళ మళ్లీ ఒక మంచి కార్యక్రమం. 9.34 లక్షల స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషిస్తున్నా. దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం ఒక అంశమైతే.. రెండో అంశం అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. అవి బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రుణాలు సకాలంలో చెల్లించిన 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుస్తూ వారి రుణ ఖాతాల్లో రూ.1,109 కోట్లు జమ చేస్తున్నాం. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 8.71 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇవాళ 9.34 లక్షలకు చేరాయి. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా మాట తప్పకుండా అటు ఆసరా పథకంలో రూ.6,792 కోట్లు వారి చేతిలో పెట్టడం వల్ల కానివ్వండి, 2019–20లో సున్నా వడ్డీ కోసం చేసిన చెల్లింపుల వల్ల కానివ్వండి.. మొత్తంగా అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం మీద కలిగిన నమ్మకానికి పొదుపు సంఘాల సంఖ్య పెరుగుదలే ఒక పెద్ద నిదర్శనం. గత సర్కారు మోసంతో చక్రవడ్డీలు.. 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ మాట దేవుడెరుగు. అప్పటివరకు ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా 2016 నుంచి రద్దు చేసింది. ఈ మోసం వల్ల ‘ఏ’ గ్రేడ్ సంఘాలు ‘బీ’ గ్రేడ్, ‘సీ’ గ్రేడ్‌కు పడిపోగా, ‘బీ’ గ్రేడ్, ‘సీ’ గ్రేడ్ సంఘాలు అప్పుల పాలై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక మూతబడే స్థితికి చేరాయి. అంతేకాకుండా అక్కచెల్లెమ్మలు అప్పట్లో అక్షరాలా రూ.3 వేల కోట్ల వడ్డీ రాయితీకి అర్హత కోల్పోయే పరిస్థితి కూడా చూశాం. వారు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సి వచ్చింది. మనందరి ప్రభుత్వ హయాంలో.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8.71 లక్షల సంఘాలకు చెందిన 87 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద దాదాపు రూ.1,400 కోట్లు వారి రుణ ఖాతాల కింద ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత ఆసరా కింద మరో రూ.6,792 కోట్లు కూడా ఇచ్చాం. వడ్డీ భారం కూడా తగ్గించాం.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాలలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.3 లక్షల రుణ పరిమితి వరకు 7 శాతం వడ్డీ చొప్పున, మిగిలిన ఏడు జిల్లాలలో 12.5 శాతం నుంచి 13.5 శాతం వరకు వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మనం అధికారంలోకి రాగానే బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారాన్ని 12.5 – 13.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగలిగాం. దీనివల్ల దాదాపు రూ.590 కోట్ల భారం అక్కచెల్లెమ్మలకు తగ్గింది. వారి రుణాల వడ్డీ కింద ఇప్పుడు రూ.1,109 కోట్లు జమ చేస్తున్నాం. మహిళా సాధికారత కోసం ఏం చేశామంటే.. గత 23 నెలల కాలంలో మహిళల సాధికారత కోసం ప్రతి అడుగులో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాం. అమ్మ ఒడి ద్వారా దాదాపు 44.5 లక్షల మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ఒక్కొకరికి ఏటా రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.6,500 కోట్లు వంతున రెండేళ్లలో ఇప్పటికే దాదాపు రూ,13.023 కోట్లు ఒక అన్నగా అందజేశాం. ► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఇస్తున్న 61 లక్షల పెన్షన్లలో 36.73 లక్షలు మంది అవ్వలు, మహిళా దివ్యాంగులు, వితంతువులున్నారు. వారికి పెన్షన్ కింద అందజేసిన మొత్తం రూ.16,444 కోట్లు. ► వైఎస్సార్ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా బృందాలలో 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మనం అధికారంలోకి వచ్చే నాటికి వారికి ఉన్న రుణం రూ.27,168 కోట్ల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడతగా రూ.6,792 కోట్లు గత ఏడాది సెప్టెంబరు 11న జమ చేశాం. రెండో విడతగా రూ.6,792 కోట్లు ఈ సెప్టెంబరులో జమ చేస్తాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 4.56 లక్షల మంది 45 – 60 మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద అక్క చెల్లెమ్మలకు ఒకొక్కరికి రూ.18,750 చొప్పున మొదటి విడతగా 2020 ఆగస్టులో రూ.4,604 కోట్లు లబ్ధి చేకూర్చాం. నాలుగు విడతల్లో అందించే మొత్తం దాదాపు రూ.18,500 కోట్లు అని ఒక అన్నగా, తమ్ముడిగా సగర్వంగా చెబుతున్నా. ► వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హెచ్‌యూఎల్, రిలయన్స్, అల్లానా లాంటి ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల్లో భాగంగా వారికి వ్యాపారంలో తోడుగా నిలిచేలా ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అక్కచెల్లెమ్మలకు వ్యాపారపరమైన నైపుణ్యాలు, మార్కెటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రభుత్వ సాయంతో ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 69 వేల షాపులు ఏర్పాటయ్యాయని గర్వంగా చెబుతున్నా. ► జగనన్న జీవక్రాంతి ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచేందుకు చేయూత, ఆసరా పథకాలను అనుసంధానం చేస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్నాం. పాల ఉత్పత్తిలో అమూల్‌తో ఒప్పందం చేసుకుని లీటరు పాలకు రూ.5 నుంచి రూ.7 వరకు అధికంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ► జగనన్న పాలవెల్లువ పథకంలో ఆవులు, గేదెలకు సంబంధించి 1.12 లక్షల యూనిట్లు కావాలని అక్క చెల్లెమ్మలు కోరారు. వాటిని అందజేస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నాం. మేకలు, గొర్రెలు 72,179 యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. ఒక్కో యూనిట్లో 15 మేకలు, ఒక మేకపోతు ఉంటాయి. వాటిని కూడా చేయూత, ఆసరా కింద ఇస్తున్నాం. ► వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న దాదాపు నాలుగు లక్షల మంది అగ్రవర్ణాల పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో ఒక్కొక్కరికి రూ.45 వేల చొప్పున ఇచ్చేందుకు ఈ ఏడాది నుంచి రూ.600 కోట్లు కేటాయించాం. వచ్చే మూడేళ్లలో రూ.1,800 కోట్లు వారికి ఇస్తాం. ► వైఎస్సార్ జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, గృహ నిర్మాణాల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి కలిగిస్తున్నాం. అంటే ఇది రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి మేలు చేసే కార్యక్రమం. ఇప్పటికే ఇళ్ల స్థలాలు పంచడమే కాకుండా మొదటి దశ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాం. అన్ని వసతుల కల్పన ద్వారా ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఆ విధంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచబోతున్నాం. ► జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్) ద్వారా 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా, అక్క చెల్లెమ్మల చేతిలో నేరుగా డబ్బులు పెడుతున్నాం. నాలుగు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.2,800 కోట్లు వారి చేతిలో పెడుతున్నాం. అందులో తొలి త్రైమాసిక ఫీజుల కింద మొన్ననే వారి చేతికి రూ.671 కోట్లు ఇచ్చాం. ► జగనన్న వసతి దీవెన కింద పిల్లల హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రెండు దఫాల్లో రూ.20 వేల వరకు ఇసున్నాం. ఇప్పటివరకు రూ.1,221 కోట్లు అందజేశాం. ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ప్రతి విద్యార్థికి మేలు జరిగేలా ఈనెల 28న దాదాపు మరో రూ.1,200 కోట్లు తల్లుల ఖాతాల్లో వేస్తాం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పుడు ఇస్తున్న రూ.1,109 కోట్లు కూడా కలిపితే ఇప్పటివరకు దాదాపు రూ.2,509 కోట్లు ఈ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రూ.1,863 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనిపై గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే వ్యయం చేసేవారు. ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. 55,607 అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. ► నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు బాలికల సంఖ్య పెంచి స్కూళ్లకు వచ్చే విధంగా ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తున్నాం. ► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.492 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తంతో 82 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.384 కోట్లు, వైఎస్సార్ బీమా ద్వారా 17,03,703 మంది మహిళలకు రూ.176 కోట్లు. వైఎస్సార్ వాహనమిత్రతో 24 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.45.7 కోట్లు, జగనన్న చేదోడు పథకం ద్వారా 1.36 లక్షల అక్క చెల్లెమ్మలకు రూ.136 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2.73 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.824 కోట్లు, ఆరోగ్య ఆసరా ద్వారా 94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.50.66 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా 21.67 లక్షల మంది చిట్టి తల్లులకు రూ.335 కోట్ల మేర సహాయం అందించాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి అడుగులోనూ ప్రాధాన్యం.. ఇవాళ ప్రతి అడుగులో అక్కచెల్లెమ్మల బాగు కోసం చేస్తున్న కృషి కనిపిస్తోంది. చివరకు మంత్రివర్గాన్ని చూసినా ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వగా, హోంమంత్రి కూడా మహిళకే ఇచ్చాం. మున్సిపల్ పదవుల్లో కూడా మహిళలకు 61 శాతం ఇచ్చామని గర్వంగా చెబుతున్నా. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో సగం మహిళలకు ఇస్తూ చట్టాలు చేశాం. బీసీ కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, చివరకు ఆలయాల బోర్డులలో కూడా సగం మహిళలే కనిపిస్తారని సగర్వంగా తెలియజేస్తున్నా. దిశ చట్టం – యాప్.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ దేశంలోనే విప్లవాత్మక పరిణామంగా ఏపీ దిశ చట్టాన్ని చేసి కేంద్రానికి పంపాం. ఇçప్పటికే 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 18 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, దిశ యాప్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. 900 పెట్రోలింగ్ వాహనాలు: మహిళా కానిస్టేబుళ్ల పెట్రోలింగ్ కోసం కొత్తగా 900 వాహనాల కొనుగోలు చేసి జీపీఎస్ అనుసంధానం చేశాం. వారు పోలీసు కంట్రోల్ రూమ్‌తో పాటు డివిజన్ స్థాయి కార్యాలయంతో అనుసంధానమై ఉంటారు. విద్యార్థినిలపై నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న మార్కెట్ ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీల వద్ద పక్కాగా పెట్రోలింగ్ ఏర్పాట్లు చేశాం. సహాయక డెస్కులు మహిళలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా సహాయక డెస్కులు ఏర్పాటు చేశాం. వాటిలో మహిళలే పని చేస్తారు. బాధిత మహిళల సమస్య వినడం మొదలు ఫిర్యాదు చేసేవరకు సహాయం చేస్తారు. ఇంకా సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. దశలవారీగా మద్య నియంత్రణ.. మహిళల సాధికారత, సంతోషంగా ఉండేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. దాదాపు 4,380 పర్మిట్ రూమ్‌లను కూడా రద్దు చేశాం. దీనివల్ల మహిళలకు మరింత భద్రత ఏర్పడిందని గర్వంగా చెబుతున్నా. గతంలో మద్యం షాపులు రాత్రి 11 వరకు ఉండగా ఇప్పుడు రాత్రి 8 గంటలకే మూసివేయిస్తున్నాం. ఉదయం 11 గంటలకు మాత్రమే తెరుస్తూ వాటిని ప్రభుత్వమే నడుపుతోంది. మద్యం షాపులను మూడో వంతు తగ్గించడంతో ఇప్పుడు కేవలం 2,966 షాపులు మాత్రమే మిగిలాయి. ధరలు బాగా పెంచడం వల్ల మద్యం అమ్మకాలు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చాలా తగ్గాయి. 2018–19లో 3.80 కోట్ల కేసుల లిక్కర్ అమ్మితే ఇవాళ (2020–21లో) 1.87 కోట్ల కేసులకు లిక్కర్ అమ్మకాలు తగ్గాయి. అంటే దాదాపు 51 శాతం తగ్గాయి. 2018–19లో 2.90 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోతే 2020–21లో కేవలం 57.02 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడు పోయాయి. అంటే దాదాపు 80 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇలా ప్రతి మహిళకు సంతోషం కలిగించాలన్న తాపత్రయం, తపనతో ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లికి అన్నగా అడుగులు వేస్తున్నానని సగర్వంగా చెబుతున్నా. నిజమైన హీరో మీరే.. ‘దివంగత వైఎస్సార్ పావలావడ్డీ ప్రవేశపెట్టి మహిళా సంఘాలకు ప్రాణం పోస్తే మీరు వైఎస్సార్ సున్నా వడ్డీ తెచ్చి ఆర్థిక చేయూత అందిస్తున్నారు. గత ఏడాది మేం కట్టాల్సిన వడ్డీని మా బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి మనసున్న సీఎంగా నిలిచారు. బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాల మహిళలకు వడ్డీని 12.5% నుంచి 9.5 శాతానికి తగ్గించిన ఘనత మీదే. మీ పథకాల వల్ల మాకు సంఘంలో గౌరవం పెరిగింది. సినిమాల్లో హీరో ఎన్నో చేస్తాడు.. కానీ నిజ జీవితంలో ఇన్ని కోట్ల మందికి మేలు చేస్తున్న మీరు రియల్ హీరో. మా పిల్లలకు మీరే రోల్ మోడల్. పది కాలాల పాటు మీరే సీఎంగా ఉండాలి’ – మల్లేశ్వరి. బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా కుటుంబాలు బాగు పడుతున్నాయి.. ‘నాడు పావలా వడ్డీతో వైఎస్సార్ ఆదుకుంటే మీరు మరో అడుగు ముందుకు వేసి వైఎస్సార్ సున్నా వడ్డీని అమలు చేస్తున్నారు. నవరత్నాలను మాట తప్పకుండా అమలు చేస్తూ ప్రతి పథకాన్ని మహిళలకే అందచేస్తున్నారు. దీనివల్ల కుటుంబాలు చాలా బాగు పడుతున్నాయి. గత ప్రభుత్వం సున్నా వడ్డీ, రుణమాఫీ పేరుతో మోసం చేసింది. మీరు అందిస్తున్న భరోసాతో చీరల వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ.20 వేలు సంపాదించుకుంటున్నా. మహిళలకు ఇంత మేలు చేస్తున్న జగనన్న ఎప్పుడూ సీఎంగా ఉండాలి’ – మౌలానీ, కొత్తపల్లి మండలం, కర్నూలు జిల్లా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ‘మా సంఘానికి బ్యాంకు నుంచి రూ.9 లక్షల రుణం వచ్చింది. వడ్డీ భారాన్ని పొదుపు సంఘాల ఖాతాకు ప్రభుత్వమే జమ చేసింది. కరోనా విపత్కర పరిస్థితిలోనూ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు. మీరు ఇస్తున్న భరోసాతో నేను, మా అత్త ఫ్యాన్సీ, కిరాణా షాప్ పెట్టుకుని నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి?’ – కృష్ణవేణి, మద్దూరు, కృష్ణా జిలా మహిళా పక్షపాత ప్రభుత్వం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ‘సీఎం జగన్‌ది విలక్షణ పాలన. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. దేశంలో ఏ సీఎం కూడా అలా చేయలేదు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. ఇది మహిళ పక్షపాత ప్రభుత్వం. దాదాపు 20 పథకాలలో వారికే ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. గత ఏడాది కంటే రుణాల సంఖ్య పెరిగినా వెనుకంజ వేయలేదు. బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీని తగ్గించడం వల్ల మహిళలపై రూ.590 కోట్ల వడ్డీ భారం తగ్గింది. ఒక క్యాలెండర్ ప్రకటించి పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఏ ఒక్క పథకం విషయంలోనూ వెనుకంజ వేయడం లేదు. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో దాదాపు 4.65 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా వారికి మేలు జరుగుతోంది’ నాడు మహిళలు బంగారం అమ్ముకున్నారు – బొత్స సత్యనారాయణ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ కింద గత ఏడాది రూ.1,400 కోట్లు ఇవ్వగా ఈసారి రుణాల సంఖ్య పెరిగినా రూ.1,109 కోట్లు ఇస్తున్నామంటే అందుకు కారణం బ్యాంకులు వడ్డీని 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించడమే. చంద్రబాబు మాట ఇచ్చి డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయకపోగా చివరకు సున్నా వడ్డీని కూడా అమలు చేయలేదు. దీంతో కొందరు డ్వాక్రా మహిళలు చివరకు బంగారం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ డబ్బులు జమ చేయడం సంతోషకరం’ తోబుట్టువులు లేని లోటు తీరుస్తున్నారు మాకు తోబుట్టువులు లేని లోటును మీరు తీరుస్తున్నారు. ఒక కుమార్తెకు తండ్రిలా.. ఒక చెల్లెకు అన్నలా అండగా నిలుస్తున్నారు. మేం చేసిన రుణాలను మీరు తీరుస్తున్నారు. నాకు ఈ ఏడాది రూ.3,500 సున్నా వడ్డీ రాయితీ లభించింది. గత ఏడాది సున్నా వడ్డీని ప్రకటించి ఆదుకున్నారు. ఆనాడు మైక్రోఫైనాన్స్ కబంధ హస్తాల నుంచి వైఎస్సార్ మమ్మల్ని రక్షించారు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుడిలా ఆదుకుంటున్నారు. – పి.సాయిలీల, ప్రశాంతి మహిళా సంఘం, పుట్టపర్తి, అనంతపురం జిల్లా -
అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన 21 నెలల పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలిస్తూ అగ్ర తాంబూలం కల్పించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చే యడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వంగా నిరూపించారు. అ ధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నూరుశాతం అమలు చేశారు. తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించి, అడ్డంకు లు సృష్టించినప్పటికీ లక్షలాదిమంది మహిళలను లబ్ధిదారులగా గుర్తించడమే కాకుండా వారికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేశారు. 30.60 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాల రూపంలో ఏకంగా 23,535 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అప్పగించారు. ఇందుకోసం 68 వేల ఎకరాలకు పైగా సేకరించారు. మహిళలే కేంద్ర బిందువుగా ఐదు పథకాల ద్వారా 2019 జూన్ నుంచి ఈ ఏడా ది జనవరి వరకు 2,50,44,190 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.26,311.06 కోట్ల నగదు బదిలీ చేశారు. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోని విధంగా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకు జమచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం 21 నెలల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. హోంమంత్రి పదవి మహిళకు ఇచ్చి రక్షణలో మహిళలకు భరోసా కల్పించారు. తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ హోంమంత్రి పదవిని మహిళకు ఇచ్చా రు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు సీఎం జగన్ కూడా హోం మంత్రి పదవి మహిళకు ఇచ్చా రు. నామినేషన్ పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టాలు చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కింది. వైఎస్సార్ ఆసరా కింద 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న 14,204 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి, ఎన్నికల ప్రణాళికలో చేర్చి ఆ తర్వాత ఎగనామం పెట్టింది. అయితే జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తానని మాట ఇచ్చారు. తొలి విడతగా వైఎస్సార్ ఆసరా పేరిట 87,74,674 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల కు 6,792.21 కోట్ల రూపాయలను జమచేశారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఆర్థికంగా మరింత బలోపేతంచేసేందుకు వీలుగా ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో ప్రముఖ కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. మహిళలు స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకునే షాపులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత కింద రూ.4,604.13 కోట్లు వైఎస్సార్ చేయూత కింద 45–60 సంవత్సరాల మధ్య వయస్సున్న 24,55,534 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.4,604.13 కోట్లు జమ చేసింది. ఏటా 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆరి్థక సాయం అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఇప్పటికే రూ.4,604.13 కోట్లు మహిళల ఖాతాలకు జమ చేసింది. అమ్మ ఒడి కింద రూ.13,022.93 కోట్లు జమ పేదరికం కారణంగా తమ పిల్లలను చదివించకుం డా ఏ తల్లీ ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏటా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తున్నారు. రెండేళ్లలో 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ,13,022.93 కోట్లను జమ చేశారు. కాపునేస్తం కింద రూ.491.79 కోట్లు కాపుల్లో పేద మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం కింద ఏటా ఒక్కో మహిళకు రూ.15 వేలు ఇస్తారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో భరోసా ఇప్పటికే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్.. జగనన్న విద్యా దీవెన కింద 18,80,934 లక్షల మందికి రూ.4,101.08 కోట్లను చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటికే 15,56,956 మందికి రూ.1,220.99 కోట్ల నగదు జమ చేశారు. ఇక నుంచి ఈ సొమ్మును కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం నిర్ణయించారు. సున్నా వడ్డీ కింద రూ.1,400.08 కోట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకి కూడా మంగళం పలికింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు కొన్ని నెలల పాలనలోనే పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ నిధులను కూడా వారి ఖాతాలకు నేరుగా జమ చేశారు. పొదుపు సంఘాల్లోని 90,37,255 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.1,400.08 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసి మెరుగైన జీవనోపాధికి బాటలు వేసింది. మహిళలకు మహోన్నత దిశ ‘సంకల్పం మంచిదైతే.. మంచి ఫలితాలు అవే వస్తాయి’ అనే ఆర్యోక్తికి అచ్చంగా అతికినట్టుగా ‘దిశ’ సాధిస్తున్న అద్భుత ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క మహిళ, బాలిక ఇబ్బం ది పడకూడదనే మహోన్నత సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘దిశ’ ద్వారా వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే. తెలంగాణలో దిశ ఘటన గురించి తెలుసుకుని చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు, విద్యార్థినికి అటువంటి పరిస్థితి రాకూడదని దిశ చట్టం కోసం అసెంబ్లీలో 2019లో బిల్లును పెట్టి ఆమోదించారు. దానిపై కేంద్రం కొన్ని సూచనలు చేయడంతో ఏపీ దిశ చట్టం–2020 (కొత్త బిల్లు)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. పలు రాష్ట్రాలు దీని అమలుకు చర్యలు చేపట్టడం విశేషం. దిశ కార్యక్రమానికి ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. మహిళల చేతిలో విల్లు.. దిశ బిల్లు ► ‘దిశ’ కింద పలు కార్యక్రమాలను చేపట్టడంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం అందుతోంది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్‌శాఖ అనేక చ ర్యలు చేపట్టాయి. జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి అమలు జరుగుతోంది. బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. ► రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా హెల్ప్ కియోస్క్‌లు, 700 పోలీస్ స్టేషన్లలో ఉమెన్ స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు. దిశ పోలీస్ స్టేషన్లకు 18 దిశ ఇంటిగ్రేటెడ్ క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్ (కస్టమైజ్డ్ బస్‌లను) అందిం చారు. ఈ బస్సుల్లోని సాంకేతికతను తెలుసుకుని ప్రధాని మోదీ అభినందించారు. ► తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 11 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహిళా పోలీసులకు 900 పెట్రోలింగ్ వెహికల్స్ (ద్విచక్ర వాహనాలు) అందిస్తున్నారు. ► మహిళలు, విద్యార్థినులు వారి మొబైల్స్ ద్వారా స్కాన్ చేసుకునేలా జిల్లా కేంద్రాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో 50 దిశ సైబర్‌సేఫ్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అతివకు రక్షణ కవచం.. రాష్ట్రంలో మహిళలకు ‘దిశ’ పటిష్టమైన కవచంగా నిలుస్తోంది. దిశ కార్యక్రమం వల్ల మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గడం విశేషం. దిశ బిల్లులో ప్రస్తావించినట్టు ఏడు రోజుల్లోనే 561 కేసుల్లో, 15 రోజుల్లో 1,157 కేసుల్లో చార్జిషీట్ వేశారు. ఇప్పటివరకు 108 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళలను సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 1,194 మందిపై షీట్స్ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 2,02,805 మందిపై నిరంతరం నిఘా ఉంచారు. దిశ యాప్..సూపర్ దిశ కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ అందుబాటులోకి తెచ్చిన మొబైల్ యాప్ సూపర్ అని మహిళలు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో 12.57 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 1,17,275 మంది పోలీస్ సహాయం కోసం ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేశారు. నియామకాల్లో, సేవల్లో ఆమెకే పెద్దపీట రాష్ట్రంలో సేవల రంగంలో అతిపెద్ద శాఖగా వైద్య ఆరోగ్యశాఖకు పేరుంది. ఈ శాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేసింది. ఉద్యోగ నియామకాల నుంచి, లబ్ధిదారులకు సేవలు అందించడం వరకు ‘ఆమె’కే ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ చే యని విధంగా ఎక్కువమంది మహిళలను ఉద్యోగా ల్లో నియమించిన రికార్డు ఈ ఏడాదిన్నరలో సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వచ్చే మహిళా రోగులకు మెరుగైన సేవలు అందించ డంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిం దే. రకరకాల కోర్సులు చదివి ఏళ్ల తరబడి ఎలాంటి నియామకాలు లేక నిరుద్యోగులుగా ఉన్న వేల మంది మహిళలు ఉద్యోగావకాశాలు పొందారు. ఏడాదిన్నరలో మహిళలకు అండగా... ► ఒక్క ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో భాగంగా 13 వేలమంది ఏఎన్ఎంలను నియమించారు. ► అరకొర పారితోషికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆశా కార్యకర్త్తలకు ఒకేసారి రూ.10 వేల వేతనం చేసిన ఘనత ఈ సర్కారుదే. గతంలో వీరికి రూ.3 వేలే ఇచ్చేవారు. ► రాష్ట్రంలో 680 సివిల్ అసిస్టెంట్ పోస్టుల నియామకం జరిగితే, అందులో 300 మంది, బోధనాసుపత్రుల్లో 700 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరిగితే అందులో 330 మంది మహిళలున్నారు. ► గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లుగా ఇప్పటికే 1000 మంది నియమితులయ్యారు. త్వరలోనే మరో 5 వేల మందిని నియమించబోతున్నారు. ► మాతాశిశు సంరక్షణ కోసం ఎంఎస్ఎస్ యాప్‌ను రూపొందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రతి సీహెచ్‌సీలో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ► మహిళల కోసం అన్ని బోధనాసుపత్రుల్లో హైడె న్సిటీ డెలివరీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నా రు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చికిత్సల సంఖ్య పెంచడంతో ఎక్కువమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ► వేలాదిమంది అవ్వలు కంటివెలుగు కార్యక్ర మం ద్వారా చీకటి నుంచి కంటివెలుగు పొందా రు. మెడికల్, పారామెడికల్ కోర్సుల్లోను ఎక్కు వమంది మహిళల నియామకాలు జరిపారు. -
పేదలకు అండగా..
-
మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే
పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం నా కళ్లారా చూశాను. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. ఆ మేరకు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చిరునవ్వుతో భరిస్తూ ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ అమలు చేయబోతుందని చెప్పటానికి ఈ లేఖ రాస్తున్నాను. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు లేఖ రాస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. అన్ని సంఘాల ఖాతాల్లో ఒకే క్షణంలో డబ్బులు జమ ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి 24వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ఒక బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. ► 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతాయి. ఏ పొదుపు సంఘానికి వడ్డీ డబ్బులు ఎంత జమ చేసిందన్న వివరాలను సీఎం మహిళలకు రాసిన లేఖలో తెలియజేస్తారు. ► డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. అయితే 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిధులివ్వక పోవడంతో ఈ పథకం ఆగిపోయింది. స్వయం సహాయక సంçఘాల అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ స్వయం సహాయక సంఘ అక్కచెల్లెమ్మలకు.. గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ గ్రేడ్ సంఘాలు కూడా బీ, సీ, డీ గ్రేడులకు పడిపోయి.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలను నా 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేయబోతోంది. అంతే కాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన, నామినేషన్‌పై కాంట్రాక్టులు – నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ -
పొదుపు సంఘాల మహిళలచే.. మాస్క్‌ల తయారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్క్‌ల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పొదుపు సంఘాల మహిళలతో కుట్టించి తయారు చేయాలని నిర్ణయించింది. మాస్క్‌ల తయారీకి ఉపయోగించే క్లాత్‌ను ఆప్కో ద్వారా ప్రతి ప్రాంతానికి సరఫరా చేయనుంది. ఒక్కో మాస్క్‌కు రూ. 3 చొప్పున అందజేయనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే ఆప్కో ద్వారా జిల్లాల్లో పొదుపు సంఘాల్లోని మహిళా సభ్యులకు క్లాత్‌ను సరఫరా చేసే ప్రక్రియ మొదలు కాగా.. శనివారం సాయంత్రం సమయానికి కొన్ని జిల్లాలో ఈ మాస్క్‌లు అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ► రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పున మాస్క్‌ల పంపిణీకి దాదాపు 16 కోట్ల మాస్క్‌ల తయారీకి ప్రభుత్వం సిద్ధమైంది. ► గరిష్టంగా 9 నుంచి 10 రోజుల్లో 16 కోట్ల మాస్క్‌ల తయారీ పూర్తికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ► గ్రామీణ ప్రాంతంలో అందించే మాస్క్‌లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పర్యవేక్షణలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పొదుపు సంఘాల మహిళల ద్వారా.. పట్టణ ప్రాంతంలో ఉండే వారికి మెప్మా పర్యవేక్షణలో పట్టణ ప్రాంత పొదుపు సంఘాల మహిళల ద్వారా కుట్టించనున్నారు. ఇందుకోసం ఇప్పటికీ కుట్టు మిషన్‌లో శిక్షణ పొందిన మహిళలను గుర్తించారు. ► గ్రామీణ ప్రాంతంలోనే ప్రతి జిల్లా నుంచి 7 వేల నుంచి 10 వేల మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా శిక్షణ పొందిన మహిళలను గుర్తించే ప్రక్రియ జిల్లాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. ► మొదటి ఒకట్రెండు రోజు(శని, ఆదివారాలు)ల్లో సెర్ప్ ఆధ్వర్యంలో రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల నుంచి 60 లక్షలకు తక్కువ కాకుండా మాస్క్‌ల తయారీని, ఆ తర్వాత క్రమంగా ఈ సంఖ్య రోజుకు కోటికి పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► ఆప్కో సరఫరా చేసే క్లాత్‌ను మొదట.. ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతంలో మాస్క్‌ల తయారీకి ఉపయోగపడేలా కట్ చేసి, ఆ ముక్కలను పొదుపు సం ఘాల మహిళలకు సరఫరా చేస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే మాస్క్‌లకు ఉపయోగించే క్లాత్‌ను కట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 కటింగ్ మెషీన్ సెంటర్లను గుర్తించారు. తయారీలోనే ఎన్నో జాగ్రత్తలు మాస్క్ తయారీలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.అవి.. ► ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంటూ శిక్షణ పొందిన పొదుపు సంఘాల్లోని మహిళలను మాత్రమే మాస్క్‌ల తయారీకి ఎంపిక చేయాలి. ► మాస్క్‌లు కుట్టడానికి ఉపయోగించే మెషీన్లతో పాటు కత్తెర వంటి పరికరాలు, కుట్టడానికి ఉపయోగించే దారం వంటి వస్తువులను ప్రతిరోజూ పని ప్రారంభానికి ముందు శానిటైజ్ చేయాలి. ► పనివేళల్లో మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లను ధరించాలి. ► భౌతిక దూరం పాటించాలి. పరిసరాలను స్వచ్ఛతగా, శుభ్రంగా ఉంచాలి. ► అపరిశుభ్ర వస్తువులను అనుమతించకూడదు. ప్రకాశంలో వస్త్రం సేకరణ ఆప్కో నుంచి వస్త్రం సేకరణ పనులు ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది పట్టణ ప్రాంతాలకు 19,58,604 మాస్క్‌లు అవసరం అవుతాయని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కె.కృపారావు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 6,52,868 మంది ప్రజలు నివసిస్తుండగా, ఒక్కొక్కరికి మూడు మాస్క్‌ల ప్రాతిపదికగా మాస్క్‌ల తయారీకి లక్షా 95 వేల 860.4 మీటర్ల క్లాత్ అవసరం అవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. కాకినాడ్ ఎస్ఈజడ్లో పీపీఈ సూట్ల తయారీ తూర్పు గోదావరి జిల్లాలోనూ మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో కరోనా రక్షణ కవచాలు తయారవుతు న్నాయి. కాకినాడ ఎస్‌ఈజడ్‌లోని చైనా బొమ్మల తయారీ కేంద్రంలో మహిళలు పీపీఈ సూట్లను తయా రు చేస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కోసం మూలపేట తయారీ కేంద్రంలో దాదాపు రెండు లక్షల పీపీఈ సూట్లను సిద్ధం చేస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు హైదరాబాద్‌లు కలిపి మొత్తం 30 కేంద్రాల ద్వారా వీటిని సిద్ధం చేసి సరఫరా గ్రామీణ మహిళలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోవిడ్–19 ఆస్పత్రులకు ఈ కేంద్రాల ద్వారానే రక్షణ కవచాలు సమకూరుస్తు న్నారు. మొత్తంగా రోజుకు పది వేలకు పైగా కిట్లు, 40 వేలకు పైగా మాస్క్‌లు తయారు చేస్తున్నారు. ‘మహిళలకు ఉపాధి’ కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులకు పరో క్షంగా సేవ చేసే అవకాశం లభించిందని గీతా గార్మెంట్స్ ఎండీ పెన్మత్స గీత పేర్కొ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులకు ప్రతి రోజూ 10 వేలకు పైనే పీపీఈ కిట్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల మేరకు గ్రామాల్లో లేసులు అల్లే మహిళలతో మాస్క్‌లు, కిట్లు వేగంగా తయారు చేయిస్తున్నామని చెప్పారు. -
చేతివాటానికి చెక్!
తాండూరు : పొదుపు సంఘాలనూ అవినీతిపరులు వదలడం లేదు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహకరించేదిపోయి వారికి మంజూరైన నిధుల్లోంచి కమీషన్లు నొక్కేస్తున్న వైనం బయట పడింది. వేలు వందల్లో కాదు.. ఏకంగా ఈ కమీషన్లు రూ.లక్షల్లోకి చేరుకున్నాయి. జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో కొనసాగుతున్న మహిళా సంఘాలకు ఈ బెడద ఎక్కువగా ఉంది. మహిళా సంఘాల వ్యవహారాలు చూస్తున్న కొందరు రీసోర్స్ పర్సన్ (ఆర్పీ)లు కమీషన్లు దండుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ (అర్బన్ ఐకేపీ మెప్మా) వెంటనే నివారణ చర్యలు ప్రారంభించింది. బ్యాంకు లింకేజీ/ రుణాల మంజూరు వ్యవహారాల్లో ఆర్పీల ప్రమేయానికి చెక్ పెట్టింది. ఇక నుంచి ఆర్పీలతో సంబంధంలేకుండా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు మెప్మా అధికారులు లేఖలు రాశా రు. ఇకపై ఆర్పీలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. సంఘాల సభ్యు లు బ్యాంకుకు వెళ్లి అధికారులను కలవా ల్సి ఉంటుంది. సంఘాల సభ్యులు అందరూ వస్తేనే రుణాలు మంజూరు చేయాలని ఐకేపీ జిల్లా అధికారులు బ్యాంకులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అర్బన్‌లో 3,701 సంఘాలు.. జిల్లాలో ఐకేపీ అర్బన్ పరిధి కిందకు వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, మేడ్చల్, పెద్ద అంబ ర్‌పేట్ మున్సిపాలిటీలు వస్తాయి. ఈ ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 3,701 మహిళా పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి 1,201 సంఘాలు బ్యాంకు లింకేజీకి అర్హత సాధించాయి. వీరికి రూ.31.71 కోట్ల రుణాల లింకేజీ లక్ష్యం. ఇప్పటివరకు 195 సంఘాలకు రూ.5.51 కోట్ల బ్యాంకు లింకేజీ జరిగింది. ఇదీ ఆర్పీల పని.. కొత్త సంఘాల ఏర్పాటు, పొదుపు ఎలా చేయాలి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆర్పీలు పర్యవేక్షించాలి. రుణాల రికవరీ జరిగేలా చూస్తుండాలి. కానీ కొందరు ఆర్పీలు బ్యాంకు రుణాల మంజూరులో జోక్యం చేసుకుంటున్నా రు. తమకు అనుకూలమైన సంఘాల్లో ఒకరిద్దరు సభ్యులను వెంట బెట్టుకొని బ్యాంకు వెళుతున్నారు. సం ఘాలకు రుణాలు మంజూరు వ్యవహారాలన్నీ వీరే చక్కపెడుతున్నారు. ఇదంతా చేసినందుకు కొందరు ఆర్పీలు మంజూ రైన రుణ మొత్తంలో 5-10 శాతం మేరకు వాటాలు దండుకుంటున్నారని తెలుస్తోంది. రూ.కోట్లలో జరుగుతున్న రుణా ల లింకేజీలో వాటాల పర్వం రూ. లక్షల్లో జరుగుతున్నట్టు సమాచారం. సదరు ఆర్పీల వల్లనే రుణాలు మంజూ రవుతున్నట్టు భావిస్తున్న సంఘాల సభ్యులు వాటాలు సమర్పించుకుంటూ నష్టపోతున్నారు. కొత్తగా సంఘం ఏర్పాటు చేసుకొనే మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ వ్యవహారాలు అధికంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వాటాల వ్యవహారం రుణాల రికవరీ మీద ప్రభావం పడుతుంది. వాటాలు మినహా మిగతా రుణ డబ్బులు చెల్లిస్తామని సంఘాలు చెబుతున్నాయని, ఎం దుకని అడిగితే ముందే ఆర్పీలకు డబ్బు కట్టామని పలు సంఘాల సభ్యులు చెబుతున్నారని బ్యాంకు అధికారి చెప్పారు. అవకతవకలను అరికట్టేందుకే.. సంఘాల ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను అరికట్టేందుకు బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరులో ఆర్పీల ప్రమేయం లేకుండా చేస్తున్నాం. ఈ మేరకు మెప్మా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ ఇటీవల బ్యాంకులకు లేఖలు రాశారు. కొందరు ఆర్పీలు రుణాల మంజూరు చేయించినందుకు డబ్బులు తీసుకోవడం వల్ల సంఘాల సభ్యులు నష్టపోతున్నారు. నిజాయితీగా పొదుపు చేసిన సంఘాలకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటాల వ్యవహారాలను పూర్తిగా నిర్మూలించి సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - ఏపీడీ బ్రహ్మయ్య -
ఇస్తారా.. ఇవ్వరా?
రాయదుర్గం : రెండేళ్లుగా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటాన్ని నిరసిస్తూ పొదుపు సంఘాల మహిళలు స్టేట్ బ్యాంకును ముట్టడించారు. గుమ్మఘట్ట మండలం గలగల, గొల్లపల్లి, జాలివంక, 75 వీరాపురం, సిరిగేదొడ్డి, రాయదుర్గం మండలం రాయంపల్లి, బీఎన్ హళ్లికి చెందిన పొదుపు సంఘాల మహిళలు సుమారు 200 మంది మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2.30 వరకు బ్యాంకు ప్రధాన ద్వారానికి తాళం వేసి బైఠారుుంచారు. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించినా, తిరిగి కొత్త రుణాలు ఇవ్వలేదని సంఘాల లీడర్లు శాంతి, అంబిక, శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రుణాల కోసం రెండేళ్లుగా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. కొంత సొమ్ము నిల్వ వుంటే రుణాలిస్తామనడంతో అప్పులు చేసి, మరికొంత మంది మంగళ సూత్రాలు తాకట్టు పెట్టి రూ.50 వేల వరకు ఖాతాలో వేశామన్నారు. అలా వేసి సంవత్సరం దాటినా రుణాలు ఇవ్వకుండా వేధించడమేంటని ప్రశ్నించారు. ఫీల్డ్ ఆఫీసర్ అంజాద్ ఖాన్‌కు మహిళలంటే గౌరవం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సేపటి తర్వాత మేనేజర్ ప్రసాద్.. వెలుగు సిబ్బంది, ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఫీల్డ్ ఆఫీసర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రుణాల కోసం ఇచ్చిన 45 డాక్యుమెంట్లను బుట్టదాఖలు చేశారని వెలుగు సిబ్బంది సైతం మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల మహిళలు రూ.1.50 కోట్లు నష్టపోయారన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించిన సంఘాల జాబితా సిద్ధం చేసి ఇస్తే రుణాలిస్తామని మేనేజర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
వాగ్దాన భంగం దెబ్బకు డ్వాక్రా ఢమాల్!
-
వాగ్దాన భంగం దెబ్బకు డ్వాక్రా ఢమాల్!
* చంద్రబాబు హామీలతో కుదేలైన పొదుపు సంఘాలు * సగానికి సగం పడిపోయిన సభ్యుల పొదుపు.. బ్యాంకు లోన్లూ లేవు * సంఘాల సమావేశాలకే దూరమైన మహిళలు * తొలుత రుణ మాఫీ హామీ, తర్వాత కార్పస్ ఫండ్ అంటూ మాట మార్పు * తాజాగా ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు ఇచ్చే యోచన.. ఇప్పటికి రూపాయి కూడా అందని సాయం * పొదుపు ఖాతాల్లోని సొమ్ముతో పాటు దాదాపు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కూడా జమ * లబోదిబోమంటున్న మహిళలు.. ఇసుక రీచ్‌ల పేరిటా సర్కారు దగా సాక్షి, హైదరాబాద్: అమలుకు నోచని చంద్రబాబునాయుడు హామీలతో అన్నదాతలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలూ దారుణంగా మోసపోయారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన సుమారు రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ హామీపై.. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చారు. కార్పస్ ఫండ్ ఇస్తామన్నారు. ఇప్పుడు మంత్రులు సభ్యురాలికి రూ.10 వేల చొప్పున సాయం అంటున్నారు. ఇప్పటికి మహిళలకు రూపాయి కూడా అందలేదు. రాష్ట్రంలో పదిహేనేళ్ల పాటు ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న డ్వాక్రా వ్యవస్థ కేవలం ఆరు నెలల్లోనే కకావికలమైపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 6,64,723 సంఘాల్లో సుమారు 6.5 లక్షల సంఘాల పనితీరు గణనీయంగా మందగించింది. కేవలం 708 సంఘాలే ‘ఏ’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. మహిళల్లో విప్లవం మాదిరి వెల్లివిరిసిన పొదుపు చైతన్యం ఒక్కసారిగా చతికిలపడిపోయింది. సభ్యుల పొదుపు సగానికి సగం పడిపోయింది. వారానికో, నెలకొకసారో తప్పనిసరిగా సంఘాల వారీగా సమావే శమయ్యే సభ్యులు అటువైపే వెళ్లడం లేదు. దీంతో మహిళల పొదుపు విషయంలోనూ, వారికి రుణాలు అందడంలోనూ ఒకనాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో.. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6,64,723 వరకు పొదుపు సంఘాలుండగా, ఆరు నెలల కిందటి వరకు అందులో 5 లక్షల వరకు సంఘా లు బాగా పనిచేసే ఏ గ్రేడ్ (సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వమే సంఘాలకు గ్రేడ్లు ఇస్తుంది)లో ఉండేవి. కానీ నవంబర్ నెల గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుత పొదుపు సంఘాల దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. 6,64,723 సంఘాల్లో కేవలం 708 సంఘాలు మాత్రమే ‘ఏ’ గ్రేడ్ కిందకు వచ్చాయి. రెండో కేటగిరీలో మరో 29,850 సంఘాలు ఉంటే.. మిగిలిన దాదాపు 6.3 లక్షల సంఘాలు సీ, డీ కేటగిరీలో ఉన్నాయి. క్రమం తప్పకుండా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడం, సభ్యుల హాజరు, పొదుపు తీరు, సంఘాలు అంతర్గతంగా, బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను సకాలం చెల్లించడం వంటి 11 అంశాల ఆధారంగా సెర్ప్ అధికారులు సంఘాలకు గ్రేడ్లను ఇస్తుంటారు. మహిళలు తాము తీసుకున్న రుణాలను బాబు హామీలను నమ్మి తిరిగి బ్యాంకులకు చెల్లించకపోవడంతో.. అవి డ్వాక్రా గ్రూపులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఇచ్చిన రుణాల బకాయిలు చెల్లించాలని ఒత్తిడిచేస్తున్నాయి. పొదుపు ఖాతాల్లోని నిధులతో పాటు, కార్పస్ ఫండ్‌ను బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. కార్పస్ ఫండ్‌కూ ఎసరు ఆగస్టు రెండో పక్షంలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నివేదిక సమర్పిస్తూ.. అప్పటివరకు రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల పేరిట రూ.4,025 కోట్ల కార్పస్ ఫండ్ (సంచిత నిధి) ఉందని పేర్కొన్నారు. (సభ్యులు చేసుకున్న పొదుపు మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ, సంఘాలకు ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఇచ్చే మొత్తం కలిపి కార్పస్ ఫండ్‌గా పిలుస్తారు) మంత్రి అసెంబ్లీకి నివేదిక సమర్పించిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో డ్వాక్రా మహిళలు ప్రతి నెలా రూ.30 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు. ఆ మేరకు రూ.4,100 కోట్లకు పైగా పెరగాల్సిన కార్పస్ ఫండ్ విచిత్రంగా తరిగిపోయిం ది. నవంబర్ 15వ తేదీ నాటికి రూ.4,022 కోట్ల కార్పస్ ఫండ్ మాత్రమే ఉందని సెర్ప్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు వంద కోట్ల కార్పస్ ఫండ్‌ను బ్యాంకులు బకాయిలు కింద జమ చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఇసుక వ్యాపారం మహిళలది.. లాభం ప్రభుత్వానిది! డ్వాక్రా రుణాలు మాఫీ చేయని ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను ఆ సంఘాలకు అప్పగించినట్టు చెప్పుకుంటోంది. వారి ఆధ్వర్యంలోనే అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ మహిళలకు చిల్లర మాత్రమే దక్కుతోంది. రాష్ట్రంలో రూ.42 కోట్ల విలువైన ఆరున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగగా, వ్యాపారం చేసిన డ్వాక్రా సంఘాలకు దక్కుతున్నది రూ.20 లక్షలు మాత్రమే. రూ.42 కోట్ల లో ఖర్చులు పోను ప్రభుత్వానికి సుమారు రూ.30 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి క్యూబిక్ మీటరు ఇసుక అమ్మకంపై మహిళలకు మూడు రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. చంద్రబాబు కప్పదాట్లు ఇలా.. 2014 మార్చి 30: టీడీపీ అధినేతగా చంద్రబాబు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. ‘ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు. 2014 జూన్ 8: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా రైతు, చేనేత రుణాలతో పాటు డ్వాక్రా రుణాలు మాఫీకి ఉద్దేశించిన ఫైలుపై తొలి సంతకం. 2014 జూలై 21: రాష్ట్ర రెండవ మంత్రివర్గ సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా గ్రూపు రుణాలు మాఫీకి బదులు ప్రతి గ్రూపునకు లక్ష రూపాయల చొప్పన ఆయా సంఘాల కార్పస్ ఫండ్‌కు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. (ఇప్పుడు మంత్రు లు చెబుతున్న దాన్నిబట్టి ప్రతి డ్వాక్రా గ్రూపునకు లక్ష రూపాయల సాయానికి బదులు, సంఘం లో ప్రతి సభ్యునికి పది వేలు సాయంగా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే సంఘం లో పది మంది సభ్యులుంటే లక్ష, 8 మందే సభ్యులుంటే రూ.80 వేలే చెల్లిస్తారన్నమాట) తాజా పరిస్థితి: చంద్రబాబు అధికారం చేపట్టి రేపోమాపో ఆరు నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా చెప్పినా.. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూపాయి సాయం కూడా అందలేదు. బ్యాంకుల్లో మర్యాద పోయింది.. మీ బాధలు గమనిస్తున్నా. కష్టాల్లో తోడుంటామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటల గారడీ చేశారు. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ఇంతకుముందు బ్యాంకుకు వెళితే మర్యాదగా చూసేవారు. హామీ నమ్మి బ్యాంకుల్లో విశ్వాసం కోల్పోయాం. - జయశీల, గృహిణి, విజయవాడ