సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా పక్షపాతి ప్రభుత్వంగా నిరూపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన 16 నెలల వ్యవధిలో కేవలం నాలుగు పథకాల ద్వారానే 2,42,73,936 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.18,721.12 కోట్ల నగదును బదిలీ చేయడం విశేషం. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు తీసుకోకుండా జమ చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇంత పెద్దఎత్తున మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. (చదవండి: స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
1) వైఎస్సార్ ఆసరా- 87.74 లక్షల మందికి రూ.6,792.21 కోట్లు
- గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న రూ.14,204 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని వాగ్దానం చేసి, ఆ తర్వాత ఎగనామం పెట్టింది. వైఎస్ జగన్ గత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో వారికే ఇస్తానన్న మాట మేరకు వైఎస్సార్ ఆసరా పేరిట తొలి విడతగా 87,74,674 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు రూ.6,792.21 కోట్లు జమ చేశారు.
2) సున్నా వడ్డీ పథకం- 90.37లక్షల మందికి రూ.1400.08 కోట్లు
- గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకి మంగళం పలికింది. వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు పొదుపు సంఘాల్లోని 90,37,255 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.1400.08 కోట్లను జమ చేశారు.
3) వైఎస్సార్ చేయూత- 22.28 లక్షల మందికి రూ.4,179.20 కోట్లు
- వైఎస్సార్ చేయూత కింద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న 22,28,909 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. తొలి విడతగా రూ.4,179.20 కోట్లను జమ చేసింది. దీనిని తోడు మహిళలు వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల ఆర్థిక సాయంతోపాటు పెద్ద కంపెనీల సహకారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.
4) అమ్మ ఒడి- 42.33 లక్షల మందికి రూ.6349.63 కోట్లు
- పేదరికం కారణంగా తమ పిల్లలను చదివించకుండా ఏ తల్లీ రాష్ట్రంలో ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఏటా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తామన్న మాట మేరకు తొలి ఏడాది 42,33,098 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.6349.63 కోట్లను జమ చేశారు. ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించారు.
నాతో పాటు మా అత్తకూ పథకాలు
మా కుటుంబంలో నాకు అమ్మ ఒడి కింద రూ.15 వేలు, సున్నా వడ్డీ కింద రూ.3 వేలు, ఆసరా కింద రూ.10,800 బ్యాంకులో జమ చేశారు. మా అత్త బ్రహ్మమ్మకు చేయూత కింద డబ్బులు జమ చేశారు. సున్నా వడ్డీ కింద రూ.3 వేలు, ఆసరా కింద రూ.10,800 బ్యాంకులో వేశారు. ఇలా మా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు వేయడం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు.
- సి.అనిత, ఎఎస్‌పాడు గ్రామం, మండలం, ప్రకాశం జిల్లా
ప్రభుత్వం డబ్బులు వేయడం ఇప్పుడే చూస్తున్నాం
మా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఎన్నికలకు ముందు చెప్పిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, అమ్మ ఒడి కింద నా బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు వేశారు.
- కోబాకు తనూజ, నిడిగల్లు పంచాయతీ, బాలాయపల్లి మండలం, నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment