ప్రభుత్వ కార్యక్రమాలపై కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్ జగన్
అమరావతి: అవ్వాతాతలకు పెన్షన్ల పెంపుతో పాటు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను అమలు చేస్తూ ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చడం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు అని మరోసారి రుజువు చేసుకుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇదే సందేశాన్ని అవ్వా తాతలతో పాటు ప్రతి లబ్ధిదారుడికీ, ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని అధికార యంత్రాంగానికి సూచించారు. జనవరిలో మూడు కార్యక్రమాలతోపాటు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం కలిపి మొత్తం నాలుగు ప్రధాన కార్యక్రమాలను తలపెట్టామని, వీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా బ్రహ్మాండంగా జరిగేలా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ప్రతి కార్యక్రమానికి నిర్దేశించిన విధంగా ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. జనవరి నుంచి 8 వరకు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ రూ.3 వేలకు పెంపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని, రెండో కార్యక్రమంగా జనవరి 19న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, మూడోది జనవరి 23 నుంచి 31 వరకు ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని తలపెట్టగా నాలుగో కార్యక్రమం ‘వైఎస్సార్ చేయూత’ ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టా్మత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
1 నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3,000
1వతేదీ నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ అవ్వాతాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారు పేరు అని మరోసారి రుజువు చేస్తున్నాం. పెన్షన్ల పెంపు సందర్భంగా జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2019లో మన ప్రభుత్వం రాక ముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చారు.
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 చేశాం. ఇప్పుడు రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తున్నాం. గత సర్కారు హయాంలో పెన్షన్ల కోసం సగటున నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.1,950 కోట్లు వ్యయం చేస్తున్నాం. మనం రాక ముందు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు దాకా పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే కాగా ఇవాళ దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.
మంచి మార్పు తేగలిగాం
ప్రతి అడుగులోనూ అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఎవరూ ఇబ్బందులు పడకూడదని మునుపెన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా ఒకటో తారీఖు రోజు.. అది ఆదివారమైనా, పండుగైనా సరే పొద్దునే వలంటీర్ చిక్కటి చిరునవ్వుతో ఇంటివద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఈ మార్పు ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1.17 లక్షల కొత్త పెన్షన్లు కూడా 1 నుంచే..
అర్హత ఉండీ ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి వారికి కూడా పథకాలను వర్తింపచేసే బై యాన్యువల్ (ఏడాదికి రెండు దఫాలు) కార్యక్రమం జనవరి 5వతేదీన జరుగుతుంది. ఆలోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల కొత్త పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు. దీంతో 66,34,742మందికి సుమారు రూ.1,968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. క్రెడిబిలిటీకి అర్ధం చెబుతూ పని చేస్తోంది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి.
అవ్వాతాతలు వేచి చూడకుండా
పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేను (సీఎం జగన్) కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో వీటిని నిర్వహించాలి. 8 రోజులపాటు పెంచిన పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జరుగుతాయి. ఏ మండలాల్లో ఏ రోజుల్లో నిర్వహించాలో ముందుగానే షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలి.
లబ్ధిదారులకు సీఎం లేఖ, వీడియో సందేశం
పెంచిన పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, ఉత్సాహవంతులు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, పార్టీ సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలి. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇలా పట్టించుకున్న ప్రభుత్వం చరిత్రలో లేదు
రాష్ట్ర చరిత్రలో అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో లేదు. పెద్దల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దే పెన్షన్ డబ్బులు అందిస్తున్నాం. వారి కోసం పట్టించుకునే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ లాంటివి గతంలో ఎప్పుడూ లేవు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బులు ఎక్కడా ఇవ్వలేదు. చెప్పిన మాటను నెరవేర్చాలనే కృత నిశ్చయంతో మన ప్రభుత్వం అడుగులు వేసింది.
ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రతి లబ్ధిదారుడికీ తెలియచేయాలి. ఒక్క పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.23 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలుస్తూ సమర్థంగా దీన్ని నిర్వహిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment