ఈమె పేరు నగీనా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి సొంతూరు. శ్రీవాణి స్వయం సహాయక పొదుపు సంఘం సభ్యురాలు. అంతకు ముందు కుటుంబ పోషణ ఎలా అని మథనపడ్డ ఈమె ఐదు నెలల క్రితం గ్రామంలోని రైలుగేట్ వద్ద ఫ్యాన్సీ, చెప్పుల దుకాణం ప్రారంభించింది. ప్రస్తుతం ఇంటి ఖర్చులు పోను నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించే చిట్టీలో సభ్యురాలిగా చేరింది.
(కృష్ణా జిల్లా బాపులపాడు, వీరవల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి మేడికొండ కోటిరెడ్డి) : రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్థిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. ఇంకొక 31,04,314 మంది పేదింటి ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల చొప్పున ఏటా రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే పెరిగింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై ఒక సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులతో పాటు గత నాలుగేళ్ల కాలంలో పొదుపు సంఘాల మహిళ ఆదాయాలు పెరిగిన తీరును సేకరించింది.
పొదుపు కార్యక్రమాలలో క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే మండల కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో అన్ని చోట్ల గ్రామ సమాఖ్య సహాయకులు – వీవోఏల ద్వారా గత 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల ఆదాయ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 89.29 లక్షల పొదుపు సంఘాల మహిళలకు గాను 84.90 లక్షల మంది వివరాలు సేకరించగా, అందులో 54 శాతం మంది ఆదాయం ఏటా రూ.60 వేలకు పైగా పెరిగింది. మరో 39 శాతం మంది ఆదాయం కూడా రూ.రెండు వేల నుంచి ఐదు వేల మధ్య పెరిగినట్టు తేలింది.
ఆచరణలో మహిళా సాధికారత
► వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత అన్నది కేవలం ఒక నినాదంగా కాకుండా, ఒక లక్ష్యంగా అమలుకు పూనుకుంది. దీంతో పేదల ఇళ్లలో సిరులు కనిపిస్తున్నాయి. మహిళా సాధికారిత సాధన కోసం ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటిస్తూ క్రమతప్పకుండా వాటిని అమలు చేస్తూ వస్తోంది.
► ప్రత్యేకించి రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది మహిళలకు సంబంధించి 7.96 లక్షల పొదుపు సంఘాల పేరిట గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఉన్న రూ.25,571 కోట్ల అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆయా మహిళలకు చెల్లించే కార్యక్రమాన్ని చేపట్టింది.
► దాదాపు 7.96 లక్షల పొదుపు సంఘాలు సరాసరి రూ.3.21 లక్షల చొప్పున ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. దీనికితోడు, బ్యాంకుల నుంచి మహిళలు తీసుకున్న ‘పొదుపు’ రుణాలపై వడ్డీ భారాన్ని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తోంది.
► ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు నగదు రూపంలో (డీబీటీ) 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2.31 లక్షల కోట్లను అందజేసింది. పొదుపు సంఘాల మహిళల్లో అత్యధికులకు తద్వారా లబ్ధి చేకూరింది. ఇందులో కేవలం మహిళా లబ్ధిదారులకే రూ.1.64 లక్షల కోట్లు చేరాయి.
► వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా మహిళలకు చేరిన డబ్బులను అసక్తి ఉన్న వారు నెల వారీ స్థిర ఆదాయం వచ్చే జీవనోపాధి మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకుంటే వారికి తగిన ‘చేయూత’ అందజేసేలా ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీలు ఐటీసీ, హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, రిలయెన్స్, అమూల్ వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కొత్తగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వారికి అవసరమైతే అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలోనూ ప్రభుత్వం తోడ్పడింది.
సంక్షేమ కార్యక్రమాలతో పేదల ఇంట సిరులు
జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ తదితర మొత్తం 28 రకాల సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధిని మెజారిటీ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాల మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల ఆదాయ వివరాల సేకరణ సమయంలో ఈ విషయం నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అందజేసిన లబ్ధిని ఉపయోగించుకొని కొందరు తమ తమ ఊళ్లలో చిరు వ్యాపారాలు మొదలు పెద్ద దుకాణాల వరకు ఏర్పాటు చేసుకున్నారు.
గతంలో కేవలం కూలి పనుల మీద ఆధారపడే బతికే వారిలో చాలా మంది కొత్తగా పాడిగేదెలు, అవులు, మేకలు వంటివి కొనుగోలు చేసుకొని స్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నారు. అన్నింటికీ మించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు ఇలా ప్రతి అవసరానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం తగ్గిపొయింది. పాత అప్పులు కూడా తీర్చేశారు. తద్వారా ఏటా రూ.25 వేల నుంచి రూ.40 వేల దాక కట్టే వడ్డీల బెడద తగ్గిపోయిందని సర్వే సమయంలో మహిళలు అభిప్రాయపడ్డారు.
ఎన్‌ఐఆర్‌డీ ద్వారా అధ్యయనం
పొదుపు సంఘాల మహిళల ఆదాయాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ద్వారా సర్వే చేసిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి సమగ్ర విశ్లేషణకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనంలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ) ద్వారా అధ్యయనం చేయించేందుకు పూనుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ఎన్‌ఐఆర్‌డీ మధ్య ప్రాథమికంగా ఒక అవగాహన ఒప్పందం పూర్తయింది. ఈ అధ్యయనం కార్యక్రమం మొదలు కావాల్సి ఉందని సెర్ప్ అధికారులు వెల్లడించారు.
నెల వారీ స్థిర ఆదాయం
బాపులపాడు మండలంలోని వీరవల్లికి పక్కనే ఉండే కొడూరుపాడు గ్రామం శివారు ఉమామహేశ్వరపురానికి చెందిన రెడ్డి నాగరాణికి సొంతంగా వ్యవసాయ భూములు లేకపోయినా, కౌలు భూములు సాగు చేసుకుంటోంది. కౌలుదారు కార్డుతో ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకంలో లబ్ధి పొందింది. గ్రామంలో పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఈమె తన రెక్కల కష్టంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నెలా వారీ ఆదాయం మూడు రెట్లకు పైగా పెంచుకుంది.
మొదటి నుంచి పాడి గేదెల వృత్తిగా కొనసాగుతున్న ఆ కుటుంబం మూడేళ్ల కిత్రం వరకు ప్రతి 15 రోజులకు రూ.6 వేల నుంచి రూ.7 వేల ఆదాయం పొందుతుండేది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ఈమె కుటుంబం ఇప్పుడు 11 అవులను పోషిస్తోంది. రోజూ 40 లీటర్ల పాలు కేంద్రానికి పోస్తూ ప్రతి 15 రోజులకు రూ.20 వేల ఆదాయం పొందుతోంది. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పాలకు లీటరుకు అదనంగా నాలుగు రూపాయలు ప్రయోజనం చేకూరిందని ఈమె కుటుంబం సంబరపడుతోంది.
సొంత కాళ్లపై నిలదొక్కుకున్న సభ్యులు
బాపులపాడు మండల కేంద్రంలో ఓం గణపతి స్వయం సహాయక పొదుపు సంఘం పది మంది సభ్యులతో 2007లో ఏర్పాటైంది. వీరు ప్రతి నెలా కొద్ది మొత్తం చొప్పున ఇప్పటి వరకు రూ.2.53 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ సంఘానికి వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.2.12 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. వారు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించి ఆ మహిళలు ఈ నాలుగేళ్ల కాలంలో చెల్లించాల్సిన వడ్డీకి సంబంధించి మరో రూ.41 వేలు మూడు విడతల్లో అందించింది.
ఆ సంఘంలో సభ్యులు అమ్మఒడి, వైఎస్సార్ దీవెన, కాపు నేస్తం, రైతు భరోసా.. ఇలా వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. ఈ సంఘంలో సభ్యురాలిగా ఉండే చోడిశెట్టి లక్ష్మీ కుటుంబం వ్యాపారం నిర్వహించే అద్దె షాపును పది నెలల కిత్రం కొనుగోలు చేసింది. ఇదే సంఘంలో సభ్యురాలిగా ఉండే కుర్ర అనూష కుటుంబం మూడేళ్ల కిత్రం వరకు అద్దె ఇంటిలో ఉండి, ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుగోలు చేసింది. ఇంకో సభ్యురాలి కుటుంబం కొత్తగా వ్యాను కొనుగోలు చేసింది. గతంలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే ఆమె భర్త ఇప్పుడు వ్యాను యజమాని అయ్యారు.
బాపులపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరికపాటి హేమలత.. వెన్నల స్వయం సహాయక పొదుపు సంఘ సభ్యురాలు. వీళ్ల ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే వీరవల్లిలో గత ఏడాది డిసెంబర్‌లో జనరల్ స్టోర్ ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఆమెకు అలాంటి వ్యాపారం నడపాలన్న ఆలోచనే లేదు. కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమై గృహిణిగా కొనసాగుతుండేది. భర్త అక్కడికి దగ్గరలో ఉండే స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న తోడ్పాటుతో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment