పొదుపు సంఘాల మహిళలచే.. మాస్క్‌ల తయారీ | Savings associations womens making mask from April 18 in AP | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాల మహిళలచే.. మాస్క్‌ల తయారీ

Published Sat, Apr 18 2020 3:41 AM | Last Updated on Sat, Apr 18 2020 3:41 AM

Savings associations womens making mask from April 18 in AP - Sakshi

తూర్పు గోదావరి జిల్లా గుడిమూలలోని లేసు పార్కులో పీపీఈ కిట్లు తయారు చేస్తున్న మహిళలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్క్‌ల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పొదుపు సంఘాల మహిళలతో కుట్టించి తయారు చేయాలని నిర్ణయించింది. మాస్క్‌ల తయారీకి ఉపయోగించే క్లాత్‌ను ఆప్కో ద్వారా ప్రతి ప్రాంతానికి సరఫరా చేయనుంది. ఒక్కో మాస్క్‌కు రూ. 3 చొప్పున అందజేయనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే ఆప్కో ద్వారా జిల్లాల్లో పొదుపు సంఘాల్లోని మహిళా సభ్యులకు క్లాత్‌ను సరఫరా చేసే ప్రక్రియ మొదలు కాగా.. శనివారం సాయంత్రం సమయానికి కొన్ని జిల్లాలో ఈ మాస్క్‌లు అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. 

► రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడేసి చొప్పున మాస్క్‌ల పంపిణీకి దాదాపు 16 కోట్ల మాస్క్‌ల తయారీకి ప్రభుత్వం సిద్ధమైంది. 
► గరిష్టంగా 9 నుంచి 10 రోజుల్లో 16 కోట్ల మాస్క్‌ల తయారీ పూర్తికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 
► గ్రామీణ ప్రాంతంలో అందించే మాస్క్‌లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పర్యవేక్షణలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పొదుపు సంఘాల మహిళల ద్వారా.. పట్టణ ప్రాంతంలో ఉండే వారికి మెప్మా పర్యవేక్షణలో పట్టణ ప్రాంత పొదుపు సంఘాల మహిళల ద్వారా కుట్టించనున్నారు. ఇందుకోసం ఇప్పటికీ కుట్టు మిషన్‌లో శిక్షణ పొందిన మహిళలను గుర్తించారు. 
► గ్రామీణ ప్రాంతంలోనే ప్రతి జిల్లా నుంచి 7 వేల నుంచి 10 వేల మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా శిక్షణ పొందిన మహిళలను గుర్తించే ప్రక్రియ జిల్లాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. 
► మొదటి ఒకట్రెండు రోజు(శని, ఆదివారాలు)ల్లో సెర్ప్‌ ఆధ్వర్యంలో రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల నుంచి 60 లక్షలకు తక్కువ కాకుండా మాస్క్‌ల తయారీని, ఆ తర్వాత క్రమంగా ఈ సంఖ్య రోజుకు కోటికి పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
► ఆప్కో సరఫరా చేసే క్లాత్‌ను మొదట.. ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతంలో మాస్క్‌ల తయారీకి ఉపయోగపడేలా కట్‌ చేసి, ఆ ముక్కలను పొదుపు సం ఘాల మహిళలకు సరఫరా చేస్తారు.
► గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే మాస్క్‌లకు ఉపయోగించే క్లాత్‌ను కట్‌ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 కటింగ్‌ మెషీన్‌ సెంటర్లను గుర్తించారు. 

తయారీలోనే ఎన్నో జాగ్రత్తలు
మాస్క్‌ తయారీలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.అవి..
► ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంటూ శిక్షణ పొందిన పొదుపు సంఘాల్లోని మహిళలను మాత్రమే మాస్క్‌ల తయారీకి ఎంపిక చేయాలి.
► మాస్క్‌లు కుట్టడానికి ఉపయోగించే మెషీన్లతో పాటు కత్తెర వంటి పరికరాలు, కుట్టడానికి ఉపయోగించే దారం వంటి వస్తువులను ప్రతిరోజూ పని ప్రారంభానికి ముందు శానిటైజ్‌ చేయాలి. 
► పనివేళల్లో మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లను ధరించాలి.
► భౌతిక దూరం పాటించాలి. పరిసరాలను స్వచ్ఛతగా, శుభ్రంగా ఉంచాలి. 
► అపరిశుభ్ర వస్తువులను అనుమతించకూడదు.

ప్రకాశంలో వస్త్రం సేకరణ 
ఆప్కో నుంచి వస్త్రం సేకరణ పనులు ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది పట్టణ ప్రాంతాలకు 19,58,604 మాస్క్‌లు అవసరం అవుతాయని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.కృపారావు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 6,52,868 మంది ప్రజలు నివసిస్తుండగా, ఒక్కొక్కరికి మూడు మాస్క్‌ల ప్రాతిపదికగా మాస్క్‌ల తయారీకి లక్షా 95 వేల 860.4 మీటర్ల క్లాత్‌ అవసరం అవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. 

కాకినాడ్‌ ఎస్‌ఈజడ్‌లో పీపీఈ సూట్ల తయారీ
తూర్పు గోదావరి జిల్లాలోనూ మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో కరోనా రక్షణ కవచాలు తయారవుతు న్నాయి. కాకినాడ ఎస్‌ఈజడ్‌లోని చైనా బొమ్మల తయారీ కేంద్రంలో మహిళలు పీపీఈ సూట్లను తయా రు చేస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కోసం మూలపేట తయారీ కేంద్రంలో దాదాపు రెండు లక్షల పీపీఈ సూట్లను సిద్ధం చేస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు హైదరాబాద్‌లు కలిపి మొత్తం 30 కేంద్రాల ద్వారా వీటిని సిద్ధం చేసి సరఫరా గ్రామీణ మహిళలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోవిడ్‌–19 ఆస్పత్రులకు ఈ కేంద్రాల ద్వారానే రక్షణ కవచాలు సమకూరుస్తు న్నారు. మొత్తంగా రోజుకు పది వేలకు పైగా కిట్లు, 40 వేలకు పైగా మాస్క్‌లు తయారు చేస్తున్నారు.

‘మహిళలకు ఉపాధి’ 
కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులకు పరో క్షంగా సేవ చేసే అవకాశం లభించిందని గీతా గార్మెంట్స్‌ ఎండీ పెన్మత్స గీత పేర్కొ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులకు ప్రతి రోజూ 10 వేలకు పైనే పీపీఈ కిట్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల మేరకు గ్రామాల్లో లేసులు 
అల్లే మహిళలతో మాస్క్‌లు, కిట్లు వేగంగా తయారు చేయిస్తున్నామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement