Andhra Pradesh: ఆర్థిక శక్తికి ప్రతిరూపం  | CM Jagan in high-level review on YSR Asara YSR Cheyutha activities | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆర్థిక శక్తికి ప్రతిరూపం 

Published Thu, Sep 16 2021 2:15 AM | Last Updated on Thu, Sep 16 2021 8:21 AM

CM Jagan in high-level review on YSR Asara YSR Cheyutha activities - Sakshi

గత ఏడాది ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్, రిలయన్స్‌ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్‌గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. తద్వారా మరింత మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.           
– సీఎం జగన్‌తో అధికారులు 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు చూపుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆసరా, చేయూత ద్వారా మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఉపాధి మార్గాలు, వాటి అమలు కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు వివరించారు. మొదటి విడత ఆసరా కింద 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరిందని, ప్రభుత్వం రూ.6,330.58 కోట్లు మహిళల చేతిలో పెట్టిందని తెలిపారు. రెండో విడత ఆసరాకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనిఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో ఆ జాబితాలను ప్రదర్శించామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయం సాధించిన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని, ఇందు కోసం వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశు పోషణ ద్వారా పొందుతున్న ఆదాయ వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..  
క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
గత ప్రభుత్వం మోసం చేసింది 
► గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కచెల్లెమ్మలు చెల్లించలేదు. చివరకు వడ్డీ కూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారింది.  
► 2014లో చంద్రబాబు అక్కచెల్లెమ్మల రుణాలను మాఫీ చేసి ఉండి ఉంటే, అక్కడితో భారం పోయేది. కానీ చంద్రబాబు కట్టవద్దని చెప్పి, హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను ఆదుకోకపోవడం వల్ల మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అయ్యింది. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి.  
► ఈ పరిస్థితిలో అక్కచెల్లెమ్మలు నా పాదయాత్రలో అడుగడుగునా బాధలు చెప్పుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని, మా పరిస్థితి బాగోలేదని కోరారు. 
 
మనందరి ప్రభుత్వం అండగా నిలిచింది 
► అక్కచెల్లెమ్మల కష్టాలను కళ్లారా చూసిన నేపథ్యంలో మనందరి ప్రభుత్వం ఆసరా, చేయూతలను తీసుకొచ్చింది. వారు కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా 2016లో రద్దు అయిన సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింప చేసింది. 
► మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించింది.  
► మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి, మరింత మందికి లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక చేపట్టాలి. చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా ఏ విధంగా ఉపాధి పొందవచ్చో అవగాహన కల్పిస్తూ పది రోజుల పాటు విస్తృత ప్రచారం చేపట్టాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి.  
 
ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం  
► రెండో విడత ఆసరాను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి. ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలి. ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్‌ ఇంకంబర్డ్‌ ఖాతాల్లో జమ చేయాలి. 
► స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు స్పాట్‌ డాక్యుమెంటేషన్‌ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. 
► మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్‌ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి. మనం ఎలాంటి ఉపాధి మార్గం చూపినా మహిళలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
సుస్థిర ఆర్థిక ప్రగతికి మార్గాలు 
► వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.  
► రిటైల్‌ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం తదితర ఉపాధి మార్గాలను కల్పించామని వివరించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.  
► ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement