జగనన్న తోడు చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘జగనన్న తోడు’ ద్వారా మహిళా సాధికారత, సామాజిక సాధికారతలో మరో విప్లవాన్ని సాధించాం. పథకం ద్వారా లబ్ధి పొందిన మొత్తం 16.73 లక్షల మంది చిరువ్యాపారుల్లో 87.13 శాతం మంది నా అక్క చెల్లెమ్మలే కావడం, అందులోనూ 79.14 శాతం మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండటం దీనికి నిదర్శనం. పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించ గలుగుతున్నాం. తద్వారా రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. రికవరీ బాగుండటంతో మళ్లీ రుణాలు అందుతున్నాయి. ఇదంతా ఒక చక్రం మాదిరిగా కొనసాగుతోంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్. ఇందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ ద్వారా చిరువ్యాపారులకు ప్రభుత్వం తోడుగా నిలుస్తూ మానవత్వానికి మరో పేరుగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద ‘పీఎం స్వనిధి’ ద్వారా ఏడు శాతం వడ్డీకి రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఏపీలో జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.3,373 కోట్లు రుణాలు అందజేశామన్నారు.
జగనన్న తోడు ద్వారా వరుసగా 8వ విడత చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇస్తూ, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా కలిపి 3,95,000 మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలను సీఎం జగన్ అందచేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ కింద 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్లను కూడా ప్రభుత్వం అందచేస్తోంది. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏంమాట్లాడారంటే..
దశాబ్దాల దుస్థితికి పరిష్కారం..
లక్షల మంది చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమమిది. చిరువ్యాపారుల బతుకులు ఎలా ఉంటాయో మన కళ్లముందే కనిపిస్తున్నా ఆ కష్టాలను ఎలా కడతేర్చాలని ఎప్పుడూ, ఎవరూ ఇంతలా మనసుపెట్టి, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోలేదు. నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో వారి కష్టాలను చూశా. వ్యాపారం చేసుకోవడానికి కూరగాయలు, పనిముట్లు, ముడిసరుకు కోసం కనీసం వెయ్యి రూపాయిలు పెట్టుబడి అవసరం.
రూ.1,000 అప్పు ఇస్తే ప్రైవేట్ వ్యాపారులు అప్పటికప్పుడే వడ్డీ కింద రూ.100 మినహాయించుకుంటారు. ఇలా రూ.10 వడ్డీకి వెయ్యి రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలా తీసుకుంటే కానీ వారి జీవితాలు ముందుకు సాగని దుస్థితి. దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా దీనికి పరిష్కారం చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
మానవత్వానికి చిరునామా..
మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడాం. బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తూ ఎలాంటి హామీ లేకుండా రూ.10 వేలు అప్పు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. సకాలంలో తిరిగి చెల్లించేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఒక భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ ఇవాళ 8వ దఫా కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం మానవత్వానికి చిరునామాగా నిలిచిందని గర్వంగా చెబుతున్నాం.
ఇతరులకూ ఉపాధి చూపుతున్నారు..
చేతి వృత్తిదారులు, ఫుట్‌పాత్ విక్రేతలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, గంపలు, బుట్టలపై అమ్మకాలు చేసేవారు, ఆటోలు, సైకిళ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవారు, వివిధ వృత్తుల కళాకారులంతా స్వయం ఉపాధితో తాము జీవించడమే కాకుండా మరికొందరికి కూడా ఉపాది కల్పిస్తున్నారు.
ఇలాంటి వారికి జగనన్న తోడు కార్యక్రమం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు రూ.10 వేలు ఎలాంటి గ్యారంటీ లేకుండా అందించి సకాలంలో చెల్లించిన వారందరినీ ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తరపున వడ్డీని వెనక్కి ఇచ్చాం. ఏటా రూ.1,000 చొప్పున ఈ మొత్తాన్ని పెంచుతూ రూ.13,000 వరకూ తీసుకుని వెళ్లేలా పథకాన్ని అమలు చేయడం సంతోషాన్నిస్తోంది.
రుణాలైనా.. రీయింబర్స్‌మెంటైనా
రాష్ట్రంలో గొప్ప విప్లవాత్మక అడుగులు పడుతున్నాయన్నది ఒక అంశం కాగా రెండోది మన ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్రం 7% వడ్డీకి 58,65,000 మందికి ‘పీఎం స్వనిధి’ పేరుతో రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఒక్క ఏపీలోనే 16,74,000 మందికి రూ.3,373 కోట్ల మేర వడ్డీలేని రుణాలివ్వగలిగాం. మనం ఎలా చేయగలిగాం? మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి 7%వడ్డీ మొత్తం కింద రూ.138 కోట్లు చెల్లిస్తే ఒక్క ఏపీలోనే చిరు వ్యాపారులకు రూ.88 కోట్లను వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద తిరిగి అందచేశాం.
జీవనోపాధి కల్పిస్తూ అడుగులు..
మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి 18% ఎన్‌పీఏలుగా ఉంటే మనం వచ్చిన తర్వాత అది 0.3% లోపే ఉంది. పరివర్తన అనేది ప్రతి అడుగులోనూ జరిగింది. అక్కచెల్లెమ్మలు, మహిళా సాధికారత విషయంలో గొప్ప అడుగులు పడుతున్నాయి. వారికి జీవనోపాధి కల్పించేలా అడుగులు వేశాం. అమూల్, రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారికి వ్యాపార అవకాశాలు కల్పించడంతోపాటు బ్యాంకులతో అనుసంధానించి రుణాలతో తోడ్పాటు కల్పించాం. వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాల ద్వారా అన్ని రకాలుగా తోడుగా నిలిచి మహిళ సాధికారత దిశగా అడుగులు వేయించగలిగాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేకూర్చిన లబ్ధి అందుకు నిదర్శనం.
ఎలా సాధ్యమైందంటే..?
మిగిలిన రాష్ట్రాలకు – మనకు ఎందుకు ఇంత తేడా వచ్చింది? మన ఫెర్‌ఫార్మెన్స్ (పనితీరు) మిగిలిన రాష్ట్రాల కన్నా ఎందుకని మెరుగ్గా, భిన్నంగా ఉంది? దేశానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఎలా అడుగులు పడ్డాయి? అనేది ఒకసారి గమనిస్తే మన దగ్గర ఉన్న గొప్పవైన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలే దానికి కారణం. వీటి ద్వారా మనం పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించగలుగుతున్నాం. అందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్.
కొత్త వారికి వడ్డీలేని రుణాలు.. రెన్యువల్
ఇవాళ జగనన్న తోడు 8వ విడతలో మరో 86,084 మంది చిరువ్యాపారులకు రూ.86 కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నాం. వీరితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్ కూడా చేస్తున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.418 కోట్లను 3,95,000 మందికి ఇవాళ కొత్త రుణాలుగా అందిస్తున్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీం ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద రూ.13.64 కోట్లను తిరిగి వారికి ఇస్తున్నాం. మొత్తంగా ఇవాళ దాదాపు రూ.430 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ చిరు వ్యాపారులకు మంచి చేస్తున్నాం.
ఇప్పటిదాకా రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలు
జగనన్న తోడు పథకం ద్వారా తాజాగా చేకూరుస్తున్న లబ్ధితో కూడా కలిపి ఇప్పటివరకు 16,73,576 మంది చిరువ్యాపారులకు రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చాం. దీంతో పాటు వారు కట్టిన వడ్డీలు రూ.88.33 కోట్లను మళ్లీ తిరిగి వెనక్కి ఇచ్చే గొప్ప అడుగులు ఈ నాలుగున్నరేళ్లలో పడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారి వివరాలను గమనిస్తే మొత్తం లబ్దిదారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 5,10,241 మంది మూడుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు రెండు దఫాలు రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించి మళ్లీ తీసుకున్నారు.
గడప గడపలో సంతోషాన్ని చూశాం
చిరు వ్యాపారులు, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబాలు గతంలో అప్పు తీసుకుంటే ప్రైవేట్ వ్యాపారులు ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని రూ.6 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేసేవారు. రూ.10,000 రుణానికి రూ.9,000 మాత్రమే ఇచ్చి రూ.వెయ్యి తిరిగి వసూలు చేసేవారు. ఆ పరిస్థ్ధితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున అందచేస్తూ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. వడ్డీ లేని మొత్తాన్ని ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 వరకూ అందిస్తోంది. ఆ కుటుంబాలన్నీ మేం గడప గడపకూ వెళ్లినప్పుడు సంతోషంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపాయి. – బూడి ముత్యాల నాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ)
ఇన్ని ఆలోచనలు.. మీకెలా సాధ్యం?
నేను పూల వ్యాపారం, టైలరింగ్ చేస్తున్నా. మా ఆయన మెకానిక్. కరోనా సమయంలో డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. రూ.10 వేలు అప్పు తీసుకుంటే వెయ్యి తగ్గించుకుని రూ.9,000 మాత్రమే ఇస్తామన్నారు. ఆ సమయంలో వలంటీర్ జగనన్న తోడు గురించి చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎవరి సిఫారసు లేకుండా నా ఖాతాలో రూ.10 వేలు పడ్డాయి. ఆ తర్వాత సకాలంలో తిరిగి కట్టడంతో వడ్డీ వెనక్కి వచ్చింది. ఇది చాలా గొప్ప ఆలోచన. దేశంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. నాకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ కూడా వచ్చింది. గతంలో మా సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది.
వైఎస్సార్ చేయూతకు కూడా నేను అర్హత పొందడంతో నేరుగా రూ.18,750 నా ఖాతాలోకి వచ్చాయి. ఇలా మూడు విడతల్లో లబ్ధి పొందా. ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుంది. ఇలా నాకు అన్ని పథకాలు అందడంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. నా కోడలు కాన్పు సమయంలో సిజేరియన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.1.50 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేరడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పైగా తిరిగి రూ.5,000 ఓ అన్నలా ఆర్థిక సాయం అందచేశారు. ఇన్ని ఆలోచనలు మీకెలా వస్తున్నాయి అన్నా? మా అమ్మ గతంలో ఫించన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేది.
ఇప్పుడు వలంటీర్ ఇంటి వద్దే ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. ఈసారి రూ.3,000 పెన్షన్ తీసుకుంది. మిమ్మల్ని నా పెద్ద కుమారుడు అని గర్వంగా చెబుతోంది. నాకు ఇల్లు కూడా వచ్చింది. మీరు కులం, మతం, రాజకీయం చూడకుండా అన్నీ గొప్పగా చేస్తున్నారు. మమ్మల్ని ఇప్పుడు వ్యాపారస్తులుగా గుర్తించి గౌరవిస్తున్నారు. గతంలో పేదలను ఎవరూ గుర్తించలేదు. ఈరోజు మేం బ్యాంకులకు వెళ్లి ధైర్యంగా కూర్చుని లోన్ కావాలని అడుగుతున్నామంటే మీరే కారణం. మీరు సీఎంగా రావడం మా అదృష్టం. మిమ్మల్ని తిరిగి గెలిపించుకుంటాం.
– లక్ష్మీదేవి, చిరువ్యాపారి, అనంతపురం
మీ చిరునవ్వుతో రాష్ట్రంలో వెలుగులు
ఎవరి పూచీకత్తు లేకుండా బ్యాంకులో రూ.10 వేలు ఇచ్చారు. మళ్లీ చెల్లించడంతో వడ్డీ తిరిగి ఇచ్చారు. టైలరింగ్ ద్వారా నెలకు రూ. 6,000కిపైగా సంపాదిస్తున్నా. నాకు అమ్మ ఒడి వస్తోంది. విద్యా దీవెన ఇస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి. గవర్నమెంట్ స్కూళ్లలో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. మీరు మా నుంచి వచ్చారు కాబట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్. మా గ్రూప్ ద్వారా బ్యాంకులో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ వస్తోంది. ఆసరా ద్వారా రూ.3.60 లక్షలు మా గ్రూప్ మొత్తానికి ఇవ్వగా నాకు రూ.36 వేలు వచ్చాయి. నవరత్నాలలో భాగంగా ఇల్లు కూడా వచ్చింది.
మా నాన్నకు హార్ట్ ఎటాక్ రావడంతో రూ.5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇంటిల్లిపాదీ బాధపడుతున్న సమయంలో మీరు డాక్టర్ రూపంలో కనిపించారు. ఆరోగ్యశ్రీ కింద వెంటనే ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారు. అంతేకాకుండా ఏడాది వరకూ ప్రతి నెలా చెకప్, ఉచితంగా రూ.3,000 మందులు ఇస్తున్నారు. గతంలో వయసు మళ్లిన వారు ఎందుకు బతుకుతున్నామా అని భారంగా గడిపేవారు. ఇవాళ వారంతా ఇంటివద్దే పెన్షన్ ఇస్తున్న మిమ్మల్ని తమ బిడ్డలాగా భావిస్తున్నారు. మా నాన్న కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జగనన్న నాకు దేవుడని చెప్పారు.
ఉదయం నిద్ర లేవగానే మా ఇంట్లో మేమంతా మీ ఫోటో చూస్తాం. మీరిచ్చిన పథకాల ద్వారా నేను రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు లబ్ధి పొందా. మా అత్తమ్మకు ఆసరా సాయం అందడంతో రెండు ఆవులు కొనుగోలు చేశారు. మా మామకు రైతు భరోసా వస్తోంది. ఏపీలో మీ పథకం అందని ఇల్లంటూ లేదు. ఒక్కొక్కరు నాలుగైదు పథకాలు పొందుతున్నారు. గ్యారెంటీగా ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు దాకా ప్రయోజనం పొందుతున్నారు. ఇంతకంటే ఏం కావాలన్నా? మరెవరూ ఇన్ని పథకాలు అందజేయలేదు. మాకు ఏం కావాలో మీకు తెలుసు. మీ చిరునవ్వుతో ఏపీ వెలిగిపోతుంది.
– గౌరి, చిరువ్యాపారి, విజయనగరం
రుణమాఫీ మోసంతో చెవి పోగులు పోయాయి..
రోడ్డు పక్కన కాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాం. కరోనా సమయంలో వ్యాపారం లేక, అప్పులు ఇచ్చిన వారు నానా మాటలు అంటుంటే చావాలో బతకాలో తెలియని పరిస్ధితి ఎదుర్కొన్నాం. అలాంటప్పుడు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు అందాయి. ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 ఇచ్చారు. సకాలంలో తిరిగి చెల్లిస్తున్నాం. మాకు వడ్డీ భారం లేకుండా తిరిగి వెనక్కి ఇస్తున్నారు. గతంలో రోడ్డు పక్కన వ్యాపారం చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మీరు అందించిన సాయంతో సొంతంగా షాప్ పెట్టుకుని ఓనర్‌గా నిలబడ్డాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ అంటే నమ్మి మోసపోయాం. వడ్డీల మీద వడ్డీ వేసి నోటీసులు పంపారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. దీంతో బంగారం తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా లోన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం నన్ను చాలా మోసం చేసింది. నాడు చెవిదిద్దులు కూడా లేని నేను ఈరోజు గొలుసు వేసుకున్నానంటే నిజంగా మీ దయవల్లే జగనన్నా! అలాంటిది మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామన్నా! మాకు వేరే సీఎం, వేరే గవర్నమెంట్ ఎందుకన్నా! మాకు మీరుంటే చాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు అమ్మా నువ్వు జగన్‌గారితో మాట్లాడాలని మా పాప ముద్దు పెట్టి పంపింది. టెన్త్ చదువుతున్న మా పాప గతంలో సంక్రాంతి సెలవులు వస్తే ఊరికి వెళ్లేది. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హోమ్‌వర్క్‌లు చేసి సార్‌లకు పంపాలట. ఇప్పుడు చదువులు చాలా బాగున్నాయి. నాడు – నేడు ద్వారా స్కూళ్లు ఎంతో బాగున్నాయి.
స్కూల్‌కు ఒక్క పూట మానేస్తే ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఆరోగ్యం బాగోలేదంటే తగ్గిందా లేదా అని తరువాత విచారిస్తున్నారు. నా భర్తకు గుండె పోటు రావడంతో ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ ఆసుపత్రిలో వైద్యం చేశారు. మా అమ్మమ్మ విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. ఆమె దగ్గర ఎవరూ లేకపోయినా ఆసుపత్రిలో వారే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. మందులు ఇచ్చి కోలుకున్న తర్వాత మాకు ఫోన్ చేసి చెబుతున్నారు.
ఇదంతా ఆరోగ్యశ్రీ వల్లే! మా అమ్మమ్మ జగన్‌గారికి చూపించమని తన వీడియో కూడా పంపింది. ఆవిడ తరపున కూడా మీకు ధన్యవాదాలు అన్నా! ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ కాపులను గుర్తించలేదు. మీరు కాపు మహిళలకు సాయం చేస్తున్నారు. ఆ డబ్బులతో చీరల వ్యాపారం చేస్తున్నా. రొటేషన్‌తో రూ.50 వేలకు పెంచగలిగా. నేను అమ్మ ఒడి కూడా తీసుకుంటున్నా. నా భర్తకు పెన్షన్ వస్తోంది. కలెక్టర్ పక్కన కూర్చుని మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
– అడబాల సత్యవతి, చిరువ్యాపారి, కృత్తివెన్ను, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి
Comments
Please login to add a commentAdd a comment