‘చేయూత’ పండుగ | CM YS Jagan Comments On YSR Cheyutha Scheme | Sakshi
Sakshi News home page

‘చేయూత’ పండుగ

Published Fri, Mar 8 2024 4:36 AM | Last Updated on Fri, Mar 8 2024 2:59 PM

CM YS Jagan Comments On YSR Cheyutha Scheme - Sakshi

అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన ‘వైఎస్సార్‌ చేయూత’ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

మహిళా దినోత్సవ వేళ అక్కచెల్లెమ్మలకు సాయాన్ని అందించడం 

ఎంతో సంతోషాన్నిస్తోంది: అనకాపల్లి సభలో సీఎం వైఎస్‌ జగన్‌

నాడు 18.36% ఎన్‌పీఏలతో ఛిన్నాభిన్నమైన పొదుపు సంఘాలకు మనం ఊపిరి పోశాం

నేడు 99.83 శాతం రికవరీతో మన సంఘాలు దేశంలోనే నంబర్‌ 1

చంద్రబాబు, దత్తపుత్రుడు మేనిఫెస్టోతో మరోసారి మోసాలకు తయారు

2014లో 8 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దారుణంగా మోసగించారు

ఉమెన్  ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ తెస్తామంటూ.. కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్స్‌ తెచ్చారు

వారి పేరు చెబితే మోసాలు.. మన ప్రభుత్వాన్ని తలచుకుంటే సంక్షేమం గుర్తొస్తాయి

నాడు – నేడు పాలనలో వ్యత్యాసానికి పదేళ్ల మీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లే తిరుగులేని సాక్ష్యం

వైఎస్సార్‌ చేయూతతో 26,98,931 మంది లబ్ధిదారులకు రూ.5,060.49 కోట్లు సాయం

మాట నిలబెట్టుకుంటూ నాలుగో విడత సాయాన్ని జమ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

14 రోజుల పాటు పండుగ వాతావరణంలో ‘చేయూత’ కార్యక్రమాలు 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మనందరి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళా దినోత్సవం ముందు రోజు ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదన్నారు. 45 – 60 ఏళ్ల వయసున్న మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయం అందించే వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అనకాపల్లి జిల్లాలోనే నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ ఆర్థిక సాయంతో ఎదిగిన మహిళలంతా తమ విజయగాథలను వివరిస్తూ రానున్న 14 రోజుల పాటు సచివాలయాలవారీగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు గతంలో మేనిఫెస్టోలో అక్కా­చెల్లెమ్మలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మండిపడ్డారు. వారి పేరు చెబితే 8 రకాల మోసాలు, దగా గుర్తురాగా మన ప్రభుత్వం పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబును చూస్తే విశ్వసనీయతలేమి గుర్తుకొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం తెచ్చేలా కార్లను మార్చినట్లు భార్యలను మార్చే వ్యవహారం గుర్తుకొస్తుందని విమర్శించారు.

వారిని నమ్మితే కాటేసే పాముని నమ్మినట్టేనని, తినేసే పులి­ని ఇంటిని తెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన మీ బిడ్డకు మీరే స్టార్‌ క్యాంపైనర్లుగా నిలిచి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వైఎస్సార్‌ చేయూత నా­లుగో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సా­యాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే.. 

14 రోజులు పండుగ వాతావరణంలో.. 
మహిళా సాధికారతకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించే వైఎస్సార్‌ చేయూతలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకుంటారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి? అనే స్ఫూర్తిదాయక కధనాలను ప్రతి సచివాలయం, ప్రతి మండలంలో చర్చించుకునేలా తెలియచేయా­లని ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ కోరుతున్నా. 45 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నా­రు? వారికి తోడుగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదు.  

ఇంటిని నిలబెడుతూ.. 
ప్రతి అక్కచెల్లెమ్మ సొంత కాళ్లపై నిలబడేలా క్రమం తప్పకుండా చేయూత సాయంతోపాటు  బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ అమూల్, ఐటీసీ, పీ అండ్‌ జీ, రిలయన్స్, హిందుస్తాన్న్‌ లీవర్‌ తదితర కంపెనీలతో అనుసంధానించి తోడ్పాటునిస్తున్నాం. ప్రభుత్వం ఏటా రూ.18,500 చొప్పున ఇస్తోంది కాబట్టి కంపెనీలు, బ్యాంకులు కూడా వారికి అండదండలు అందించాయి. 1.69 లక్షల మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు నిర్వహిస్తుండగా 85,630 మంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు.

3,80,466 మంది గేదెలు, ఆవులు కొనుగోలు చేశారు. 1,34,514 మంది మేకలు కొనుగోలు చేశారు. 88,923 మంది ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తుండగా మరో 3,98,422 మంది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాల్లో ఉన్నారు. ఇంకో 2,59,997 మంది రకరకాల వ్యాపారాలతో సొంత కాళ్లపై నిలబడ్డారు. 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ నెలకు కనీసం రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు.  

నాలుగు విడతల్లో రూ.19,189 కోట్లు.. 
ఒక్క వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారానే 58 నెలల వ్యవధిలో 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. వారికి ఒక మంచి తమ్ముడిగా, అన్నగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి రుణపడి ఉంటా. నవరత్నాల పథకాల ద్వారా మరో రూ.29,588 వేల కోట్ల మేర లబ్ధి పొందారు. ఇదే 33 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను చూస్తే మరో రూ.56,188 కోట్ల మేర కూడా మంచి జరిగింది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతతో గొప్పగా ఎదగాలని ప్రతి అడుగూ ముందుకు వేశాం.

గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ వారికి రిజర్వేషన్‌ కల్పించిన తొలి ప్రభుత్వం ఇదే. గత ప్రభుత్వానికి ఇలా మేలు చేసిన చరిత్రే లేదు. అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. వసతి దీవెన మొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ వారి ఖాతాలకే డబ్బులను జమ చేసి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. 

నాడు ఛిన్నాభిన్నం.. నేడు నెంబర్‌ వన్‌.. 
వైఎస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మనం మళ్లీ ఊపిరి పోశాం. నాడు చంద్రబాబు రుణమాఫీ మోసానికి పొదుపు సంఘాలన్నీ ఏకంగా 18.36 శాతం ఎన్‌పీఏలు, ఔట్‌ స్టాండింగ్‌లుగా చిన్నాభిన్నమయ్యాయి. ఇవాళ ఎన్‌పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే ఉన్నాయి. ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్‌ 1 స్థానంలో నిలిచాయి.

వైఎస్సార్‌ చేయూత ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఏకంగా రూ.19,190 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం అందించింది. కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదైతే ప్రతి అడుగులో అండగా నిలిచిన ఘనత మనది.గతానికి, ఇప్పటికి తేడా చూడమని కోరుతున్నా.  

మాట ఇచ్చిన చోటే... 
అత్యంత బాధ్యతగా వ్యవహరించే 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారే కాకుండా ఆ కుటుంబాలన్నీ బా­గుపడతాయని మనస్ఫూర్తిగా ఆలోచన చే­శాం. క్రమం తప్పకుండా ఏటా రూ.18,750 చొప్పున వారి చేతిలో పెట్టి జీవనోపాధి మా­ర్గాలు చూపిస్తూ ముందుకు సాగుతున్నాం. చేయూత ద్వారా మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయం చేస్తానని ఇదే జిల్లాలోని మాడుగు­ల నియోజకవర్గం కె.కోటపాడులో నాడు చె­ప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళి్టతో నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తూ ఇదే అనకాపల్లి జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.  

మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు.. 
సొంతిల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందచేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇది  దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చారా అంటే ఇచ్చింది సున్నా. తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం సచివాయాల్లో మహిళా పోలీసును నియమించాం. దిశ యాప్, భద్రత కోసం దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు.. ఇలాంటి వ్యవస్థను తెచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థలో ఏకంగా 50 శాతం వరకు మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే సేవలందిస్తున్నారు.  

పదేళ్ల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ చూడండి.. 
చంద్రబాబు పాలనకు మన పాలనకు వ్య­త్యా­సం కళ్లకు కట్టినట్లు తెలియాలంటే గత పదేళ్లుగా మీ బ్యాంకు స్టేట్‌మెంట్లను తీసు­కుని ఒక్కసారి పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మీ అకౌంటుకు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ ఖాతా­ల్లోకి వచ్చాయో మీరే గమనించండి. లక్షాధికారులైన మహిళల జాబితాలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఇటీ­వల కేంద్రం కూడా చెప్పింది.

మేనిఫెస్టోలో హామీలలో 99% అమలు చేసి మరోసారి ఆశీ­స్సులు కోరు­తున్న ప్రభుత్వం మనదే. ఈ 58 నెలల కాలంలో మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు మీరే స్టార్‌ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరుతు­న్నా. చెడిన వ్య­వ­స్థను మార్చడం కో­సం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నా­డు. మీ బిడ్డ ఒక్కడే ఆ పని చేయలేడు. దేవుడి ద­య, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే సాధ్యం.  

బాబు – దత్తపుత్రుడు 8 మోసాలివిగో..
చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది. 2014లో చంద్రబాబు – దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా?  

► రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు. అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్‌మెంట్‌ వచ్చేది. ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు. 


► ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్‌ సిలిండర్లపై  రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు. 
► మహిళల రక్షణ కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 
► ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు.  

► మొదటి సంతకంతో బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామన్నారు. 
► పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు. 
► బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్‌ ఫోన్‌ ఉచితంగా ఇస్తామన్నారు. 
► మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. 

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్లు..
2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు. అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్‌ 2016 నుంచి రద్దు చేశారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్‌ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సెల్‌ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్లు నడిపించారు.

మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు. బెల్ట్‌ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం. అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్‌ పెంచడం మరో గజ మోసం. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement