వరద ముంపు ప్రాంతాల్లోని ‘పొదుపు’ సభ్యులకు కార్పొరేషన్ సిబ్బంది హెచ్చరికలు
పటమట(విజయవాడ తూర్పు): మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది బుడమేరు వరద ముంపు ప్రాంతంలోని స్వయం సహాయ సంఘాల సభ్యుల పరిస్థితి. బుడమేరు వరద వల్ల ఇళ్లు మునిగి సర్వం కోల్పోయి వారం రోజుల నుంచి కట్టుబట్టలతో అల్లాడుతున్నవారిని ఆదుకోవాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ సాధికారిక విభాగం అధికారులు... మానవత్వాన్ని మరిచి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరి బురదను శుభ్రం చేసుకుంటున్న వారి వద్దకు సిబ్బందిని పంపి ‘పదో తేదీ వస్తోంది పొదుపు రుణం కిస్తీ కట్టండి... లేకపోతే వడ్డీ పెరుగుతుంది.
తర్వాత ఇబ్బందిపడతారు...’ అని హెచ్చరించడంపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘అనేక సంవత్సరాలుగా పని చేసి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్లన్నీ నాశనమైపోయాయి. ఇప్పుడు తినడానికి తిండికి కూడా లేకుండా అల్లాడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. దాతలు ఇచ్చే పులిహోర పొట్లాలు తిని బతుకుతున్నాం. బురదనీటిలోనే బతుకీడుస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బుక్ కీపర్లు వచ్చి కిస్తీ కట్టాలని చెప్పడం దారుణం. వారికి మనసెలా వచి్చందో అర్థం కావడం లేదు..’ అంటూ అజిత్‌సింగ్‌నగర్ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు మండిపడుతున్నారు. వెంటనే పొదుపు రుణాల చెల్లింపులను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు.
1.50లక్షల మందిపై ప్రభావం
⇒ విజయవాడలోని మూడు సర్కిళ్ల పరిధిలో సుమారు 12వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు.
⇒ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సర్కిల్–1, సర్కిల్–2 పరిధిలోని విద్యాధరపురం, భవానీపురం, చిట్టినగర్, పాత ఆర్‌ఆర్‌పేట, కొత్త ఆర్‌ఆర్‌పేట, కొత్తపేట, అజిత్‌సింగ్‌నగర్, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరినగర్, ఇందిరానాయక్‌నగర్, పాయకాపురం, పైపులరోడ్డు, వాంబేకాలనీ, ఎల్‌బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 8వేల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 1.50లక్షల మంది సభ్యులు పొదుపు రుణాలు పొందారు.
⇒ఒక్కో సంఘం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణాలు పొందాయి. ఆయా సంఘాల సభ్యులు రెండు నెలల నుంచి 15 నెలల వరకు వాయిదాలు చెల్లించారు.
⇒ఇప్పటి వరకు తాము తీసుకున్న రుణాలతో చిరువ్యాపారాలు, చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ప్రతి నెల పదో తేదీలోపు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కిస్తీలను పక్కాగా చెల్లిస్తున్నారు.
⇒ప్రస్తుతం ఆకస్మిక వరద వల్ల పనిలేక, ఉన్న వస్తువులన్నీ పాడైపోయి అల్లాడుతున్నారు. వీరు తేరుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది.
మేం ఇప్పుడు కట్టలేం
మా పరిస్థితి చూశారుగా... ఇళ్లన్నీ మునిగిపోయాయి. సామాన్లు కొట్టుకుపోయాయి. ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు వచ్చి పొదుపు రుణం కిస్తీ చెల్లించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం కట్టలేం... కట్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి. మాలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి అప్పు కట్టమనడం ఎంతవరకు న్యాయం? మేం మళ్లీ మా పాత రోజువారీ జీవితానికి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. అప్పటి వరకు మేం రుణాలు కట్టలేం. ప్రభుత్వం మాకు కొత్త రుణాలు ఇవ్వాలి. ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – మీనాక్షి, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ
బాధితులనే విరాళాలు అడుగుతారా?
ఇప్పటి వరకు వాహనాలు, ఎల్రక్టానిక్ వస్తువుల బీమాపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పొదుపు సంఘాల పరిస్థితిని అసలు పట్టించుకోవడం లేదు. పైగా కిస్తీలు కట్టండి... పొదుపు సంఘాలు కూడా విరాళాలు ఇవ్వండి... అని చెబుతున్నారు. మేమే బాధితులమైతే మేం ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలా..? ఇదెక్కడి విడ్డూరం? మాపై ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా రుణాలు మాఫీ చేయాలి. సున్నా వడ్డీకి కొత్త రుణం అందించాలి. – సునీత, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment