సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలు రాష్ట్రంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక రీతిలో ఈ పథకాలను అమలు చేయడమే కాకుండా, ఈ పథకాల లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించడానికి తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక చక్రం వేగం పుంజుకుంటోంది. ఈ పథకాలను ప్రకటించినప్పుడు కొంత మంది పెదవి విరిచినా, ప్రస్తుతం అమలు అవుతున్న తీరు చూసి, వాటి ఫలితాలను బేరీజు వేసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పథకాలు వృథా ఖర్చు అన్న నోళ్లే.. ఇప్పుడు సరికొత్త వ్యాపారాలకు ఈ పథకాలు నాంది పలికాయంటుండటం విశేషం. ఓ వైపు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఏర్పడిన నేపథ్యంలో, రాష్ట్రంలో సంప్రదాయ, ఆధునిక సాంకేతికత మేళవింపుతో పెద్ద సంఖ్యలో పేద మహిళలు వ్యాపార రంగంలోకి అడుగిడటాన్ని యావత్ దేశం ఆసక్తిగా పరిశీలిస్తోంది. చేయూత, ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన సొమ్ముతో లబ్ధిదారులైన మహిళలు ఏ విధంగా ఉపాధి పొందుతున్నారనే విషయం శుక్రవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.
► వైఎస్సార్ ఆసరా, చేయూత వల్ల 16 లక్షల మందికిపైగా లబ్ధి కలిగింది. వీరిలో 66,702 మంది రిటైల్ దుకాణాలకు ఆప్షన్ ఇచ్చారు. వీరిలో ఇప్పటికే 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో వ్యాపారాలు ప్రారంభించడానికి మరింత మంది మహిళలు సమాయత్తమవుతున్నారు.
► గేదెలు, ఆవుల కోసం 4 లక్షల మంది ఆప్షన్ ఇచ్చారు. 1.06 లక్షల మంది సమగ్రంగా దరఖాస్తు పూర్తి చేశారు. వీరిలో 20 వేల మందికి ఇప్పటికే గేదెలు, ఆవులను అందజేశారు.
► మేకలు, గొర్రెలకు 2 లక్షల మందికి పైగా ఆప్షన్ ఇవ్వగా, 70 వేల మంది సమగ్రంగా దరఖాస్తు పూర్తి చేశారు. వీరిలో ఇప్పటికే 20 వేల మందికి వాటిని అందజేశారు.
► మిగిలిన లబ్ధిదారుల్లో సింహభాగం ఇతరత్రా వ్యాపారాలకు శ్రీకారం చుట్టారు. కొందరు ఇళ్లలోనే వ్యాపారాలను ప్రారంభించగా, మరికొందరు చిన్నపాటి దుకాణాలను బయట ఏర్పాటు చేసుకుంటున్నారు.
చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఏజెన్సీని ఏర్పాటు చేయండి
► వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల కింద ఆప్షన్లు ఎంచుకున్న వారికి ఉపాధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు ఒక ఏజెన్సీని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
► వీలైనంత త్వరగా వీరందరికీ తోడుగా నిలవాలని.. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు కదలాలని చెప్పారు. రెండో విడత ఆసరా, చేయూత అందించేలోగా ఈ ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
► గొర్రెలు, మేకలు, పాడి పశువులు కోరుకున్న లబ్ధిదారులకు గడువుకన్నా ముందుగా వాటిని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
► చేయూత, ఆసరా కింద వ్యాపారాలు నడుపుకుంటున్న వారికి ఏదైనా సమస్య వస్తే, వెంటనే తీర్చడానికి రిటైల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్‌టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, జ్యుయలరీ, కెమికల్ తదితర వ్యాపారాలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారు దాదాపు 16.25 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
► వీరందరికీ స్థిర ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉపాధి మార్గాలను చూపుతున్నామని వివరించారు.
జీవనోపాధిపై దృష్టి సారించాలి
► జగనన్న జీవక్రాంతి ద్వారా డిసెంబర్ 2021 నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు అందజేస్తామని, ప్రతి నెలా 5 వేల మందికి మేకలు, గొర్రెలు అందజేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా డిసెంబర్ 2021 నాటికి మరో 1,06,376 యూనిట్లు అందజేస్తామని తెలిపారు.
► జగనన్న తోడు కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరయ్యేలా చూడాలని బ్యాంకర్లను సీఎం ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా మిగిలిన వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే వివిధ పథకాల అమలులో ఏపీ చాలా ముందుకు దూసుకుపోతోందని బ్యాంకర్లు తెలిపారు.
► ఉపాధి హామీ పథకం ప్రారంభమయ్యాక 2020–21లో అత్యధికంగా 23.28 కోట్ల పనిదినాలు కల్పించామని అధికారులు తెలిపారు. జూన్‌లో అత్యధికంగా 7.98 కోట్ల పని దినాలు కల్పించామని చెప్పారు.
► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌ల నిర్మాణాల పురోగతిపై సీఎం చర్చిస్తూ.. ఈ పనులు వేగంగా ముందుకు సాగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment