Interest loans
-
Andhra Pradesh: ఆర్థిక శక్తికి ప్రతిరూపం
గత ఏడాది ప్రాక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. తద్వారా మరింత మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. – సీఎం జగన్‌తో అధికారులు సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు చూపుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆసరా, చేయూత ద్వారా మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఉపాధి మార్గాలు, వాటి అమలు కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు వివరించారు. మొదటి విడత ఆసరా కింద 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరిందని, ప్రభుత్వం రూ.6,330.58 కోట్లు మహిళల చేతిలో పెట్టిందని తెలిపారు. రెండో విడత ఆసరాకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనిఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో ఆ జాబితాలను ప్రదర్శించామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయం సాధించిన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని, ఇందు కోసం వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశు పోషణ ద్వారా పొందుతున్న ఆదాయ వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసింది ► గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కచెల్లెమ్మలు చెల్లించలేదు. చివరకు వడ్డీ కూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారింది. ► 2014లో చంద్రబాబు అక్కచెల్లెమ్మల రుణాలను మాఫీ చేసి ఉండి ఉంటే, అక్కడితో భారం పోయేది. కానీ చంద్రబాబు కట్టవద్దని చెప్పి, హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను ఆదుకోకపోవడం వల్ల మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అయ్యింది. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి. ► ఈ పరిస్థితిలో అక్కచెల్లెమ్మలు నా పాదయాత్రలో అడుగడుగునా బాధలు చెప్పుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని, మా పరిస్థితి బాగోలేదని కోరారు. మనందరి ప్రభుత్వం అండగా నిలిచింది ► అక్కచెల్లెమ్మల కష్టాలను కళ్లారా చూసిన నేపథ్యంలో మనందరి ప్రభుత్వం ఆసరా, చేయూతలను తీసుకొచ్చింది. వారు కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా 2016లో రద్దు అయిన సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింప చేసింది. ► మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించింది. ► మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి, మరింత మందికి లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక చేపట్టాలి. చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా ఏ విధంగా ఉపాధి పొందవచ్చో అవగాహన కల్పిస్తూ పది రోజుల పాటు విస్తృత ప్రచారం చేపట్టాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి. ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం ► రెండో విడత ఆసరాను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి. ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలి. ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్ ఇంకంబర్డ్ ఖాతాల్లో జమ చేయాలి. ► స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు స్పాట్ డాక్యుమెంటేషన్ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. ► మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి. మనం ఎలాంటి ఉపాధి మార్గం చూపినా మహిళలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి మార్గాలు ► వైఎస్సార్ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ► రిటైల్ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం తదితర ఉపాధి మార్గాలను కల్పించామని వివరించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వడ్డీల వలయంలో చిక్కి దంపతుల ఆత్మహత్య
పాలకోడేరు: ఆ దంపతులు వడ్డీల వలయంలో చిక్కి ఏడాదిన్నర కుమారుడికి విషమిచ్చి ఊపిరి తీశారు. ఆ వెంటనే వారు కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చీడే పరశురామ్(45), ధనసావిత్రి(30) వ్యవసాయదారులు. మంగళవారం ఉదయం ఆ దంపతులు తమ కుమారుడు నాగవెంకట శ్రీనివాస్‌తో కలిసి కుముదవల్లి సమీపంలోని సరుగుడు తోటలోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు బంధువులకు వాట్సాప్ మెసేజ్‌లు పెట్టడంతో వారంతా అక్కడికి చేసుకునేసరికే ముగ్గురూ విగత జీవులై కనిపించారు. వడ్డీల మాయలో పడి.. ధనసావిత్రి పుట్టిల్లైన అత్తిలిలో చోడిశెట్టి హైమ అనే మహిళ చిట్టీలు వేస్తూ, వడ్డీ వ్యాపారం చేస్తుండేది. ఆమెకు ధనసావిత్రితో పరిచయం ఉండటంతో అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు రూ.9 లక్షలు అప్పు తీసుకుంది. ఆ తరువాత తెలిసిన వారి నుంచి తక్కువ వడ్డీకి సొమ్ములు తీసుకుని తనకిస్తే.. నూటికి రూ.5 చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికింది. ఇలా ధనసావిత్రి దంపతుల బంధువుల నుంచి రూ.25 లక్షలకు పైగా సేకరించిన హైమ ఐపీ పెట్టింది. ఈ విషయం తెలియడంతో ధనసావిత్రి బంధువులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చోడిశెట్టి హైమ అధిక వడ్డీ ఆశ చూపి చాలామంది నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఏలూరుకు చెందిన కానిస్టేబుల్ ఉచ్చులోపడిన హైమ.. అతడి సూచన మేరకు ఐపీ పెట్టి ఊరినుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
సాధికారతకు సాయమేదీ?
సాక్షి నెట్వర్క్: వాళ్లంతా పేదలు, సామాన్య, మధ్యతరగతి గృహిణులు.. మహిళా సంఘాలుగా ఏర్పడి రూపాయి, రూపాయి కూడబెడుతూ పొదుపు చేస్తున్నారు.. ఆ మొత్తానికి మరికొంత కలిపి ప్రభుత్వం రుణాలుగా ఇస్తుంది.. వడ్డీతో సహా సక్రమంగా తిరిగి చెల్లిస్తే.. వడ్డీ మేరకు సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. మహిళల సాధికారతకు తోడ్పాటు, ఆర్థిక వెసులుబాటు కోసం ఈ వడ్డీలేని రుణాల పథకాన్ని తెచ్చింది. ఇదంతా సాఫీగా జరిగితే సరే. కానీ ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి.. అంటే దాదాపు రెండున్నరేళ్ల నుంచి మహిళా సంఘాలకు వడ్డీని రీయింబర్స్ చేయడం లేదు. ఇలా చెల్లించాల్సిన వడ్డీ సొమ్ము ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.1,113.04 కోట్లు! వడ్డీ సొమ్ము అందకపోతుండడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్వావలంబన కోసం.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు డ్వాక్రా పథకాన్ని ప్రారంభించాయి. సాధారణంగా ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది వరకు.. వికలాంగుల సంఘాల్లోనైతే ఐదు నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు. ఇలా గ్రూపుగా ఏర్పడే మహిళలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి.. ఆ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఆ సొమ్ము ఓ నిర్ణీత స్థాయికి చేరాక.. గ్రూపులోని సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా రుణాలు మంజూరు చేస్తారు. ఆ రుణాన్ని వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి. ఇలా రుణం తీసుకున్న మహిళలు కిరాణా దుకాణాలు, పాల డెయిరీలు, టైలరింగ్ తదితర రంగాల్లో స్థిరపడ్డారు. అయితే మహిళలకు మరింత తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలకు కేవలం పావలా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాతి ప్రభుత్వాలు పూర్తిగా వడ్డీ లేని రుణాలను అమల్లోకి తెచ్చాయి. అయితే ఇందులో వడ్డీని మినహాయించడం కాకుండా.. తొలుత మహిళలు రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే, తర్వాత ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వం తిరిగి మహిళలకు అందజేసేలా నిబంధన విధించారు. మొదట్లో ఇది బాగానే సాగినా.. గత రెండున్నరేళ్లుగా మాత్రం మహిళా సంఘాలకు వడ్డీ సొమ్ము అందడం లేదు. వడ్డీ భారంతో సతమతం ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ సొమ్మును చెల్లించకపోతుండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి వడ్డీతో సహా రుణం చెల్లించేసినా.. వడ్డీ సొమ్ము రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తీసుకునే రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్నామని, వడ్డీ తమకు భారంగా మారిపోతోందని చెబుతున్నారు. త్వరగా వడ్డీ సొమ్మును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి కోట్లకుపైగా బకాయిలు.. సాధారణ మహిళా గ్రూపులకు 2015 మే నుంచి.. ఎస్సీ, ఎస్టీ గ్రూపులకు 2015 జూలై నుంచి.. వికలాంగ గ్రూపులకు 2015 సెప్టెంబర్ నుంచి వడ్డీ సొమ్ముల చెల్లింపు నిలిచిపోయింది. ఇలా ఇప్పటివరకు తొమ్మిది పాత జిల్లాల్లో కలిపి బకాయిలు రూ.1,149.34 కోట్లకు చేరాయి. ఇందులో అత్యధికంగా పాత నల్లగొండ జిల్లాలో రూ.333.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత మెదక్ జిల్లాలో రూ.207.83 కోట్లు బకాయిలు ఉన్నాయి. లక్ష్యం మేర రుణాల మంజూరూ లేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18)లో మహిళా సంఘాలకు రూ.6,979.56 కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటివరకు రూ.4,354.54 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 62 శాతమే రుణాలు అందాయి. మిగిలింది నెలన్నర రోజులే. ఈ సమయంలో ఇంకా రూ.2,625.02 కోట్ల (38 శాతం) రుణాలు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని అధికారులే పేర్కొంటున్నారు. రుణాలూ సరిగా అందని స్థితి గతంలో మహిళా సంఘాల వారీగా, పొదుపు చేసిన సొమ్ము ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. కానీ బ్యాంకర్లు రకరకాల కారణాలు చెబుతూ రుణాలను సరిగా మంజూరు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏదైనా గ్రామంలో ఒక మహిళా సంఘం సరిగా రుణం చెల్లించకుంటే.. ఆ గ్రామంలోని మొత్తం సంఘాలకు కూడా రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల బ్యాంకర్లు రుణంలో కొంత సొమ్మును ఖాతాలోనే డిపాజిట్‌గా ఉంచాలని మెలిక పెడుతున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల బ్యాంకులో డిపాజిట్ చేయగా మిగిలిన సొమ్మును తలా కొంత పంచుకుని అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యం నీరుగారిపోతోంది. రూపాయి రూపాయి పోగేసి కడితే.. ప్రభుత్వం నుంచి స్వయం సహాయక సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా వీఓ పరిధిలో 29 సంఘాలు ఉన్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ సొమ్ము రావాల్సి ఉంది. రూపాయి.. రూపాయి పోగేసి బ్యాంకులకు చెల్లింపులు చేస్తున్నాం.. అయినా వడ్డీ సొమ్ము విడుదల చేయడం లేదు.. – సీహెచ్.వెంకటలక్ష్మి, వీఓ, నాయుడుపేట, ఖమ్మంజిల్లా రుణం మొత్తం తీర్చేసినా.. మాది బోధన్ మండలం ఆచన్‌పల్లి. పది మందిమి కలసి విజయ మహిళా పొదుపు సంçఘం ఏర్పాటు చేసుకున్నాం. 2014లో బోధన్ స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల రుణం తీసుకున్నాం. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ చెల్లించాం. 2017 మార్చిలో మరోసారి రూ.5 లక్షల రుణం తీసుకుని, కడుతున్నాం. ఇప్పటివరకు వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో మాపై భారం పడుతోంది.. – రత్నకుమారి, విజయ మహిళా పొదుపు సంఘం లీడర్, ఆచన్‌పల్లి, నిజామాబాద్ జిల్లా రూ.1.22 లక్షలకు వచ్చింది రూ.11 వేలే.. నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామ వికాస సమభావన సంఘం సభ్యులు 2015 సెప్టెంబర్ 23న ఇదే గ్రామ ఏపీజీవీబీలో రూ.5 లక్షలు రుణం తీసుకున్నారు. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారు చెల్లించిన వడ్డీ రూ.1,22,812. కానీ సంఘానికి ప్రభుత్వం నుంచి అందిన వడ్డీ రూ.10,993 మాత్రమే. అంటే రూ.1,11,881 వడ్డీ సొమ్ము అందాల్సి ఉంది. సక్రమంగా రుణం చెల్లిస్తున్నా.. వడ్డీ సొమ్ము అందడం లేదని సంఘం సభ్యులు మునుకుంట్ల మమత, గోగిరెడ్డి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. - వికాస్ సమభావన సంఘం సభ్యులు, గట్టుప్పల, నల్లగొండ జిల్లా మూడేళ్లుగా వడ్డీ రావట్లేదు మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లి. ప్రియదర్శిని మహిళా సంఘంలో సభ్యురాలిని. ఇప్పటికి రెండు మూడు సార్లు రుణం తీసుకుని వడ్డీతో సహా కట్టేసిన. కానీ మూడేళ్లుగా వడ్డీ సొమ్ము రావడం లేదు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తున్నామని చెబుతోంది. కానీ మాకు మాత్రం అందడం లేదు.. – భట్టు పద్మ, గాలిపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా -
‘వడ్డీలేని రుణం’ కొనసాగింపు
పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘స్వయం సహాయక గ్రూపుల మహిళలకు‘వడ్డీలేని రుణాలు’ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పంచాయతీరాజ్ మం త్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలపై శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నదని చెప్పారు. తెలంగాణలో స్వయం సహాయక గ్రూపుల మహిళలు తీసుకున్న రుణాలకు గతేడాది అప్పటి ప్రభుత్వం రూ.344.66 కోట్లు వడ్డీ చెల్లించిందని, ఈ ఆర్థిక సంవత్సరం (2014-15)లో వడ్డీలేని రుణాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.485.44 కోట్లు మంజూరు చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు మూడు లక్షల సంఘాలకు చెందిన 30 లక్ష ల మంది మహిళలకు ఆర్థిక భారం తగ్గనుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4.15 లక్షల స్వయం సహాయక గ్రూపులు ఉండగా, రూ.5,921 కోట్లు రుణం తీసుకున్నాయని మంత్రి చెప్పారు. అయి తే.. అందులో మూడు లక్షల సంఘాలు సకాలంలో రుణ వాయిదాలను చెల్లిస్తున్నాయని, వారి రుణాలకు మాత్రమే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందన్నారు. మహిళలందరూ సకాలంలో తమ రుణ వాయిదాలను చెల్లించి వడ్డీ భారం నుంచి మినహాయింపు పొందాలని పిలుపునిచ్చారు. గడువులోగా రుణం చెల్లించిన మహిళల ఖాతాలకు నేరుగా వడ్డీ సొమ్మును ప్రభుత్వం జమ చేయనుందని చెప్పారు. మహిళా సంఘాల రుణాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నందున, ఆయా గ్రూపులకు బ్యాంకు లింకేజీ మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని‘సెర్ప్’ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.